ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన ప్రవాస భారతీయులు. రతన్ టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త అని, ఆయన మరణం తీరనిలోటని మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన టి.సి.ఎస్ లో రతన్ టాటాతో కలసి పనిచేసి, ఆ తర్వాత విప్రో సంస్థలోచేరి సి.యి.ఒ స్థాయికి ఎదిగిన అబిద్ఆలీ నీముచ్ వాలా రతన్ టాటాకున్న దూరదృష్టి, సాటి ఉద్యోగులతో కలసి పనిచేసిన తీరు, హాస్యపూర్వక సంభాషణలు, టాటా కంపెనీని అభివృద్ధిపధంలో నడిపినతీరు మొదలైన ఎన్నో వివరాలను సోదాహరణంగా వివరించి రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “రతన్ టాటా కంపెనీ ఛైర్మన్ గా తన రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రస్థానంలో కేవలం భారతీయకంపెనీగా ఉన్న టాటా కంపెనీని అంతర్జాతీయకంపెనీ స్థాయికి తీసుకువెళ్ళిన తీరు, కంపెనీ లాభాలను 50 రెట్లు పెంచిన విధానం, లాభాలలో 60 శాతానికి పైగా సమాజాభివృద్ధికి వెచ్చించిన సామాజికస్పృహ అందరికీ ఆదర్శప్రాయం” అంటూ పుష్పాంజలి ఘటించారు.
రతన్ టాటా ప్రతి అడుగులోనూ దేశభక్తి కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని, భౌతికంగా రతన్ టాటా మనకు దూరం అయినప్పటికీ ఆయనచేసిన సేవలు చిరస్మరణీయం అంటూ మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజీవ్ కామత్, మురళీ వెన్నం, రన్నా జానీ, రజనీ జానీ, రాంకీ చేబ్రోలు, తాయాబ్ కుండావాలా, ఫాతిమా కుండావాల, తిరుమల్ రెడ్డి కుంభం, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, లెనిన్ వేముల, విజయ్ బొర్రా, వాసు గూడవల్లి, జిగర్ సోనీ, రాజేశ్వరి ఉదయగిరి, కిశోర్, షోవిన్ మొదలైనవారు రతన్ టాటా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z