Food

మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం…ఇవాళ నకిలీ బంగాళదుంపలు-BusinessNews-Oct 18 2024

మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం…ఇవాళ నకిలీ బంగాళదుంపలు-BusinessNews-Oct 18 2024

* ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ‘ఏ’ సిరీస్‌లో ఫోన్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో మరో ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) పేరిట దీన్ని పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లతో తీసుకురావడం విశేషం. శాంసంగ్‌ కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర ₹.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ +256జీబీ వేరియంట్‌ ధర ₹.20,999గా పేర్కొంది. బ్లూ బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ గ్రీన్‌.. రంగుల్లో ఈ మొబైల్‌ లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్డ్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్‌ అందిస్తోంది.

* వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కార్యాలయాలకు రావాలంటూ పలు సంస్థలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసుకే వచ్చి పనిచేస్తున్నారు. కానీ మరికొందరు ఇంటి నుంచి పని చేయడానికే మక్కువ చూపుతున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలకాలని అమెజాన్‌ (Amazon) ఏడబ్ల్యూఎస్‌ సీఈఓ మాట్ గార్మాన్ (Matt Garman) అన్నారు. వారానికి ఐదు రోజులు కార్యాలయానికే వచ్చి పనిచేయాలనే నిర్ణయాన్ని ఆయన బహిరంగా వెల్లడించారు. ఇది ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చన్నారు. కార్యాలయంలో తాజాగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన మాట్‌ గార్మాన్‌.. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించారు. 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ విధానాన్ని స్వాగతించారు. ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడనివారు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావాలనుకొనేవారికి ఇతర కంపెనీలు ఉన్నాయంటూ గర్మాన్‌ హెచ్చరించారు. ‘‘ నూతన విధానాల అమలుకు కృషి చేస్తున్నాం. రిమోట్‌ వర్క్‌ కారణంగా కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో సహకారం కష్టంగా మారుతోంది. మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టం’’ అని ఆయన అన్నారు.

* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. సీఎస్‌ శాంతి కుమారి, దానకిశ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి ఈ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్షమందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబరు 4వ తేదీ నుంచి స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి క్రమంగా కోర్సులను పెంచనున్నారు. ఈ వర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

* ‘ మందు బాబులం. మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహా రాజులం’ అంటూ ఏపీకి చెందిన మందుబాబులు హుషారుగా చిందులు వేస్తున్నారు. పాత మద్యం బ్రాండ్‌లు మళ్లీ వైన్స్‌లో విక్రయిస్తుండడంతో వారిలో పట్టలేని సంతోషం కనిపిస్తోంది. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh ) లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని (New Liquor Policy) తీసుకొచ్చి అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా గత వైసీపీ(YCP) హయాంలో ఉన్న కొత్త బ్రాండ్లను తీసివేసి వాటి స్థానంలో ఎప్పటి నుంచో ఉన్న పాత బ్రాండ్లను అందుబాటులో ఉంచడం పట్ల మద్యం ప్రియులు(Alcohol lovers) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెక్‌డోల్‌ విస్కీ, రాయల్ స్టాగ్, రాయల్‌చాలెంజ్‌, కింగ్‌ ఫిషర్‌, ఓల్డ్‌ మాంక్‌, మెన్షన్‌ లాంటి బ్రాండ్‌లో మళ్లీ విక్రయిస్తుండడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత బ్రాండ్‌లు దొరకలేదని మందుబాబు ఒకరు పేర్కొన్నారు. అప్పటి సరుకులో నాణ్యత లేకపోవడం వల్ల కాళ్లు, చేతులు లాగేసేవని తెలిపారు. మందు తాగిన తరువాత అరగంటలోనే మత్తు ఎక్కి సైకో లాగా ప్రవర్తించేడి వారని వెల్లడించారు. ఇప్పుడు నాణ్యమైన సరుకు అందుతుందని తెలిపారు.

* ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఇటీవల జరిగిన ఫుడ్‌ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో నకిలీ బంగాళాదుంపలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు తాజాగా కనిపించడం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్‌ పూస్తున్నారు. లాభాల కోసం కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి నకిలీవో, ఏవీ అసలువో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు నకిలీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. నకిలీని ఎలా గుర్తించాలి..?

వాసన : నిజమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా నకిలీ ఆలుగడ్డలు కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి.

రంగు : ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. నకిలీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది.

నీటి పరీక్ష : ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏది నకిలీనో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. నకిలీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతూ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన, తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి.

మట్టి : నకిలీ బంగాళాదుంపలపై ఉన్న పూత మట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అదిపోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సి వస్తుంది.

తొక్క : ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ నకిలీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు.

గమనిక : పైన పేర్కొన్న మెలుకువలను పాటించడం ద్వారా మనం మార్కెట్లో దొరికే ఆలుగడ్డల్లో నకిలీవి ఏవో, స్వచ్ఛమైనవి ఏవో గుర్తించవచ్చు.

నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన ఆ ఆలుగడ్డలు తినడంవల్ల కాలేయం, మూత్రపిండాలు లాంటి సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలిని కోల్పోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలుగడ్డలే కాదు, ఏ ఆహార ఉత్పత్తులనైనా గుడ్డిగా కాకుండా, కొంచెం పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z