Kids

మిత్రద్రోహం ప్రాణాలను హరిస్తుంది

The story of two friends who cheated each other and lost lives-telugu kids moral story

ఇద్దరు మిత్రులు ఒకరోజు ఉదయం ఒక నిర్జనారణ్యంగుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొదవైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి ‘ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?’ అని అడిగారు.

అందుకాయన ‘అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపే పాపిష్టిది ఉంది’ అన్నాడు. వాళ్ళిద్దరూ భయంతో ‘అంటే… అక్కడ పులి ఉందా?’ అని అడిగారు.

‘కాదు. కానీ, దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది’ అన్నాడాయన. ‘ఇంతకీ ఏమిటది?’ అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. ‘బంగారు నాణేల గుట్ట’ అన్నాడు సన్యాసి.

వాళ్ళిద్దరూ సంతోషంగా ‘ఎక్కడ?’ అని అడిగారు. ‘అదిగో ఆ పొదల్లోనే’ అని వేలు చూపించి తన దారినపోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారునాణేలు కనిపించాయి. ‘ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?’ అన్నాడొక మిత్రుడు.

‘అతడి సంగతి వదిలెయ్‌, ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకువద్దాం’ అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్ళాడు.

ఈలోగా మొదటివాడు ఇలా అనుకున్నాడు- ‘ఛ, ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా వాడికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు’ అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండోవాడి ఆలోచన ఇలా ఉంది- ‘వాడికి సగభాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. జీవితంలో నేను ఏదీ వెనకేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను, అది తిని వాడు చనిపోతాడు. బంగారమంతా నేనే తీసుకోవచ్చు’ అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

‘పిచ్చివాడు, సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక నేను భోంచేసి, బంగారం తీసుకుని వెళ్ళిపోతాను’ అనుకుని, మిత్రుడు తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ‘సన్యాసి మాటలు ఎంత నిజమో కదా’ అనుకున్నాడు చివరి క్షణాల్లో.