Business

భారత్‌లో మరో నాలుగు యాపిల్ స్టోర్లు-BusinessNews-Nov 01 2024

భారత్‌లో మరో నాలుగు యాపిల్ స్టోర్లు-BusinessNews-Nov 01 2024

* ఉగాది నుంచి తెలుగు సంవత్సరాది.. జనవరి 1 నుంచి క్యాలెండర్‌ ఇయర్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ఎలా ప్రారంభమవుతుందో.. మార్కెట్లకు దీపావళితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2081 ఆరంభం కానుంది. గురువారమే దేశమంతా దీపావళి జరుపుకోగా.. శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మూరత్‌ ట్రేడింగ్‌ (Muhurat trading) నిర్వహించనున్నాయి. శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుంది. ఇంతకీ ఎందుకీ మూరత్‌ ట్రేడింగ్‌? ఏ సమయంలో జరుగుతుంది? దీపావళి రోజున ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది భారతీయుల విశ్వాసం. అదే తరహాలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది భావిస్తారు. ఆ నమ్మకంతోనే చాలా మంది మూరత్‌ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు మక్కువ చూపుతుంటారు. చాలా మంది ఈ ట్రేడింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రేడింగ్‌ జరగనుంది. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న వారికీ, కొత్తగా మార్కెట్లోకి రావాలనుకునే వారికీ ఇది ఎంతో ప్రత్యేకం. మంచి కంపెనీలను ఎంచుకొని, దీర్ఘకాలంపాటు అందులో కొనసాగినప్పుడు ఆశించిన లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.

* పండుగ సీజన్‌తో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్‌ (అన్‌ రిజర్వుడ్‌) రైళ్లను నడుపుతున్నారు. నవంబర్‌ 1 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ – విజయవాడ జన్‌సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ (08567) రైలు నవంబర్‌ 1, 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే, విజయవాడ – విశాఖ ప్రత్యేక రైలు (08565) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకోనుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

* పండగ సీజన్‌లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు ఊపందుకున్నాయి. సంఖ్యా పరంగానే కాకుండా.. విలువ పరంగానూ దూసుకుపోతున్నాయి. అక్టోబర్‌లో ఈ ట్రాన్సాక్షన్ల సంఖ్య 1,658 కోట్లకు చేరినట్లు ఎన్‌పీసీఐ (NPCI) తెలిపింది. ఈ లావాదేవీల విలువ రూ.23.5 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా యూపీఐ లావాదేవీలు వృద్ధి చెందినట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల్లో సంఖ్యా పరంగా 45 శాతం వృద్ధి నమోదుకాగా.. విలువ పరంగా 34 శాతం రాణించాయి. సెప్టెంబర్‌ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,500 కోట్లుగా నమోదైంది. అక్టోబర్‌లో ఆ సంఖ్యను అధిగమించింది. సగటు రోజువారీ లావాదేవీలు సెప్టెంబర్‌లో 5 కోట్లు ఉండగా.. అక్టోబర్‌లో ఆ సంఖ్య 5.35 కోట్లకు చేరింది. ఇక ఫాస్టాగ్‌, ఆటోమేటెడ్ టోల్‌ పేమెంట్‌ సిస్టమ్ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య 8శాతం పెరిగి 34 కోట్లకు చేరాయి. అదే సమయంలో ఐఎంపీఎస్‌, బ్యాంక్‌ ఆధారంగా జరిపే ఐఎంపీఎస్‌ ట్రాన్సాక్షన్లు 5శాతం తగ్గి 46 కోట్లుగా నమోదయ్యాయి. డిజిటల్‌ లావాదేవీలవైపు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. దీంతో అనేక బ్యాంకులు ఈ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాదిలో యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకుల సంఖ్య 492గా ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 622కు పెరిగింది.

* దేశంలో వస్తు,సేవల పన్ను వసూళ్లు (GST collections) మరోసారి గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబర్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.33,821 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.41,864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99,111 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.12,550 కోట్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌ నెల వసూలైన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.9 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4 శాతం మేర పెరిగి రూ.45,096 కోట్లుగా వసూలైనట్లు కేంద్రం తెలిపింది. అక్టోబర్‌ నెలలో రూ.19,306 కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది.

* భారత్‌లో యాపిల్‌ ఐఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ముంబై, ఢిల్లీలో ఉన్న రెండు స్టోర్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి ఐఫోన్‌ విక్రయాల ద్వారా భారత్‌ నుంచి వస్తోన్న ఆదాయం గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మరో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు (Apple Stores in India) సంస్థ సీఈవో (Apple CEO) టిమ్‌ కుక్‌ (Tim Cook) తాజాగా ప్రకటించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z