Sports

రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా-NewsRoundup-Oct 12 2024

రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా-NewsRoundup-Oct 12 2024

* Srikalahasti పట్టణంలోని భాస్కరపేట చాముండేశ్వరిదేవి ఆలయం వద్ద ఇద్దరు నేతలు బాహాబాహికి దిగారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ముత్యాల పార్థసారధి, టౌన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ పులి రామచంద్రయ్య మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఆలయ వ్యవహారంలో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు దిగడంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనగురై బయటకు పరుగులు తీశారు.

* సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్‌మెన్‌, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

* ఓవైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Israel-Iran) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో (West Asia) ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా (USA) సిరియాపై (Syria) విరుచుకుపడుతోంది. అక్కడి ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వరుస గగనతల దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసిస్‌ దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతోందని అగ్రరాజ్యానికి కచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు.

* ఇజ్రాయెల్‌- ఇరాన్‌ (Israel-Iran) మధ్య యుద్ధంతో పశ్చిమాసియా (West Asia) అట్టుడుకుతోంది. ఎప్పుడు, ఎలాంటి ఉపద్రవం వచ్చిపడుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ తరుణంలో అమెరికా మిత్రదేశాలకు ఇరాన్‌ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని, అలాంటి పరిస్థితులే ఎదురైతే టెహ్రాన్‌ (Tehran) కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

* పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌ (Iran)లో శనివారం భారీ స్థాయిలో సైబర్ దాడులు (Cyberattacks) జరిగాయి. దాంతో ప్రభుత్వంలోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు అంతరాయం కలిగింది. అలాగే అణుస్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చోటుచేసుకున్నాయి. దీని ఫలితంగా సమాచారం చోరీకి గురైందని ఇరాన్‌ సైబర్‌స్పేస్ విభాగంలో పనిచేసిన మాజీ సెక్రటరీని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా వెల్లడించింది. ‘‘మా అణుస్థావరాలు సైబర్ దాడులకు గురయ్యాయి. ఇంధనం సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్కులు ఇలా పెద్దలిస్టే ఉంది’’ అని ఆయన వెల్లడించారు.

* టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్ జడేజా(Ajay Jadeja)ను జామ్‌నగర్(Jamnagar) రాజ కుటుంబానికి తదుపరి వారసుడిగా ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత జాం సాహెబ్(మహారాజు) శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అజయ్‌ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని పేర్కొన్నారు.

* తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి (Chiranjeevi) భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. చిరంజీవి తరఫున రూ.50లక్షలు, రామ్‌చరణ్‌ (RamCharan) తరఫున మరో రూ.50లక్షల చెక్కులను చంద్రబాబుకు అందజేశారు. విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

* ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ కేంద్రంగా పని చేస్తున్న హెజ్‌బొల్లా (Hezbollah) ప్రతీకారంతో రగిలిపోతోంది. సంస్థ చీఫ్‌ హసన్‌ నస్రల్లా (Hezbollah chief Hassan Nasrallah)ను హతమార్చిన ఇజ్రాయెల్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని పరితపిస్తోంది. అనువైన సమయం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం హైఫా నగరంలోని దక్షిణ ప్రాంతంలో డ్రోన్‌ దాడికి దిగిన హెజ్‌బొల్లా.. గంటల వ్యవధిలోనే మారోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. కీలక లక్ష్యాలపై డ్రోన్లను ప్రయోగించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, తమ దేశంపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించలేదు.

* పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల లెబనాన్‌లో చోటుచేసుకున్న పేజర్ల (Hezbollah Pagers) పేలుడు ఘటనతో ప్రపంచం అవాక్కయింది. హెజ్‌బొల్లా ఫైటర్లకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ పేజర్లను కొనుగోలు చేసింది ఇరాన్‌(Iran) సంస్థ అట. తాజాగా ఐఆర్‌జీసీ ఖుద్స్‌ ఫోర్స్‌ మాజీ డిప్యూటీ కమాండర్ మసౌద్‌ అసదొల్లాహీ ఆ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ స్టేట్‌ టీవీలో ఇది ప్రసారమైంది. అయితే ఆ గంట తర్వాత అదే టీవీ మరో వార్తను ప్రసారం చేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ‘‘హెజ్‌బొల్లా పేజర్ల కొనుగోలు, పంపిణీ వెనక ఏ ఇరాన్‌ సంస్థ పాత్ర లేదు’’ అని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇప్పుడీ వార్తలు ఇరాన్‌లో చర్చనీయాంశంగా మారాయి.

* ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్లతో 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తం 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

* ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. ఆదిపరాశక్తిగా పూజిస్తారు. కానీ భూమ్మీద అడుగుపెట్టిన ఆ పసికందుకు చెత్తకుప్పే దిక్కైంది. తల్లి దగ్గర హాయిగా నిద్రించాల్సిన ఆ బిడ్డ.. వ్యర్ధాల మధ్య గుక్కపట్టి ఏడుస్తోంది. చిన్నారి ఏడుపులను విన్న స్థానికుల సమాచారంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో వెలుగు చూసిన మరో మానవీయ కోణం చూపరుల మనసులను కరిగించింది. పోలీసుల సంరక్షణలో ఉన్న చిన్నారి కుటుంబీకుల ఆచూకీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి వివరాలు తెలియరాలేదు. దీంతో చిన్నారి పరిస్థితిని చూసి..చలించిన సబ్-ఇన్‌స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ దంపతులు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సింగ్ మాట్లాడుతూ 2018లో తమకు వివాహం అయినా ఇప్పటికీ పిల్లలు లేరని.. విజయ దశమి నాడు స్వయంగా దుర్గమ్మే ఈ చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి దత్తత కోసం ఎస్సై, అతడి భార్య రాశి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారని ఇన్‌స్పెక్టర్ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. ప్రస్తుతం శిశువు దంపతుల సంరక్షణలో ఉందని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z