NRI-NRT

టెక్సాస్ ఎన్నికల్లో పోటీపడుతున్న బాపట్ల ప్రవాసుడు-NewsRoundup-Oct 31 2024

టెక్సాస్ ఎన్నికల్లో పోటీపడుతున్న బాపట్ల ప్రవాసుడు-NewsRoundup-Oct 31 2024

* జమిలి (One Nation-One Election)లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తోసిపుచ్చారు. పార్లమెంటులో ఏకాభిప్రాయం లేకుండా ఒకేసారి ఎన్నికలు అసాధ్యమన్నారు. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేరోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో చేపట్టడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, వీటిని ఎవ్వరూ అడ్డకోలేరని ప్రధాని మోదీ (Narendra Modi) వెల్లడించిన నేపథ్యంలో ఖర్గే ఈ విధంగా స్పందించారు.

* మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్‌ కమిటీ వేస్తామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. డిస్టిలరీస్‌తో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి ఎంఆర్‌పీ రేట్లు నిర్ణయిస్తుందన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

* సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున (అక్టోబరు 31) క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 145 బంతుల్లో 183 పరుగులతో ఈ మిస్టర్‌ కూల్‌ లిఖించిన రికార్డును గత 19 ఏళ్లుగా ఎవరూ బద్దలుకొట్టలేకపోవడం మరో విశేషం.

* దీపావళి పండుగు వచ్చిందంటే దేశంలోని ప్రతి ఒక్క ఇల్లు దీపాల వెలుగులతో కాంతులీనుతుంది. బాణసంచా మోతలతో దద్దరిల్లుతుంది. కానీ దీపావళి పండుగ జరుపుకోని గ్రామం ఒకటి మన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉంది. దీపావళి వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాల్లో పండుగ హడావుడి నెలకొన్నా.. రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో ఎలాంటి సందడి కనిపించదు.

* బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి. రెండు గిన్నిస్‌ రికార్డులను అందుకొని చరిత్ర సృష్టించింది అయోధ్య. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత వచ్చిన మొదటి దీపావళిని పురస్కరించుకొని 25 లక్షలకుపైగా దీపాలను వెలిగించారు.

* తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

* దీపావళి పండగ పూట ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బాణసంచా తీసుకెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది. నగరంలోని తూర్పువీధిలో ఈ ఘటన జరిగింది.

* మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ (IPL 2025) రిటెన్షన్‌ జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని తమ వద్ద అట్టిపెట్టుకుంది..? ఏ ఆటగాడు మెగా వేలానికి వస్తాడనే తేలిపోయింది. గురువారమే చివరి గడువు కాగా.. కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్‌ ఆటగాళ్ల పేర్లతో లిస్ట్‌ను విడుదల చేశాయి. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

ముంబయి ఇండియన్స్‌
జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

* అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు అక్కడి రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌ చట్టసభతోపాటు అనేక రాష్ట్రాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే టెక్సాస్‌లోని ‘ది హిల్స్‌’ మేయర్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తిక్‌ నరాలశెట్టి (35) పోటీపడుతున్నాడు. నవంబర్‌ 5న జరిగే ఎన్నికలో విజయం సాధిస్తే.. ‘ది హిల్స్‌’ మేయర్‌ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా పేరుపొందనున్నాడు. ఏపీలోని గుంటూరు (ప్రస్తుతం బాపట్ల)కు చెందిన కార్తిక్‌ నరాలశెట్టి.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. న్యూజెర్సీలోని రట్జర్స్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో చేరగా.. కొంతకాలానికి చదువుకు దూరమయ్యాడు. అనంతరం సోషల్‌బ్లడ్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన కార్తిక్‌.. వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్రస్తుతం ఆ సంస్థ 21 దేశాల్లో సేవలను కొనసాగిస్తున్నట్లు కార్తిక్‌ చెప్పాడు.

* దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనూ భారత్‌ రాజీపడబోదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించే సైనికశక్తిపై ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారన్నారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.

* ఇజ్రాయెల్‌ (Israel) దాడుల కొనసాగింపుతో గాజా (Gaza) వణికిపోతోంది. అక్కడి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆ దేశ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో (Benjamin Netanyahu) మాట్లాడారు. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ కథనాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్‌.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్‌ ప్రతిపాదించారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇటీవల ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.

* తితిదే ఛైర్మన్‌ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్‌ నాయుడు అన్నారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని విమర్శించారు. తితిదే ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అంతకుముందు అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.

* తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వద్ద నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

* టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) భారీ రికార్డుపై కన్నేశాడు. కివీస్‌తో శుక్రవారం ప్రారంభంకానున్న మూడో టెస్టులో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే, అశ్విన్ చెరో 37సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్‌ టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. అనిల్ కుంబ్లే 35 సార్లు, వన్డేల్లో రెండుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిదిసార్లు 10 వికెట్ల ఫీట్ సాధించారు. అది కూడా టెస్టుల్లోనే.

* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల్లో అధికారాన్ని సాధించేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో హామీలతో కూడిన గ్యారంటీ కార్డును రాహుల్‌ గాంధీ విడుదల చేస్తారని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఆ పార్టీని ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్‌ గాంధీ గ్యారంటీ కార్డు విఫలం అవుతుంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తిగా విఫలమైంది. తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆ కార్డు అమలు అవుతుందో లేదో వివరించాలి. గ్యారంటీగా ఇక్కడ అది విఫలం అవుతుంది’’ అని మీడియా సమావేశంలో విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z