ScienceAndTech

AI దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయి-BusinessNews-Oct 21 2024

AI దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయి-BusinessNews-Oct 21 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను ఉత్సాహంగానే ప్రారంభించిన సూచీలు (Stock Market).. ఆ జోరును ఎంతో సేపు కొనసాగించలేకపోయాయి. దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలకు తోడు, విదేశీ పెట్టుబడులు క్రమంగా తరలిపోవడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 81,770 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. కానీ, ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో పతనమవుతూ వచ్చిన సూచీ ఒక దశలో 80,811 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు కాస్త కోలుకుని 73.48 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,151.27 వద్ద ముగింది. అటు నిఫ్టీ (Nifty) కూడా 24,679.60-24,978.30 మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 72.95 పాయింట్లు కోల్పోయి 24,781.10 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07గా ముగిసింది.

* దేశంలోని బ్యాంకుల్లో నగదు కొరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌కు డాలర్‌ కొరత ఏర్పడలేదు. మనీలాండరింగ్‌ను అరికట్టడం, అవినీతిని తగ్గించడం ద్వారా ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో డాలర్ల సరఫరా గణనీయంగా పెరిగింది. బంగ్లాదేశ్ బ్యాంక్ గత రెండు నెలల్లో 1.5 బిలియన్‌ డాలర్ల విదేశీ బకాయిలను చెల్లించగలిగింది. అది కూడా తన డాలర్‌ నిల్వలు ఏ మాత్రం తరిగిపోకుండా. విదేశీ బకాయిల చెల్లింపుల కోసం బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ నుండి డాలర్లను సమీకరించింది. దేశంలో బ్యాంకులు గతంలో డాలర్ కొరతతో ఇబ్బంది పడ్డాయని, అయితే ఇప్పుడు చాలా వరకు డాలర్లు మిగులుతో ఉన్నాయని బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ అహ్సన్ హెచ్ మన్సూర్ వివరించారు. నగదు కొరత ఉన్నప్పటికీ, డాలర్ల సరఫరా మాత్రం స్థిరంగా ఉందని వివరించారు.

* కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది. ఫోన్‌పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్‌ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్‌ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్‌పీఎస్‌-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.

* దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. వరుసగా ఆరు రోజుల తర్వాత కూడా పసిడి దిగిరాలేదు. నేడు (అక్టోబర్‌ 21) కూడా బంగారం ధరలు ఎగిశాయి. వరుస పెరుగుదలతో పసిడి ప్రియుల్లో దడ పుడుతోంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.200 పెరిగి రూ.73,000 లను తాకింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 పెరిగి రూ. 79,640 వద్దకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో ధరలు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.73,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.79,790 వద్దకు చేరాయి.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన పాపులర్ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గరిష్టంగా రూ.50 వేల వరకూ రాయితీ ఆఫర్ చేస్తోంది. వేరియంట్ల వారీగా స్విఫ్ట్ కారుపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకూ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) వేరియంట్ కార్లు కొనుగోలు చేసేవారికి క్యాష్ డిస్కౌంట్ స్థానే తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ‘బ్లిట్జ్ కిట్’ ఉచితంగా అందిస్తామని తెలిపింది. స్విఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ పై రూ.25 వేలు, ఏఎంటీ వేరియంట్ మీద రూ.30 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. కార్పొరేట్ కొనుగోలుదారులకు అదనంగా రూ.2,100 డిస్కౌంట్ తోపాటు సెలెక్టెడ్ ట్రిమ్స్ మీద రూ.19 వేల వరకూ డీలర్ ఎండ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

* దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే 36 శాతం నికర లాభాలు తగ్గిపోయాయి. ఆపరేషన్ల ద్వారా ఆదాయం పడిపోయిందని ఆల్ట్రాటెక్ సిమెంట్ వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాలు రూ.820 కోట్లకు పరిమితమైందని పేర్కొంది. సంస్థ ఆదాయం గతేడాదితో పోలిస్తే 2.4 శాతం తగ్గి రూ.15,634.73 కోట్లకు పడిపోయిందని తెలిపింది. ఆదాయం సమకూర్చుకోవడంలో మార్కెట్ వర్గాలను అధిగమించినా నికర లాభాల్లో మాత్రం మిస్ అయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 52 శాతానికి, ఆదాయం 13 శాతానికి పడిపోయాయి.

* నెలనెలా ఆదాయాన్ని ఆశించేవారు, సురక్షిత పెట్టుబడులపట్ల ఆసక్తిగలవారు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం (పీవోఎంఐఎస్‌)ను పరిశీలించవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఆకర్షణీయ వడ్డీరేటును అందిస్తున్నది. అక్టోబర్‌-డిసెంబర్‌కు 7.40 శాతం వడ్డీరేటు వస్తున్నది. ఇతర చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల మాదిరిగానే ఈ పీవోఎంఐ స్కీం వడ్డీరేటును కూడా మూడు నెలలకోసారి సవరిస్తారు. ఇక ఈ పథకం కచ్చితమైన రాబడులను మదుపరులకు అందిస్తుంది. డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ల కంటే అవి ఉత్తమంగానే ఉంటాయి. స్కీం మెచ్యూరిటీ కాలవ్యవధి ఐదేండ్లు. గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురితో కలిసి కూడా స్కీంలో చేరవచ్చు. అప్పుడు పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు. ఇక 10 ఏండ్లు దాటిన పిల్లల పేరుతో కూడా స్కీంను తీసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z