Business

BSNL సరికొత్త రూపురేఖలు-BusinessNews-Oct 22 2024

BSNL సరికొత్త రూపురేఖలు-BusinessNews-Oct 22 2024

* స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్‌కు కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. సెబీ చీఫ్‪గా కొనసాగుతూ పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) నిర్వహించిన దర్యాప్తు ముగిసింది. ఈ దర్యాప్తులో మాధాబీ పురీ బుచ్ గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినటలు ఆధారాలు దొరకలేదని అధికార వర్గాల కథనం. అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, సెబీ చైర్ పర్సన్ గా మాధాబీ పురీ బుచ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం అభిప్రాయ పడ్డట్లు వినికిడి. వచ్చే ఏడాది పిబ్రవరి వరకూ ఆమె తన పదవీ కాలంలో కొనసాగుతారని అధికార వర్గాల కథనం. అదానీ గ్రూప్ అనుబంధ విదేశీ సంస్థల్లో మాధాబీ పురీ బుచ్ పెట్టుబడులు పెట్టారని యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం మాధాబీ పురీ బుచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని ఆరోపించింది. ఆమె భర్త ధావల్ బుచ్ తో సంబంధం ఉన్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ బ్లాక్ స్టోన్ కు లబ్ధి చేకూర్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులకు మాధాబీ పురీ బుచ్ ప్రోత్సాహం ఇచ్చారని కాంగ్రెస్ మరో ఆరోపణ చేసింది. తన సొంత కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఐసీఐసీఐ నుంచి ఆదాయం పొందే మార్గాలను వెల్లడించడంలోనూఆమె విఫలం అయ్యారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

* ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ కొత్త లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్‌ కలర్స్‌తో లోగోను రూపొందించింది. గతంలో రెడ్‌, బ్లూ, యాష్‌ కలర్స్‌తో లోగో ఉండేది. ఈ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్స్‌ని సైతం అందించబోతున్నది. ఇందులో ఒకటి వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన అవాంఛిత మెసేజ్‌లతో పాటు స్కామ్‌లను ఆటోమేటిక్‌గా ఫిల్టర్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ఫైబర్‌ ఇంటర్నెట్‌ యూజర్ల కోసం నేషనల్‌ వైఫై రోమింగ్‌ సేవలను సైతం ప్రారంభించింది. దాంతో యూజర్లు అదనపు ఛార్జీలు లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ హాట్‌స్పాట్స్‌లలో హైస్పీడ్‌ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. దాంతో డేటా ఖర్చులు తగ్గుతాయని కంపెనీ పేర్కొంటుంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ 500కిపైగా లైవ్‌ ఛానెల్స్‌, పే టీవీ ఆప్షన్స్‌ని కలిగి ఉన్న కొత్త ఫైబర్‌ ఆధారిత టీవీ సర్వీసులను సైతం ప్రకటించింది. ఫైబర్‌ ఇంటర్నెట్‌ సబ్‌స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది. ఆటోమేటెడ్ కియోస్క్‌లను పరిచయం చేయడం ద్వారా కస్టమర్‌లు తమ సిమ్ కార్డ్‌లను నిర్వహించడాన్ని సులభతరం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కియోస్క్‌లు ప్రజలు తమ సిమ్ కార్డ్‌లను సులభంగా కొనుగోలు చేయడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి, మార్చుకోవడం తదితర సేవలను అందించనున్నది. మైనింగ్‌ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్‌ ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు సీ-డీఏసీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ జతకట్టింది.

* Redmi A4 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2024లో ఈనెల 16న ఆవిష్కరించింది. స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 చిప్ సెట్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. రెడ్‌మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్‌ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499 పలుకుతుందని సమాచారం. బ్యాంకు డిస్కౌంట్, ఇతర డిస్కౌంట్లతో కలిపిన తర్వాతే ఈ ధర పలుకుతుందని చెబుతున్నారు. క్వాల్ కామ్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుందని, 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తున్నది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ -50 సూచీ నిఫ్టీ మంగళవారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ -50 సూచీ నిఫ్టీ మంగళవారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున పతనం అయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 930.55 పాయింట్ల పతనంతో 80,220.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 24,472 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1001.74 పాయింట్ల వరకూ పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం మూడే మూడు స్టాక్స్ ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్ మాత్రమే లాభ పడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి తదితర స్టాక్స్ నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50లో కేవలం తొమ్మిది స్టాక్స్ మాత్రమే లాభ పడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా,ఆల్ట్రాటెక్ సిమెంట్ తదితర స్టాక్స్ పుంజుకున్నాయి. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్, బీఈఎల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ నష్టపోయాయి.

* పేటీఎం (Paytm) బ్రాండ్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.928.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.290.5 కోట్ల నష్టాల్ని నమోదు చేసిన కంపెనీ తాజాగా లాభాల బాట పట్టింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 34.1శాతం క్షీణించి రూ.1,659.5 కోట్లకు చేరింది. పేటీఎం సినిమాలు, ఈవెంట్ల టిక్కెట్ల బుకింగ్‌ విభాగాన్ని జొమాటోకు విక్రయించడంతో రూ.1,345 కోట్లు లాభం పొందినట్లు కంపెనీ స్వయంగా వెల్లడించింది. దీంతో కంపెనీ తిరిగి లాభాల్ని నమోదు చేసుకుంది. ఆర్థిక సేవల విభాగం నుంచి వచ్చే ఆదాయం 9శాతం పెరిగి రూ.376 కోట్లకు చేరిందని, పేటీఎం వ్యాపారం సేవల నుంచి వచ్చే ఆదాయం ఏకంగా 34శాతం పెరిగి రూ.981 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. కంపెనీ ఖర్చులు 17శాతం తగ్గి రూ.1,080 కోట్లకు చేరాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్‌ఈలో 4.73 నష్టంతో రూ.692.15 వద్ద ముగిసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z