Business

పరుగులు పెడుతున్న డాలరు…బంగారం విలువలు-BusinessNews-Oct 23 2024

పరుగులు పెడుతున్న డాలరు…బంగారం విలువలు-BusinessNews-Oct 23 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో చలించిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ రాణించిన్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎల్‌అండ్‌టీ షేర్లు సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌ ఉదయం 79,921.13 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,220.72) నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వెళ్లిన సూచీ.. ఇంట్రాడేలో 80,646.31 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల బాట పట్టింది. చివరికి 138.74 పాయింట్ల నష్టంతో 80,081.99 వద్ద వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36.60 పాయింట్ల నష్టంతో 24,435.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.08గా ఉంది.

* బీసీసీఐతో సెటిల్మెంట్‌ కేసులో బైజూస్‌ కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. ఇటీవల జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన రూ.158.9 కోట్ల సెటిల్మెంట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆ మొత్తం సొమ్మును క్రెడిటార్స్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని పేర్కొంది. వాస్తవానికి గతంలో తీర్పునిచ్చే సమయంలో ఎన్‌సీఎల్‌టీ తన బుర్రను ఏమాత్రం వాడకుండా బైజూస్‌ దివాలా పిటిషన్‌ను ముగించిందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాతో కూడిన బెంచ్‌ ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది. బీసీసీఐతో రూ.158.9 కోట్ల బకాయిల సెటిల్‌మెంట్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఈనెల 2న ఆమోదిస్తూ, బైజూస్‌పై దివాలా ప్రొసీడింగ్స్‌ను పక్కనపెట్టాల్సిందిగా ఆదేశించింది. ఇది బైజూస్‌కు పెద్ద ఊరటగా నిలిచింది. కంపెనీ అధిపతి బైజూ రవీంద్రన్‌ చేతికి పగ్గాలు అందించేందుకు మార్గం సుగమం చేసింది. అయితే ఇది ఎంతోకాలం నిలవలేదు. ఇప్పటికే సదరు ఎడ్‌టెక్‌ సంస్థకు అమెరికాకు చెందిన గ్లాస్‌ ట్రస్ట్‌ కంపెనీ ఓ రుణదాత. అది ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 14న ఈ తీర్పుపై స్టేను మంజూరుచేసింది. తాజాగా బీసీసీఐ ఆ సొమ్మును రుణదాతల కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

* బంగారం, వెండి ధరలు (Gold, silver prices) దూసుకెళ్తున్నాయి. తాజాగా సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు చేరాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర మరో రూ.500 పెరిగి రూ.81,500కి చేరింది. వెండి ధర సైతం మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.1.02 లక్షకు చేరుకుంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వీటి ధరలు పెరుగుతున్నట్లు ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. గడిచిన వారంలో వెండి దాదాపు రూ.10వేల మేర పెరగ్గా.. బంగారం సైతం 10 గ్రామలు దాదాపు రూ.2850 మేర పెరగడం గమనార్హం. గతేడాది అక్టోబరులో అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర 1938 డాలర్ల వద్ద ఉండగా, ఈ ఏడాది జనవరిలోనూ 2000 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడంతో ధర దాదాపు 7 శాతం మేర పతనమైంది. అయితే, తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పుంజుకుంది. ఓ వైపు దేశీయంగా పండగలు, పెళ్లిళ్లు.. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత అంచనాలు తోడవ్వడంతో బంగారం, వెండికి ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కొనుగోలుదార్లకు బడ్జెట్‌ ‘ఉపశమనం’ తాత్కాలికమే అయ్యింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 2764 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 34.74 వద్ద కొనసాగుతోంది.

* పండుగల సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ ‘ఫ్లాష్ సేల్’ ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.

* రైల్వే ప్రయాణం చేస్తున్నారా? ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? అందులో వాడే ఉన్ని దుప్పట్లు ఎప్పుడు ఉతుకుతారో తెలిస్తే షాకవుతారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వయంగా రైల్వే విభాగం ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఏసీ కోచ్‌ల్లోని ఉన్ని దుప్పట్లు, బెడ్‌షీట్లు, కవర్లను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తారని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం స్పందించింది. బెడ్‌షీట్లు, పిళ్లో కవర్లు ప్రతి జర్నీ పూర్తయిన వెంటనే శుభ్రం చేస్తామని చెప్పింది. అయితే ఉన్ని దుప్పట్లను మాత్రం నెలలో ఒకటి లేదు రెండుసార్లు ఉతుకుతామని స్పష్టం చేసింది. ‘ఏసీ కోచ్‌ల్లో రైలు ప్రయాణం పూర్తయిన వెంటనే పిళ్లో కవర్లు, బెడ్‌షీట్లు నిత్యం శుభ్రం చేస్తాం. అయితే చాలా సందర్భాల్లో దుప్పట్లు దుర్వాసన, తడిగా ఉండడం..వంటివి గమనిస్తే వెంటనే వాటిని ఉతకడానికి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. వారికి వెంటనే మరో దుప్పటి అందిస్తాం’ అని రైల్వేలో పదేళ్లు అనుభవం ఉన్న హౌజ్‌కీపింగ్‌ సిబ్బంది తెలిపారు. రైల్వే ఎన్విరాన్‌మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌హెచ్‌ఎం) సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా మాట్లాడుతూ..‘టిక్కెట్ ధరలో బెడ్‌ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు ఇస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేస్తారు. ఉన్ని దుప్పట్లు ఉతకడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది’ అన్నారు. రైల్వేశాఖ ఆర్‌టీఐలో భాగంగా ఇచ్చిన రిప్లైలో..‘రైల్వే విభాగంలో అందుబాటులో ఉన్న లాండ్రీ సదుపాయాలకు అనుగుణంగా ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉతకాల్సి ఉంది’ అని పేర్కొంది. కాగా, రైల్వేలో బ్లాంకెట్లను పరిశుభ్రంగా ఉంచడం లేదని 2017లో కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ (కాగ్‌) నివేదిక తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z