Business

ప్రయాణీకులకు IRCTC షాక్-BusinessNews-Oct 17 2024

ప్రయాణీకులకు IRCTC షాక్-BusinessNews-Oct 17 2024

* టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్‌ (Advance Booking) చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకు కుదించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2024 నవంబర్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కొత్త నిబంధన నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ.. అక్టోబర్‌ 31 వరకు బుకింగ్‌ చేసుకునే వారికి పాత నిబంధన వర్తిస్తుంది. తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ (Taj Express), గోమతి ఎక్స్‌ప్రెస్‌ (Gomti Express ) వంటి రైళ్ల బుకింగ్‌లో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్‌ వ్యవధి తక్కువగా ఉంది. ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పూ లేదు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ను మెప్పించకపోవడం మరో కారణం. దీంతో సూచీలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. నేడు వెలువడనున్న విప్రో, ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించనునున్నారు. బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా బజాజ్‌ ఆటో షేర్లు ఇవాళ 13 శాతం మేర కుంగాయి. సెన్సెక్స్ ఉదయం 81,758.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,501.36) లాభాల్లో ప్రారంభబైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 80,905.64 కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 221.45 పాయింట్ల నష్టంతో 24,749.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

* Meta Layoffs | టెక్‌ (tech) రంగంలో లేఆఫ్స్‌ (layoffs) పర్వం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్‌ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ‌(AI) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, రియాలిటీ ల్యాబ్స్‌ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్‌ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. రిక్రూటింగ్‌, లీగల్‌ ఆపరేషన్‌.. వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా, మెటా ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో ఏకంగా 11 వేల మందిపై వేటు వేసింది. ఇక గతేడాది రెండు విడతల్లో సుమారు 10 వేల మందిని ఇంటికి సాగనంపింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దం కావడం టెక్‌ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. లేఆఫ్స్‌ గురించి ఇప్పటికే సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్‌ వేదికగా ఎటువంటి యాడ్స్‌ అందించని ప్లాట్‌ఫామ్‌ త్వరలోనే ప్రకటనలు జోడించాలని చూస్తోంది. ఈవిషయాన్ని అమెజాన్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించింది. ఒకవేళ యాడ్‌- ఫ్రీ కంటెట్‌ కావాలనుకొనేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్‌, అమెరికాతో పాటు పలు యూరోపియన్‌ దేశాల్లోని యూజర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించింది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రకటనల్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. అంటే ఇకపై సినిమాలు, షోలు చూస్తున్న సమయంలో ఈ యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఒకవేళ ప్రకటనలు వద్దనుకుంటే యాడ్‌-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర వేదికల కంటే యాడ్స్‌ తక్కువగానే ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే కొత్త ప్లాన్‌ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

* మన దేశం ముడిచమురు దిగుమతులు తగ్గించుకునేందుకు, భారీ స్థాయిలో మిథనాల్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే సరస్వత్‌ బుధవారం వెల్లడించారు. భవిష్యత్తులో భారత్‌.. బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. మిథనాల్‌ తయారీకి పరిశ్రమ ముందుకు రావాలని కోరారు. మిథనాల్‌ అనేది స్వచ్ఛ ఇంధనం. భారీ వాణిజ్య వాహనాల్లోనూ ఇంధనంగా మిథనాల్‌ను వినియోగించొచ్చని సరస్వత్‌ పేర్కొన్నారు. కొచిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) మిథనాల్‌తో నడిచే నౌకను తయారు చేయాలని ఒక విదేశీ కంపెనీకి ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపారు. రెండో అంతర్జాతీయ మిథనాల్‌ సెమినార్, ఎక్స్‌పో 2024కు నీతి ఆయోగ్‌ ఆతిథ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. న్యూ దిల్లీలోని మానెక్షా సెంటర్‌లో ఈ నెల 17-18 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మిథనాల్‌ ఆర్థిక వ్యవస్థ దేశీయంగా 50 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

* భారత్‌కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో చైనా నుంచి భారత్‌కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగా 56.29 బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే వ్యవధితో పోల్చితే 11.5 శాతం అధికం. నాడు 50.48 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు బుధవారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. చైనా తర్వాతి స్థానంలో రష్యా ఉన్నది. కాగా, 2013-14 నుంచి 2017-18 వరకు భారత్‌కు వాణిజ్య భాగస్వామిగా చైనానే అగ్రస్థానంలో ఉన్నది. 2020-21లోనూ ఇంతే. అంతకుముందు యూఏఈ టాప్‌లో ఉండేది. అయితే 2021-22 నుంచి 2023-24 వరకు అమెరికా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాత్రం మళ్లీ డ్రాగన్‌ దూసుకుపోతున్నది.

* సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్‌ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్‌వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్‌ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్‌ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు. అప్లికేషన్స్ అండ్‌ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్‌ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్‌.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z