Business

తీవ్రంగా దెబ్బతిన్న సూరత్ వజ్రాల వ్యాపారం-BusinessNews-Oct 13 2024

తీవ్రంగా దెబ్బతిన్న సూరత్ వజ్రాల వ్యాపారం-BusinessNews-Oct 13 2024

* ఏపీ వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా… వాటిని పునఃపరిశీలించాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాల్లోని 113 దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్‌ శాఖ లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 15న ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్‌ను 99 రూపాయలకే విక్రయించేలా సవరణ చేసింది.

* బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంకోర్సో డి’ఎలెగాంజా విల్లా డి’ఎస్టేలో ఒక కాన్సెప్ట్‌గా మొదటిసారిగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. కానీ ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం. బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 617 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ రోడ్‌స్టర్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రెండు సీట్లు కలిగిన ఈ కారు షార్ప్ అండ్ యాంగ్యులర్ ఫ్రంట్ ఎండ్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌ పొందుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్స్ లేకపోవడాన్ని గమనించవచ్చు. లోపలి భాగం మొత్తం ఎరుపు-గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు. గేర్ సెలెక్టర్‌కు క్రిస్టల్ లాంటి రూపాన్ని అందించారు.

* సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్‌లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్‌డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం. పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.ల్యాబ్‌లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.

* దేశీయ ఈక్విటీల్లో విదేశీ మదుపర్ల పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ముదురుతున్న ఘర్షణ వాతావరణం, ముడిచమురు ధరల పెరుగుదల ఒత్తిళ్ల మధ్య ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున నిధులను దేశీయ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. అక్టోబర్‌ ప్రారంభం నుంచి విక్రయాలే భారీగా జరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.58,711 కోట్లను వెనక్కితీసుకున్నారు. ఇరాన్‌- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణం మార్కెట్లో అనిశ్చితిని పెంచాయి. దీంతో ఎఫ్‌పీఐలు భారత్‌ మార్కెట్ పట్ల అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. మరో వైపు భౌగోళిక రాజకీయ సంక్షోభం మధ్య బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర అక్టోబర్‌ 10 నాటికి 79 డాలర్లకు చేరింది. ఇక చైనా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశానికి చెందిన స్టాక్స్‌ రాణిస్తున్నాయి. దీంతో భారత్‌ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. అలా అక్టోబర్‌ 1 నుంచి 11 మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.58,711 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో పెట్టుబడుల ఉపసంహరణ ఏకంగా తొమ్మిది నెలల గరిష్ఠానికి చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z