ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీపై ఇప్పటికే ఫోకస్ చేసిన బీజేపీ…అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న వరుస సంఘటనలు ఈ విషయానికి బలాన్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయనకు చిక్కులు కల్పించే అవకాశం ఉంది. బిజెపి నాయకత్వం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల తమ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల చేరికలకు బ్రేక్ పడినట్లు బిజెపి నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభ్యుల్లో అత్యధికులను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నేతలు భావించారు. అయితే, జగన్ నిర్ణయం వల్ల వారు బిజెపిలో చేరడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పార్టీ మారినా పదవికి రాజీనామా చేసి వెళ్లాలని అంటూ అలా చేయకపోతే వేటు వేయాలని జగన్ స్పీకర్ ను కోరారు. దానివల్లనే ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి రావడం లేదని భావించిన బిజెపి నేతలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకున్నారు. తమ వ్యూహంలో భాగంగా బిజెపి నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్ తదితరులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేతను కన్నా లక్ష్మినారాయణ తొందరపాటు చర్యగా అభివర్ణించారు. టీడీపి అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే వైసిపి పాలన కూడా అదే దారిలో నడుస్తోందని కన్నా ఇటీవల తిరుపతిలో అన్నారు. రాష్ట్రమంతా పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలపై, నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆయన అన్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు చూస్తే జగన్ కు ముప్పు తప్పదని అనిపిస్తోంది. ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసులు అటువంటి ఆదేశాలు ఇవ్వడం సరి కాదని ఆమె అన్నారు. విశాఖ చర్చిలకు భద్రత కల్పించిన విషయాన్ని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రశాంతమైన విశాఖలో చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఎవరి మెప్పు కోసం ఆ పని చేస్తున్నారని ఆయన అడిగారు. ఎబివీపీ విద్యార్థులకు ముసుగులు వేసి క్రిమినల్స్ మాదిరిగా మీడియా ముందు ప్రవేశపెట్టారని, అది సరి కాదని బిజెవైఎం రాష్ట్రాధ్యక్షుడు రమేశ్ నాయుడు, ిబజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బిజెపి పూర్తి స్థాయి మెజారిటీ రాదనే అంచనాతో కేసీఆర్, కుమారస్వామి, స్టాలిన్, పినరయి విజయన్ లతో కలిసి వైఎస్ జగన్ దక్షిణాది కూటమి కట్టేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా బిజెపి సహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు సంఘటనా పర్వ్ 2019 ఆగస్టు 11వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
భాజపా టార్గెట్ కానున్న జగన్
Related tags :