Business

ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోతో భారీ నష్టం-BusinessNews-Oct 26 2024

ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోతో భారీ నష్టం-BusinessNews-Oct 26 2024

* క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్‌ కార్యక్రమంలో ‘శక్తికాంత దాస్’ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు. క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు. భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్‌ ఆర్‌బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

* గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చింది. ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు కొనుగోళ్లకు ముందుకురాకపోవడంతో డిమాండ్‌ అనూహ్యంగా పడిపోయింది. దీంతో ధరలు తగ్గాయని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో శుక్రవారం ఒకేరోజు తులం బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.80,050కి దిగింది. బంగారంతోపాటు వెండి కూడా భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.2,000 తగ్గి రూ.99,000కి తగ్గింది. అంతకుముందు వెండి రూ.1.01 లక్షలుగా ఉన్నది. ఆభరణాలు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీనంగా ఉండటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆభరణాల విక్రయదారుడు వెల్లడించారు.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ‘ఫ్యూయల్ పంప్‌లో సమస్య’ కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది. 2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 – అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్‌లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది. హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్‌డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు ‘వీఐఎన్’ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్‌లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జాన్ జే హామ్రేతో జరిగిన సమావేశంలో ఆర్థిక సాధికారతలో భారత్ అభివృద్ధిని గురించి వివరించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర రాజధానులకు సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. నేడు ప్రతి గ్రామంల్లో విద్యుత్ సదుపాయం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమం గురించి కూడా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్స్ అందించడం జరిగింది. లక్షలాది భారతీయ కుటుంబాల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై కూడా కేంద్రం సానుకూల దృష్టి పెట్టిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

* ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్‌గా 1954లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్‌, గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్‌లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్‌మాంట్ కార్పొరేషన్‌తో కలిసి ఆయన స్థాపించారు. తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్‌ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్‌ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్‌ గ్రూప్‌ టర్నోవర్‌ రూ. 9,000 కోట్లు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z