సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ సంబరాలు వేడుకగా నిర్వహించారు. పితృ అమావాస్యనాడు ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు కొనసాగి, చివర్లో సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో, మహిళలు పూలనే గౌరమ్మగా పేర్చి రోజుకో బతుకమ్మగా పూజించి ఆశీస్సులు పొందడం సంప్రదాయం. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి ఈ వేడుకను మరింత రంగరించారు. ఉత్తమంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని తెలియజేసే విశిష్టతను ఉటంకించారు. ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ, సింగపూర్ లో కూడా ఈ సంబరం నిర్వహించడం వల్ల తెలుగువారంతా ఒక్కటైనట్లు అనిపిస్తోందని అన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తదితరులు ఏర్పాట్లను సమన్వయపరిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z