* చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (small savings schemes) వడ్డీ రేట్లను కేంద్రం మరోసారి యథాతథంగా ఉంచింది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమసికానికి పాత వడ్డీ రేట్లే (Interest rates) కొనసాగనున్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2 శాతం వడ్డీ లభించనుంది. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకానికి (PPF) 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంపై 7.5 శాతం లభిస్తుంది. 115 నెలల్లో గడువు తీరుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
* క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఆదాయం భారీగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2473 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 66 శాతం వృద్ధి నమోదైంది. మానటైజ్డ్ సభ్యులు పెరగడం, యూజర్‌ను చేర్చుకునే ఖర్చు తగ్గడం ఇందుకు కారణం. అంతేకాదు నిర్వహణ నష్టాలు సైతం రూ.1024 కోట్లతో పోలిస్తే రూ.609 కోట్లకు తగ్గినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే మానటైజ్డ్ మెంబర్ల సంఖ్య 58 శాతం మేర పెరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ షా పేర్కొన్నారు. యూజర్‌ను చేర్చుకునే ఖర్చు సైతం 40 శాతం మేర తగ్గిందని తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్ వినియోగించే చేసే పేమెంట్ల విలువ కూడా 55 శాతం మేర పెరిగిందని, ఒక్క ఏడాది రూ.6.87 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని చెప్పారు.
* లార్సెన్ అండ్ టూబ్రో(L&T) ఈ రోజు(సోమవారం) దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అభివృద్ధి, అమలు చేయడానికి ఆర్డర్ పొందినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఆర్డర్ L&Tకి..పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్‌కు సంబంధించిన అనుబంధ సంస్థ ‘డిజిటల్ ఎనర్జీ సొల్యూషన్స్’ ద్వారా వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో..ఆంద్రప్రదేశ్, కేరళ, పుడుచ్చేరి, తమిళనాడు, తెలంగాణాలలో ప్రాంతీయ/రాష్ట్ర లోడ్ డిస్పాచ్ కేంద్రాల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు సంబంధించిన డిజిటలైజేషన్ మెరుగుపడుతుంది. డిజిటల్ ఎనర్జీ సొల్యూషన్స్ అనేది పవర్ సిస్టం నిపుణుల ప్రత్యేక సెటప్. ఇది భారత్, మధ్యప్రాచ్యం, యూఎస్‌లో ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు సంబంధించిన డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడానికి అధునాతన గ్రిడ్ సేవలు, పవర్ కన్సల్టింగ్ సర్వీసెస్, సిస్టం ఇంటిగ్రేషన్ పరిష్కారాలను అందిస్తోంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ నష్టాల్లో ముగిశాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 26 వేల మార్కును కోల్పోయి 25,800 స్థాయికి చేరింది. మదుపర్ల సంపద దాదాపు రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.474.4 లక్షల కోట్లకు చేరింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z