Devotional

50 మందికి బ్రేక్ దర్శనం ఇవ్వలేదని తితిదేపై ఆరోపణలు-NewsRoundup-Oct 28 2024

50 మందికి బ్రేక్ దర్శనం ఇవ్వలేదని తితిదేపై ఆరోపణలు-NewsRoundup-Oct 28 2024

* ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) వర్గం నేత, తన తండ్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) దారుణ హత్యతో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salmankhan) తీవ్ర కుంగుబాటుకు గురయ్యారని జిషాన్‌ తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సల్మాన్‌ తమ కుటుంబానికి ఎంతో అండగా నిలిచారన్నారు. ప్రతిరోజూ ఫోన్‌ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ‘‘నా తండ్రితో సల్మాన్‌ఖాన్‌కు మంచి అనుబంధం ఉంది.ఆయన మరణంతో సల్మాన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మా కుటుంబానికి సపోర్ట్‌గా నిలిచారు. మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. నాన్న మరణం తర్వాత బాధతో ఆయనకు నిద్రపట్టడం లేదు. ప్రతిరోజూ రాత్రి నాకు ఫోన్‌ చేస్తుంటారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. నా తండ్రితో తనకున్న అనుబంధం గురించి చెబుతుంటారు’’ అని జిషాన్‌ తెలిపారు. సినీ కుటుంబానికి చెందిన వారందరితో తన తండ్రికి స్నేహం ఉందని చెప్పారు. వాళ్లందరూ తనకు కుటుంబంతో సమానం అన్నారు.

* తితిదే అధికారులపై శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామిజీ చేసిన ఆరోపణలు సరికాదని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. ‘తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.. తమకు స్వామివారి దర్శన టిక్కెట్లను ఇవ్వకుండా అవమానించారని’ శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామిజీ ఈ రోజు తిరుపతిలో మీడియా ఎదుట ఆరోపణలు చేశారు. దీనిపై తితిదే వివరణ ఇచ్చింది. ‘వాస్తవంగా స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు తిరుమలలో వసతి కల్పించాలని తితిదే అధికారులను కోరారు. సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇంతమందికి దర్శనం కల్పించడం సాధ్యం కాదని ఆ సంఖ్య‌ను తగ్గించాలని అధికారులు కోరారు. స్వామీజీ అడిగిన వారందరికీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌నే కోపంతో మీడియా ఎదుట అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు’’ అని తితిదే ప్రకటనలో పేర్కొంది.

* జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న రాజ్‌ పాకాల స్నేహితుడు, కొకైన్‌ తీసుకున్నట్లు తేలిన విజయ్‌ మద్దూరి ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫామ్‌హౌజ్‌లో గేమ్‌ ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఫామ్‌హౌజ్‌లో పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించిన సమయంలో అక్కడున్న మొబైల్‌ను ఓ మహిళ దాచి పెట్టింది. దానిని ఆదివారమే విజయ్‌ మద్దూరి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న సమాచారం అధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొకైన్‌ తీసుకొచ్చి విజయ్‌ మద్దూరికి ఎవరు ఇచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

* కోలీవుడ్‌ నటుడు విజయ్‌ (Vijay) పొలిటికల్‌ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

* ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి విధించిన గడువు సమీపించింది. అక్టోబర్‌ 31 సాయంత్రం ఐదుగంటలలోపు ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకునే ప్లేయర్స్‌ లిస్ట్‌ని సమర్పించాల్సి ఉంది. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంచైజీలకు ఐపీఎల్‌ (IPL) పాలకవర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కలిసి ఉంటుంది. దీంతో ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) ముంబయి ఇండియన్స్‌ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అంచనా వేశాడు. భజ్జీ చాలాకాలం పాటు ముంబయి తరఫున ఆడిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రాలను ముంబయి అట్టిపెట్టుకుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే, మాజీ సారథి రోహిత్‌ శర్మను రిటైన్ చేసుకుంటుందా? లేదా అనే ప్రశ్న మిగిలి ఉందన్నాడు.

* ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌తో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా (North Korea) తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని నాటో తాజాగా ధ్రువీకరించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్‌ బలగాలను మోహరించినట్లు తెలిపింది. రష్యాలోని కుర్క్స్‌ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని.. ఈ చర్య ఉన్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడమేనని వ్యాఖ్యానించారు.

* భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న రష్యా (Russia).. వీసారహిత పర్యటనలకు అనుమతి ఇచ్చే అంశంపై కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కీలక దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2025 స్ప్రింగ్‌ సీజన్‌ నుంచి వీసా-ఫ్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రష్యాకు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు. ఈ ఒప్పందానికి సంబంధించి పురోగతి కనిపిస్తోందని.. దీంతో భారత్‌ నుంచి పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నామని మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్‌ ఎవ్జెనీ కోజ్లోవ్‌ తాజాగా వెల్లడించారు. ‘‘టూరిజం విషయంలో రష్యాకు భారత్‌కు ఇప్పటికే కీలక మార్కెట్‌గా అవతరించింది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 28,500 మంది భారతీయులు మాస్కోలో పర్యటించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. వాణిజ్యం, వ్యాపార సంబంధిత కారణాలతో రష్యాలో పర్యటించడం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా భారత్‌ను కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నాం’’ మాస్కో అధికారి పేర్కొన్నారు.

* కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా(Priyanka Gandhi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మానవతా మూర్తి మదర్‌ థెరెసా(Mother Teresa)తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా నాన్న రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన కొద్ది రోజులకు మదర్‌ థెరెసా మమ్మల్ని పలకరించడానికి ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు 19ఏళ్లు. ఆమె వచ్చిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నాను. అమ్మను పలకరించిన అనంతరం థెరెసా నా దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. నిరుపేదల కోసం పని చేయాలని నన్ను ఆహ్వానించారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత నేను వారి సంస్థతో కలిసి పని చేయడానికి వెళ్లాను. అక్కడ ఉన్న సోదరీమణులతో కలిసి బాత్రూంలు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేశాను. అప్పుడే కష్టాల్లో ఉన్న వారికి సమాజం ఎలా చేయూతనందిస్తుందో తెలుసుకున్నాను. వారు పడే బాధలను కళ్లారా చూశాను. అదే విధంగా వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు ఒకరికొకరు ఏ విధంగా సహాయపడ్డారో చూశాను. కష్టాల్లో ఉన్న తోటి వారికి సహాయం చేయాలనే మదర్‌ థెరెసా మాటలను మీరు రుజువు చేశారు’’ అని ఆమె పేర్కొన్నారు.

* బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌ పేరు మారుమోగుతోంది. స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (Pappu Yadav)కు ఆ గ్యాంగ్‌నుంచి బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేసినా.. పట్టించుకోకుంటే చంపేస్తామని, ఎప్పటికప్పుడు కదలికలను నిశితంగా గమనిస్తున్నామని పప్పూయాదవ్‌కు బెదిరింపులు వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్ గంటకు రూ.లక్ష చెల్లించి జైల్‌ సిగ్నల్ జామర్లను నిలిపివేస్తున్నాడని, ఆ తర్వాత యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఆ ఆ కాల్స్‌ను యాదవ్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ‘‘సాధ్యమైనంత త్వరగా భాయ్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకోండి. మిమ్మల్ని పెద్దన్నయ్యలా భావించా. కానీ మీరు ఇబ్బంది పెట్టారు. తిరిగి కాల్‌ చేస్తే.. మిమ్మల్ని భాయ్‌తో కనెక్ట్ చేస్తా’’ అని రికార్డెడ్ ఆడియో మెసేజ్‌లో ఈ మాటలు వినిపించాయి. దీనిపై యాదవ్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు సమాచారం.

* ఉచిత సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్‌ కంపెనీలు, పౌరసరఫరాలశాఖ తెరచిన ఖాతాలో ఈ నిధులు జమచేయనున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక సిలిండర్‌ రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

* యావత్‌ ప్రపంచం భారత్‌ వైపు ఆసక్తిగా చూస్తోందని, భారత్‌ మాటలను ప్రపంచ దేశాలు అత్యంత శ్రద్ధతో వింటున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశం వివిధ రంగాల్లో కల్పిస్తున్న అవకాశాల గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నాయన్నారు. భారత్‌తో కలిసి అభివృద్ధిపథంలో నడిచేందుకు బ్రిక్స్‌ దేశాలు చొరవ చూపుతున్నాయన్నారు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ.. భారతీయులకు ఏటా 90వేల వీసాలు ఇస్తామని జర్మనీ చెప్పిందని, అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం మనచేతుల్లో ఉందన్నారు.

* సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం చుట్టూ 2 కి.మీ వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్‌, లైక్‌ చేయొద్దన్నారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* నెల్లూరులో ఉచితంగా ఇసుకను స్వేచ్ఛగా తీసుకెళ్తున్నారని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. భగత్ సింగ్ కాలనీ వద్దన్న ఇసుక రీచ్‌ను మంత్రి పరిశీలించారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ఎవరైనా ఇసుక తీసుకెళ్లవచ్చని, ప్రొక్లైన్లతో మాత్రం తవ్వొద్దని స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z