NRI-NRT

మూడు వర్గాలు…ఆరు ఫిర్యాదులు…తిరువూరు తెదేపా వెతలు!

మూడు వర్గాలు…ఆరు ఫిర్యాదులు…తిరువూరు తెదేపా వెతలు!

ఉమ్మడి ఏపీకి ఉప-ముఖ్యమంత్రిని రెండు సార్లు అందించినప్పటికీ, అభివృద్ధిలో వెనుక, స్థానికేతర ప్రజాప్రతినిధులు ముందు వరుసలో ఉండే నియోజకవర్గంగా తిరువూరు (NTR District) ప్రసిద్ధమైనప్పటికీ ఆ ప్రాంతం గురించి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. తెలీదు. పట్టించుకోలేదు కూడా. అయితే ఇప్పుడు ఆ రికార్డు చెరిపేస్తూ తిరువూరు ఖ్యాతిని ప్రతికూల వాణిలో ఖండాంతరాలు దాటించిన ఘనత మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుదే! ఆయన అధికారం చేపట్టిన 100రోజులకు వర్గపోరుతో విలవిల్లాడిన తిరువూరు తెదేపాను ఆయనకు వ్యతిరేకంగా ఒకేతాటిపైకి తీసుకొచ్చిన చరిత్ర కూడా మన శీనన్నదే!

30ఏళ్లకు పైగా తిరువూరు తెదేపాలో పనిచేస్తున్న నేతను సస్పెన్షన్ చేయడం (ఎమ్మెల్యేకు సస్పెండ్ చేసే అధికారం ఉండదు. జాతీయ పార్టీ అధ్యక్షుడి సూచన మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేయాల్సిన పని అది), జర్నలిస్టులపై దుర్భాషలు, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఎమ్మెల్యే కారణంగా ఆత్మహత్య ప్రయత్నాలు, కచ్చా డ్రైన్ల పేరిట ఆస్తుల ధ్వంసం-చెట్లు నరికివేత-లక్షల రూపాయిల దందా, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా, గుంతలు పూడ్చాల్సింది పోయి అదే గుంతలో కుర్చీ వేసుకుని కూర్చుని నిరసన తెలపడం వంటి సంచలనాలకు మారుపేరుగా తిరువూరు ఇటీవల వార్తల్లో నిలిచిన నేపథ్యంలో ఆదివారం నాడు తిరువూరులో ఏర్పాటు చేసిన నియోజకవర్గవ్యాప్త తెదేపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మొత్తం మూడు చోట్ల అసమ్మతి సెగలు, అస్పష్టమైన హామీలు, తిరువూరుకు సంబంధం లేని మనుషుల మధ్య మమ అనిపించేలా నిర్వహించారు.

ముక్కుసూటి మనిషి విజయవాడ పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం గైర్హాజరీతో మొదలైన ఈ సమావేశాలు చిట్టేలలో తుమ్మలపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో (ఈయన భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేశారు. ఈయన్నే ఎమ్మెల్యే సస్పెండ్ చేశానని ప్రకటించుకుని అభాసుపాలయ్యారు.), రెండోది లక్ష్మీపురంలో (విస్సన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరు, తిరువూరు టౌన్ అసంతృప్తులు, అసమ్మతులతో), మూడోది తెదేపా అధికారిక సమావేశం తిరువూరులో నిర్వహించారు.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం తొలిసారి తిరువూరు నియోజకవర్గ పర్యటనకు ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎంపీ కేశినేని చిన్ని తొలుత లక్ష్మీపురం వెళ్లి అసమ్మతి వర్గంతో చర్చలు జరిపారు. అనంతరం తిరువూరు అధికారిక సమావేశంలో వర్ల రామయ్య, శావల దేవదత్, కొలికిపూడిలతో కలిసి పాల్గొన్నారు. సరిగ్గా అరగంటలో ముగిసిన ఈ సమావేశంలో జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్న క్షమాపణలు గానీ, మహిళలకు తెదేపా రక్షణగా ఉంటుందనే భరోసా గానీ ఇవ్వకుండా కేవలం 5మండలాల (తిరువూరు టౌన్, ఏ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం, తిరువూరు) నుండి 25 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని, కొలికిపూడి తీసుకునే నిర్ణయాలు వీరితో సమన్వయం అయ్యేలా చుస్తామని ఎంపీ హామీనిచ్చి గత వారం రోజులుగా తిరువూరు తెదేపా ఇన్‌ఛార్జిగా తనను నియమిస్తారని ప్రచారం చేస్తున్న శావల దేవదత్ వర్గానికి చెక్ పెట్టారు.

తిరువూరు నియోజకవర్గ స్థాయి తెదేపా ముఖ్య నేతలంతా ఆదివారం నాడు చిట్టేలలో తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. అధికారిక సమావేశానికి వీరంతా గైర్హాజరయ్యారని, లక్ష్మీపురంలో ఎంపీని కలిసి వెనుదిరిగినట్లు సమాచారం. ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ చిట్టేల పర్యటనకు వెళ్లలేదని సమాచారం. లక్ష్మీపురంలో ఎంపీని తిరువూరు జర్నలిస్టులు కలిశారు. వారి సమస్యల పట్ల ఎంపీ సానుకూలంగా స్పందించారు.

తిరువూరులో చిలుకుతున్న ఈ గాలివాన తనకు తుఫానుగా మారకముందే కట్టడి చేయాలని ఎంపీ చిన్ని చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో వేచిచూడాలి. సోమవారం నాడు 25మంది సమన్వయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే కొలికిపూడి, తుమ్మలపల్లి శీను, అతని భార్య కవిత, తెదేపా శ్రేణులతో బెజవాడ ఎంపీ కార్యాలయంలో సమావేశానికి రావాలని సూచించారని సమాచారం. అందరినీ కలుపుకుపోతానని, గతంలో లాగా వ్యవహరించనని కొలికిపూడి చేస్తున్న వాగ్ధానాలు ఎంతమేర నిజమో తెలియాలంటే వేచిచూడక తప్పదు! తిరువూరు అంటే “కొలికిపూడి ఎమ్మెల్యే కదా?” అని తమ నియోజకవర్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఎమ్మెల్యేకు తిరువూరు ప్రవాసులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z