* అమెరికాలో ఎన్నికల తేదీలు దగ్గరపడే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రానున్న ఫలితాలపై అంచనాలతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ట్రంప్ (Trump) విజయం భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఫిలిప్ క్యాపిటల్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్ పార్టీ విజయంతో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని.. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని పేర్కొంది. దీంతో కంపెనీలు ఇబ్బందులు తగ్గించుకోవడానికి అత్యధికంగా ఆన్‌సైట్ మార్కెట్లలో స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడింది. దీంతోపాటు నియర్ షోర్ డెలివరీ సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక ఆటోమొబైల్ రంగంలో భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొంది. ట్రంప్ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అదే సమయంలో హైబ్రీడ్ వాహనాల మార్కెట్ వృద్ధి చెందడంతో కుదురుకుంటుందని తెలిపింది. దీంతోపాటు ట్రంప్ భారీ ఇన్ఫ్రాప్లాన్లతో క్లాస్-8 శ్రేణి ట్రక్కులకు డిమాండ్ పెరగడం భారత ఆటోమొబైల్ స్పేర్ పార్టుల రంగానికి కలిసొస్తుందని చెప్పింది. ఇది కమోడిటీలు, లోహరంగానికి ఇన్ఫ్రాప్లాన్లు బలాన్నిస్తాయని తెలిపింది.
* ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు తెలిపింది.
* మంత్రి కొండా సురేఖపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని గూగుల్, యూట్యూబ్, ఎక్స్, మెటా, మీడియా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు వచ్చే నవంబరు 11కి వాయిదా వేసింది. తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై రూ.100కోట్లకు కేటీఆర్ దావా వేసిన విషయం తెలిసిందే.
* జియో వరల్డ్ సెంటర్ నిర్మాణం వెనక తన భార్య ఆలోచన ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఎన్‌విడియా అధిపతి జెన్సెన్ హ్యూవాంగ్‌తో ముచ్చటించిన సందర్భంగా ఈవిషయం తెలిపారు. జియో వరల్డ్ సెంటర్‌లో ప్రారంభమైన ఎన్‌విడియా ఏఐ సదస్సు తొలిరోజు ముకేశ్ హాజరయ్యారు. ఆయన్ను జెన్సెన్ హ్యూవాంగ్ వేదిక పైకి ఆహ్వానిస్తూ పరిశ్రమకు మార్గదర్శకుడిగా అభివర్ణించారు. ‘‘భారత్ హైటెక్‌గా మారడానికి ముకేశ్ అంబానీ సాయపడినట్లు మరెవరూ చేయలేదు. ప్రస్తుతం మీరు ఆ ప్రయాణం తొలి దశలో ఉన్నారు. మీకు ఉన్నత లక్ష్యాలున్నాయి. దేశంలో అత్యున్నత సాంకేతిక పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్న కోర్కె ఉంది. మీకు ఆ నమ్మకం ఎలా వచ్చింది. భారత్‌కు ఏఐ అవసరం ఏమిటీ..?’’ అని ముఖేశ్‌ను అడిగారు. దీనికి ముకేశ్ స్పందిస్తూ.. ‘‘ముంబయికి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నది జియో వరల్డ్ సెంటర్. ఇది కొత్తది. దీనిని నా భార్య నిర్మించింది. ఈ విషయాన్ని మరచిపోకుండా చెప్పమని నాకు సూచించింది కూడా’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు నవ్వారు. దీనికి హ్యూవాంగ్ స్పందిస్తూ.. ‘‘నేను ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్నానా.. ఆమె ఇల్లు నీ ఇంటి కన్నా పెద్దదిగా ఉంది. అసలు నీ ఇల్లే చాలా పెద్దది అనుకొన్నాను’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
* ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదనతో కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖలు రాయడం, మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడంపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. జీవన్‌రెడ్డి ఒంటరి కాదు.. సమయం వచ్చినప్పుడు జగ్గారెడ్డి అండగా ఉంటారని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందని, ఆయనకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించిందిన్నారు. ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నానని పేర్కొన్నారు.
* దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. ఒక మహోన్నత మానవతామూర్తిగా, జంతు ప్రేమికుడిగానూ గొప్ప పేరుంది. ఆయనకు మూగజీవాలంటే ఎంత ప్రేమో ప్రపంచానికి తెలియనిది కాదు. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు శునకం టిటో (Tito) పేరును కూడా ప్రస్తావించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పేర్కొన్నట్లు సమాచారం. ఆ బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రతన్ టాటా గతంలో ‘టిటో’ అనే శునకాన్ని పెంచుకున్నారు. అది మరణించిన అనంతరం మరో శునకాన్ని దత్తత తీసుకొని దానికి అదే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలాగే మూడు దశాబ్దాలుగా తనవద్ద పని చేస్తూ, తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా వీలునామాలో చేర్చినట్లు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు రూ.10,000 కోట్ల ఆస్తులు.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
* తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. శనివారం (అక్టోబర్ 26) నుంచి ప్రారంభమయ్యే తెదేపా సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెదేపా ఏర్పాట్లు చేస్తోంది.
* యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారని.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నరెడ్కో (NAREDCO) ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
* మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకమని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పేదల ఇళ్లను కూల్చే దుర్మార్గపు అలోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని సూచించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధమే’’ అన్నారు.
* ఉక్రెయిన్, (Ukraine) పశ్చిమాసియాలో (West Asia) పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్- జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్’ చర్చల్లో భాగంగా భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో (Olaf Scholz) దిల్లీలో భేటీ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
* కెనడా (Canada) వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజీవ్ కుమార్ వర్మ హెచ్చరించారు. ఆ దేశంలోని అనేక చీకటి కోణాలను ఆయన ‘పీటీఐ’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ దేశంలో నాసిరకం విద్యా సంస్థల కారణంగా లక్షల రూపాయలు వెచ్చించినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందన్నారు.
* ఏపీ మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు.. కుటుంబ వ్యాపారాలేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తేల్చిచెప్పారు. అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్’ మాత్రమేనన్నారు.
* ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరడం గమనార్హం. వరుస ఘటనలు.. అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్‌లో నాసిరకం మయోనైజ్‌ను తిన్న కొందరు యువకులు ఇటీవల ఆసుపత్రిపాలయ్యారు. వారం కిందట ఐదుగురు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 10న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అదే హోటల్‌లో షవర్మ తిన్న 20 మందికిపైగా యువకులు 3, 4 రోజులయ్యాక ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. కొంతమందికి రక్త పరీక్షలు చేయగా.. హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ హోటల్‌లోని షవర్మ బాగోలేదని బల్దియాకు ఫిర్యాదులు అందాయి. మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఈ క్రమంలో చాలామంది శుభ్రతను పాటించడం లేదు. కొన్ని గుడ్లపై ఉండే పెంట వంట మనిషి చేతులకు అంటుకుంటుంది. అలాగే ఇతర ముడి పదార్థాలను తీసుకుని సొనలో కలుపుతారు. అలా తయారైన మయోనైజ్ చాలా ప్రమాదకరమని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం చెబుతోంది.ఈ తప్పులేవీ జరగకుండా పరిశుభ్రంగా తయారైన మయోనైజ్‌ను మాత్రమే తినేందుకు ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు. తయారైన మూడు నుంచి నాలుగు గంటల్లోపు దాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z