Politics

పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి-NewsRoundup-Oct 24 2024

పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి-NewsRoundup-Oct 24 2024

* మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టుతో న్యూజిలాండ్‌ తలపడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. తేజల్ హసబ్నిస్ (42), దీప్తి శర్మ (41), యస్తికా భాటియా (37), జెమీమా రోడ్రిగ్స్‌ (35), షెఫాలీ వర్మ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ 4, జెస్ కెర్ 3, కార్సన్ 2, సుజీ బేట్స్‌ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దూరంగా ఉండగా.. స్మృతి మంధాన కెప్టెన్సీ వహిస్తోంది.

* రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం జరగనుందని, 6 ప్రాజెక్టులు బిడ్డింగ్‌ దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, 75 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయన్నారు. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయని వివరించారు.

* అమరావతి(Amaravati)కి రైల్వేలైన్‌ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు.

* పోలీసు ఉద్యోగం తన చిన్ననాటి కల అని బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) అన్నారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీగా అపాయింట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

* దేశీయ సంస్థల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

* నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిని కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే.. వైకాపా అధినేత జగన్ చరిత్రహీనుడిగా నిలవబోతున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

* రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ‘భారాస రైతు పోరుబాట’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా కేసులు పెట్టి వేధించే అధికారుల పేర్లు రాసిపెట్టాలని పార్టీ నేతలకు కేటీఆర్‌ సూచించారు.

* ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. మరింత సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించేందుకు అంతర్జాతీయ అత్యున్నత సంస్థల్లో సంస్కరణలు తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ముగింపు రోజున ప్రసంగించిన ఆయన (S Jaishankar).. ప్రపంచ క్రమం రూపాంతరం చెందుతున్న తీరుకు బ్రిక్స్‌ ఓ ఉదాహరణ అన్నారు.

* కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. గుర్లలో డయేరియా బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్లలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. గ్రామాలను సస్యశ్యామలం చేశాం. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. అన్ని డిపార్టమెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. ..గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖ ఉద్యోగులు కనిపించేవారు. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్‌ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానం చేశాం. ఏఎన్‌ఎంలు కనిపించేవారు. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఉండేది. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదన్నారు.

* ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవ‌డానికి కూడా రెడీగా ఉన్నాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఉరికించి కొట్టే రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. హైద‌రాబాద్ నుంచి ఉద‌యం ఏడున్న‌ర‌కు వెళ్లినం.. కానీ కాంగ్రెస్ పాల‌న ఎట్ల‌ ఉందంటే.. అన్ని ప‌నులు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయి. మేడ్చ‌ల్ వ‌ద్ద‌నే 45 నిమిషాలు ప‌ట్టింది. ఇక డిచ్‌ప‌ల్లి వ‌ద్ద కొంద‌రు మ‌హిళ‌లు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధ‌ర్నా చేస్తున్నారు. ఏం క‌ష్ట‌మొచ్చింది అని దిగాను. వాళ్లు పోలీసోళ్ల భార్య‌లు. వ‌న్ పోలీసింగ్ కావాల‌ని డిచ్‌ప‌ల్లి బెటాలియ‌న్ వ‌ద్ద‌ ధ‌ర్నా చేస్తున్నారు. ధ‌ర్నా చేస్తున్న మ‌మ్మ‌ల్ని ర‌క్తం కారేలా గుంజుకుపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆ ఆడ‌బిడ్డ‌లు. అఖ‌రికి కాంగ్రెస్ పాల‌న‌లో పోలీసోళ్ల భార్య‌లు ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి.. వారు కూడా పోలీసోళ్ల చేతిలో దెబ్బ‌లు తినే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

* ఆస్ట్రేలియా జట్టు పేస్‌ దళంలోని ముగ్గురు ప్రధాన బౌలర్లు బోర్డర్‌-గావాస్కర్‌ ట్రోఫీలోని అన్ని టెస్టుల్లో ఆడే అవకాశం లేదన్న సీమర్‌ హెజిల్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు. అతడు ఓ దేశీయ మ్యాచ్‌కు సాధన చేస్తున్న వేళ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రికెట్‌లో తీరిక లేని షెడ్యూల్‌ ఉందని పేర్కొన్నాడు. ప్రధాన బౌలర్లు మొత్తం 2023-24 సీజన్‌లో పాక్‌, విండీస్‌, న్యూజిలాండ్‌తో జరిగిన ఏడు టెస్టులకు వరుసగా అందుబాటులో ఉండటం చాలా అరుదైన విషయమన్నాడు. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు వెన్నెముక శస్త్రచికిత్స కారణంగా అందుబాటులో ఉండకపోవడం..బౌలింగ్‌ దళంపై పనిభారాన్ని పెంచుతుందన్నాడు. కానీ, గతంలో వలే వరుసగా ముగ్గురు పేసర్లు జట్టులో జరగకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘టీ20, వన్డేల వలే ఎన్ని ఓవర్లు బౌల్‌ చేయాలో తెలుస్తుంది.. కానీ, టెస్టుల్లో ప్లానింగ్‌తో బౌలింగ్‌ చేయించలేరు. 25 ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి రావచ్చు. అందుకే ఫిట్‌గా ఉంటే ఆడాలి.. లేకపోతే ఆడకూడదు’’ అని వ్యాఖ్యానించాడు.

* చెల్లిపై ప్రేమతో జగన్‌ షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్‌ అని వ్యాఖ్యానించారు. ఆస్తుల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధిస్తూ జగన్‌కు లేఖ రాశారు. ‘‘ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలను మార్చారు. కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారు. ఆస్తులను లాక్కోవడానికి కారణంగా చెబుతున్నారు కానీ వాస్తవం కాదు. ఈడీ కేసులు, బెయిల్‌ రద్దవుతుందని కారణాలు చెబుతున్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్‌ చేయలేదు’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z