* ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది యువత కల. కంపెనీ జీతం, సదుపాయాలు ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపుతుంటారు. అయితే 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో ఎంత జీతం ఇచ్చేవారో తెలుసా? తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 40ఏళ్ల నాటి తన టీసీఎస్ ఆఫర్ లెటర్‌ను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. వేతనం, ఇతర వివరాలను అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘40 ఏళ్ల క్రితం ఐఐటీ బీహెచ్‌యూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్ అయ్యాను. ముంబయి టీసీఎస్ క్యాంపస్‌లో నాకు మొదటి ఉద్యోగం వచ్చింది. నా జీతం రూ.1,300. అప్పట్లో అది చాలా ఎక్కువ. నారీమన్ పాయింట్‌లోని ఎయిరిండియా 11వ అంతస్తు నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేది’’ అంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ తన పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. టీసీఎస్ ఆఫర్ లెటర్ ఫొటోను పంచుకున్నారు.
* ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ఆయన హృదయ నాళానికి సంబంధించి చికిత్స చేసినట్టు వెల్లడించాయి. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని తెలిపాయి. తీవ్ర కడుపునొప్పితో రజనీకాంత్ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి స్టెంట్ వేశారు.
* గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని 3 రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత ఐదేళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి.. సర్వం తానై వ్యవహరించిన గనులశాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు సెప్టెంబరు 26న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి.. వెంకటరెడ్డిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
* నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయంకావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి చెరువును తలపించేలా వరద నీటితో నిండిపోయింది.
* ముంబయి సినీనటి కాదంబరీ జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, ఏసీపీ, సీఐ ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. అడ్వొకేట్ జనరల్ ఎల్లుండి వాదనలు వినిపించనున్నారు. మరో వైపు ఈ కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది.
* హెజ్‌బొల్లా (Hezbollah)ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో లెబనాన్ (Lebanon)లో ఆ గ్రూప్‌పై ఇజ్రాయెల్ (Israel) వరుస దాడులతో విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేపట్టేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. సరిహద్దు నుంచి 60 కి.మీ దూరంలో ఉంటున్న పౌరులంతా ఖాళీ చేయాలని అందులో పేర్కొంది. 2006లో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత రెండింటి మధ్య యూఎన్ బఫర్ జోన్‌గా కొంత ప్రాంతాన్ని ప్రకటించింది. దాని ఉత్తర అంచుభాగంలో లిటానీ నది ఉంటుంది. సరిహద్దు నుంచి అక్కడివరకు దూరం 30 కి.మీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖాళీ చేయమన్న ప్రాంతం దానిని మించి ఉంది.
* హరియాణాలో ఎన్నికల (Haryana Elections) వేడి రాజుకుంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా, ఎలాగైనా అధికారాన్ని ‘హస్తగతం’ చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ రెండు పార్టీల దృష్టీ ‘దక్షిణ హరియాణా’పై పడింది. మొత్తం 4 లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో 27 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందో.. దానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అందరి నమ్మకం. ఈ తరుణంలో ‘దక్షిణ హరియాణా’ ప్రస్తుతం ‘హరియాణా ఎన్నికల గుండె చప్పుడు’గా మారింది. గురుగ్రామ్, ఫరిదాబాద్, భివానీ-మహేంద్రగఢ్ లోక్‌సభ స్థానాల పరిధిలో ‘దక్షిణ హరియాణా’ ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో భాజపాదే ఆదిపత్యం. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు గానూ 16 చోట్ల విజయం సాధించింది. వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇందుకు భాజపా అతీతమేమీ కాదు. ఈసారి ఈ ప్రాంతంలో కమలం జోరు కొనసాగకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
* రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు. ‘‘వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. గ్యాస్ సిలిండర్ పంపిణీని దీపావళి రోజు ప్రారంభిస్తాం. మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. వాలంటీర్లు లేకపోతే ఏం చేయలేరన్నారు. వాళ్లు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు.
* థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్‌ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగివస్తుండగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 25మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. థాయ్‌ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా మృతులకు సంతాపం తెలిపారు. విద్యార్థులు ట్రిప్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
* ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఏర్పాటుచేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ వాపోయారు. అతడు తమ సమాచారం ఇజ్రాయెల్‌కు చేరవేసేవాడని ఆరోపించారు. టెహ్రాన్‌లో మొస్సాద్ సంస్థ ఏ స్థాయిలో వేళ్లూనుకుందో వెల్లడిస్తూ ఈవిషయాన్ని సీఎన్‌ఎన్ తుర్క్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వాస్తవాలను అయన వెల్లడించారు. మొస్సాద్ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్ యూనిట్స్‌ను తన వైపునకు తిప్పుకొందన్నారు. వీరిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారిపోయి ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను చేరవేశారన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారని 2021లో బయటపడిందన్నారు. ఇరాన్‌లో టెల్‌అవీవ్ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించి తేలిగ్గా కీలక సమాచారం చేజిక్కించుకొంటుందని చెప్పారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని చెప్పారు.
* విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు ఓంపురి (Om Puri). ఆయన బయోగ్రఫీ ‘అన్‌లైక్లీ హీరో: ఓంపురి’ విడుదలైన సమయంలో ఓ వార్త తీవ్ర చర్చకు దారితీసింది. పనిమనిషితో అఫైర్ నడిపినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ వివాదంపై పుస్తక రచయిత, ఓంపురి మాజీ భార్య నందిత (Nandita) తాజాగా స్పందించారు. ‘‘తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి ఆయన ఈ బయోగ్రఫీలో వెల్లడించారు. అలాగే వ్యక్తిగత విషయాలను తెలియజేశారు. పుస్తకం రాస్తున్నప్పుడు.. పనిమనిషితో అఫైర్ గురించి ఆయన చెప్పగానే.. ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది? వద్దు అని నేను వారించా. కానీ, ఆయన అంగీకరించలేదు. ‘అందులో తప్పేముంది? అప్పటికి నేను పెళ్లి చేసుకోలేదు. రిలేషన్‌షిప్‌లోనూ లేను. చిన్న అఫైర్ అది. నిజాలు తెలిస్తే తప్పేంకాదు’ అని బదులిచ్చారు. ఆయన మాట ప్రకారం అందులో అన్నీ ఆయన చెప్పిన విధంగా రాశా. పుస్తకం విడుదలయ్యాక అందరూ ఆ విషయం గురించే ప్రస్తావించడం మొదలుపెట్టారు. అది ఆయన్ను బాగా కలచి వేసింది. ‘నా లైఫ్‌లో ఇది ముఖ్యమైన విషయం కాదు. కెరీర్, చిన్నతనంలో నేను ఎదుర్కొన్న సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటే బాగుండేది’ అని అన్నారు’’ అని నందిత తెలిపారు.
* చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసి చూసినా.. వ్యాప్తి చేసినా ఇక నుంచి కటకటాలు లెక్కించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఫోన్, కంప్యూటర్‌లో గుట్టుగా చూస్తే ఎవరూ గుర్తించలేరనుకోవద్దు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కనిపెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరులకు పంపిస్తున్నట్లు వెలుగుచూస్తుండడంతో నియంత్రణపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z