Business

పెంపుడు జంతువులకు కూడా ఉద్యోగాలు-BusinessNews-Oct 20 2024

పెంపుడు జంతువులకు కూడా ఉద్యోగాలు-BusinessNews-Oct 20 2024

* వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్‌ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు. విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది.

* కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి పోషణ ఆశామాషీ కాదు. చాలా ఖర్చవుతుంది. కానీ మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి చైనాలోని పెట్స్‌. వీటికి జాబ్స్‌ ఇస్తున్నాయి అక్కడి కొన్ని కేఫ్‌లు. చాలా మంది చైనీయులు తమ పెట్స్‌ను వెంటబెట్టుకుని రెస్టారెంట్‌లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. ఇందుకోసమంటూ చైనాలో ప్రత్యేకంగా పెట్‌ కేఫ్‌లు ఉన్నాయి. తమ యజమానులతో పాటు పెట్స్‌ కూడా చిల్‌ అయ్యేందుకు, వినోదం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెట్‌ డాగ్స్‌, క్యాట్స్‌ను నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు. తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. దీని ద్వారా అవి తోటి జంతువులతో కలవడంతోపాటు తిండిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతోంది. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది. పెంపుడు జంతువుల “ఉద్యోగుల” కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనలు, సీవీలు జియావోహోంగ్‌షూ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్‌ కేఫ్‌కి పంపుతోంది. దీని వల్ల తనకు ఏసీ ఖర్చులు ఆదా అవుతున్నట్లు సీఎన్‌ఎన్‌కి చెప్పారు. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్‌ దొరకడం కష్టం. జిన్‌ జిన్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్‌ కోసం వెతుకుతున్నారు. జియావోహోంగ్‌షూలో సీవీ పెట్టారు.

* ఢిల్లీకి చెందిన ‘కుశల్ అరోరా’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది. నా వయసు 23 సంవత్సరాలు. ఏడాదికి 500000 డాలర్లు (రూ.4.2 కోట్లు కంటే ఎక్కువ) సంపాదిస్తున్నాను. నా వయసులోని విద్యార్థులు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సోషల్ ఈవెంట్స్ మిస్ అయ్యాను. ఎన్నో వైఫల్యాలను చూశాను. అయినా నేను దీనినే ఎంచుకున్నాను. మీరు కూడా మీ కలల జీవితాన్ని నిర్మిస్తున్నారా? అని ప్రశ్నించారు. కుశాల్ అరోరా త్యాగాలు అతన్ని ఆర్థికంగా విజయం సాధించేలా చేశాయి. కానీ ఇవి కొందరికి స్ఫూర్తిగా నిలిచినప్పటికీ.. మరికొందరికి నచ్చలేదు. యువతరం మీద అనవసరమైన ఒత్తిడి సృష్టిస్తున్నాడని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అతనిని నిందించడం మొదలుపెట్టారు. డబ్బు మీద వ్యామోహం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. నువ్వు నీ జీవితాన్ని గడిపావు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అందరూ ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు. కానీ దానినే ఫ్యాన్సీగా మార్చుకోవడం మానేయండి. మీరు కష్టపడి పనిచేస్తే.. డబ్బు వచ్చింది. దానితో జీవించండి. దీనిని ఇతరులకు ఆపాదించడం మానేయండి.. అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

* బొంగులో చికెన్‌ గురించి తెలుసు గాని, ఈ బొంగుతో డ్రోన్‌ ఏంటనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్నది బొంగుతో తయారైన డ్రోన్‌. సాధారణంగా యంత్రాల తయారీకి లోహాలను వాడతారు. బెంగళూరుకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్, ప్రోడక్ట్‌ డిజైనర్‌ దీపక్‌ దధీచ్‌ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే రకం. సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్‌ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో ఈ డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్‌లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్‌ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం.

* నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్‌ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్‌ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.

ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్‌ అకౌంట్‌ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.

ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?
సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z