Business

సేవా కార్యక్రమాలకు ₹20వేల కోట్లు-BusinessNews-Oct 29 2024

సేవా కార్యక్రమాలకు ₹20వేల కోట్లు-BusinessNews-Oct 29 2024

* లంబోర్గిని కారుకు ఉండే క్రేజే వేరు. దానిని సొంతం చేసుకోవాలని, లేదంటే ఒక్కసారైనా అందులో తిరగాలని ఎందరో కలలు కంటుంటారు. ఎందుకంటే దాని ధర రూ.4 కోట్లకు పైమాటే. అయితే అంతటి విలువైన కారును ఫ్రీగా ఇస్తే..! అవును.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ జేపీ గ్రీన్స్ తమ వద్ద లగ్జరీ విల్లా(Luxury Villa) కొన్నవారికి లంబోర్గిని ఉరుస్‌(Lamborghini Urus) కారును ఉచితంగా ఇస్తామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. పోస్టులో ఆయన తాము విక్రయించే రూ.26 కోట్ల విలువైన అల్ట్రా-ప్రీమియం విల్లాను కొనుగోలు చేసే కస్టమర్లకు లంబోర్గిని ఉరుస్‌ కారును ఫ్రీగా ఇస్తామని పేర్కొన్నారు. విల్లాలో ఉండే వారికి ఇతర విలాసవంతమైన సౌకర్యాలు (పార్కింగ్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, థియేటర్‌, క్లబ్‌ మెంబర్‌షిప్‌, గోల్ఫ్ కోర్స్) కోసం అదనంగా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లో క్షీణత నమోదు చేసుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (Q2 Results) రూ.3,102 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.3,786 కోట్లతో పోలిస్తే 18శాతం క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ.37,339 కోట్ల నుంచి రూ.37,449 కోట్లకు పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం విక్రయాలు 5,41,550 యూనిట్లకు చేరాయి. ఇక దేశీయ విక్రయాలు 463,834 యూనిట్లకు, ఎగుమతులు 77,716 యూనిట్లకు చేరాయని పేర్కొంది. దేశీయ విక్రయాలు తగ్గుముఖం పట్టగా, ఎగుమతుల్లో మాత్రం 12.1శాతం వృద్ధి నమోదైంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు 6శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం 2.62శాతం క్షీణించి రూ.11,184 వద్ద ట్రేడవుతున్నాయి.

* భారత్‌లో యాపిల్‌ ఐఫోన్ల తయారీ కేంద్రం వేగంగా ఎదుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 6 బిలియన్‌ డాలర్లు ( రూ.50 వేల కోట్లకుపైగా) విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. మొత్తంగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు దాదాపు 10 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.85వేల కోట్ల)ను దాటేయొచ్చని అంచనా. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఇది మూడోవంతు వృద్ధి సాధించినట్లే. స్థానిక సబ్సిడీలు, నైపుణ్యం ఉన్న ఉద్యోగులను వినియోగించుకొని యాపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలకాలంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న ఐఫోన్‌ లక్ష్యాలను సాధించడంలో న్యూదిల్లీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌ సంస్థలు టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టాయి. ఫాక్స్‌కాన్‌ చెన్నై శివార్లలో అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసింది. ఇక కర్ణాటకలోని టాటా గ్రూప్‌ ఫ్యాక్టరీ నుంచి ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యలో 1.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. ఈ ఫ్యాక్టరీని విస్ట్రాన్‌ నుంచి టాటాలు కొనుగోలు చేశారు.

* అభిషేక్‌ లోధా, ఆయన కుటుంబం దాతృత్వ కార్యక్రమాలకు రూ.20,000 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించింది. తమ నమోదిత కంపెనీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌లో, తమకున్న రూ.20,000 కోట్ల విలువైన షేర్లను దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు సోమవారం తెలిపింది. లోధా బ్రాండ్‌పై స్థిరాస్తి విక్రయాలు జరుపుతున్న మాక్రోటెక్‌ మార్కెట్‌ విలువ రూ.1.10 లక్షల కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటా 72.11 శాతంగా ఉంది. విరాళంలో భాగంగా మాక్రోటెక్‌ డెవలపర్స్‌లో 18-19% వాటాను, తమ లాభాపేక్ష రహిత సంస్థ లోధా ఫిలాంథ్రోపీ ఫౌండేషన్‌ (ఎల్‌పీఎఫ్‌)కు లోధా- ఆయన కుటుంబీకులు త్వరలో బదిలీ చేయనున్నారు. సామాజిక బాధ్యత కార్యకలాపాలను నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరిలో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మాక్రోటెక్‌ ఎండీ, సీఈఓ అభిషేక్‌ లోధా వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z