WorldWonders

కోర్టులో సామూహిక అత్యాచార వీడియో ప్రదర్శన-NewsRoundup-Oct 05 2024

కోర్టులో సామూహిక అత్యాచార వీడియో ప్రదర్శన-NewsRoundup-Oct 05 2024

* తిరువూరు పంచాయితీ ఎన్టీఆర్‌ భవన్‌కు చేరింది. వరుస ఫిర్యాదులతో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao)ను పిలిపించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, వర్ల రామయ్య, సత్యనారాయణరాజు తదితరులు కొలికపూడితో మాట్లాడారు. తిరువూరులో జరిగిన పరిణామాలపై వివరణ కోరారు. ‘‘నా పనితీరు వల్ల క్యాడర్‌లో సమన్వయ లోపం ఏర్పడింది, సమస్యలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. నా వల్ల కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు. పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం తిరువూరులో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తా. నా వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటా’’ అని పార్టీ పెద్దలకు కొలికపూడి చెప్పినట్టు సమాచారం.

* ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) (Rajendra Prasad Daughter) కన్నుమూశారు. నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, దర్శకుడు త్రివిక్రమ్‌, నాగ్‌అశ్విన్‌ తదితరులు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

* ఆపరేషన్ బుడమేరు తరహలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో .. కాల్వల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని ప్రధాన కాల్వల స్థితిగతులపై.. సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేపల్లి కాలువ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కాలువలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించేందుకు సన్నద్ధమవ్వాలని చెప్పారు. భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామని వివరించారు.

* విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు పెద్దఎత్తున కానుకలు సమర్పించారు. ప్రకాశం జిల్లా కొండేపి వాసి కల్లగుంట అంకులయ్య అనే భక్తుడు రూ.18 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని అమ్మవారికి బహూకరించారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 6.5 కేజీల వెండితో చేసిన హంసవాహనాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు.

* ఉచిత ఇసుకపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

* అందరూ చూస్తుండగా ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ (Congress) పై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను షేర్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ, హరియాణా నేత దీపిందర్‌ హుడా, ఇతర నేతలు వేదికపై ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని దుయ్యబట్టింది. హరియాణా(Haryana)లో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్ సైనీ (Nayab Singh Saini ) తీవ్రంగా ఖండించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి సెల్జా ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో భాజపా తీవ్ర విమర్శలు చేసింది.

* అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌లు (Kamala Harris) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కున్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్‌ ఆగిపోవడంతో ఏమి మాట్లాడాలో తెలియక ఒకే పదాన్ని రిపీట్‌ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

* గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్‌ చేసినా దాని తాలూకా నకిలీ ఖాతాలు దర్శనమిస్తుంటాయి. అది కంపెనీ అధికారిక ఖాతానేనా? కాదా? అనే విషయం తెలియకపోవడంతో చాలా మంది మోసపూరిత ఖాతాలనే వినియోగిస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) నడుంబిగించింది. అందులోభాగంగా తన సెర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ అందించేందుకు సిద్ధమైంది. ‘‘కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్‌లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్‌సైట్ల పక్కనే చెక్‌ మార్క్‌లను చూపించేలా పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని గూగుల్‌ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్‌, మెటా, యాపిల్‌ కంపెనీల అధికారిక సైట్‌ లింక్‌ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ కనిపిస్తోందని ధవెర్జ్‌ నివేదించింది. టెస్టింగ్‌ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గూగుల్‌ ఈ సదుపాయాన్ని ఇంకా రోలవుట్‌ చేయలేదు.

* ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి.. పలువురితో అత్యాచారం చేయించిన ఘటన (French mass rape Case) ఫ్రాన్స్‌లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెలువరించారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరులు కూడా చూడొచ్చని వెల్లడించారు. అయితే ఆ సమయంలో సున్నిత మనస్కులు, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవాలను వెలికితీసే క్రమంలో కచ్చితంగా అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.

* ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌ పలువురు తెదేపా నేతలు కొనకళ్లను సత్కరించి అభినందనలు తెలిపారు. కొనకళ్ల నారాయణ గతంలో రెండు సార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి పొత్తులో మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించడంతో నారాయణకు టికెట్‌ దక్కలేదు. దీంతో అధిష్ఠానం అయనను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించింది.

* తిరుమలలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకుపైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో వరద నీరు చేరి చెరువును తలపించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z