Business

సాగర్-శ్రీశైలం పడవ ప్రయాణం ప్రారంభం-BusinessNews-Nov 02 2024

సాగర్-శ్రీశైలం పడవ ప్రయాణం ప్రారంభం-BusinessNews-Nov 02 2024

* మొబైల్‌ అంటే ఇలానే ఉండాలీ అనే కట్టుబాట్లకు తన ట్రాన్స్‌పరెంట్‌ లుక్‌తో చెక్‌ చెప్పిన మొబైల్‌ కంపెనీ నథింగ్‌ (Nothing).. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వ్యవస్థలో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ గుత్తాధిపత్యం కొనసాగుతున్న వేళ.. సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలనుకుంటోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, వన్‌ప్లస్‌ మాజీ సీఈఓ కార్ల్‌ పై స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్‌క్రంచ్‌ సంస్థ నిర్వహించిన సదస్సులో దీనిపై కార్ల్‌పై మాట్లాడుతూ.. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కూడా జోడించనున్నట్లు తెలిపారు. సొంత ఓఎస్‌ ద్వారా మెరుగైన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సాధ్యపడుతుందని చెప్పారు. నిధుల కొరత ఉన్నప్పటికీ.. కంపెనీ దీనిపై పనిచేయగలదని పేర్కొన్నారు.

* పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని కార్తిక మాసం తొలిరోజున తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ.. సాగర్‌లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో.. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీటి లభ్యత ఉంది. దీంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు. అక్కణ్నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటలపాటు ఈ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ ధరలు నిర్ణయించారు. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది.

* మార్కెట్‌ స్థితిగతులతో సంబంధం లేకుండా.. ప్రతివారం కొత్త ఐపీఓలు (IPOs) క్యూ కడుతూనే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న కొన్ని ఐపీఓలు మదుపర్లకు చేదు అనుభవాన్ని మిగిలిస్తుంటే.. కొన్ని చిన్న కంపెనీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే వారం కూడా మరో 5 ఐపీఓలు ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో స్విగ్గీ సహా (Swiggy IPO) మరో నాలుగు మెయిన్‌ బోర్డు ఐపీఓలు కాగా.. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఐపీఓ ఒకటి ఉంది. ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వచ్చే వారం స్టాక్‌ ఎక్స్ఛంజీల్లో లిస్ట్‌ కానుంది. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఐపీఓ రూ.11,327 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నవంబర్‌ 6 నుంచి 8 వరకు అందుబాటులో ఉంటుంది. ధరల శ్రేణిని రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 17.5 కోట్ల షేర్లు కంపెనీ విక్రయించనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను అనుబంధ సంస్థలు, టెక్నాలజీ, బ్రాండ్ ప్రమోషన్‌కు పెద్ద మొత్తంలో ఖర్చు చేయనుంది.

* నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. దీంతో పాటు తన వెబ్‌సైట్‌ సేవల్ని మరింత మెరుగుపర్చింది. ఇప్పటివరకు కేవలం ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ సేవల్ని మరిన్ని భాషలకు విస్తరించింది. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మదుపరులు సులభంగా డేటాను యాక్సెస్‌ చేసే సదుపాయం లభించింది. ఎన్‌ఎస్‌ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు యాక్సెస్‌ చేయొచ్చు. పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందులోనే ఇండెక్స్‌ ఓవర్‌వ్యూలు, మార్కెట్‌ అప్‌డేట్లు, ట్రేడింగ్‌ వాల్యూమ్‌లు, నిఫ్టీ50 పర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్లు, స్టాక్‌ సెర్చ్‌ క్యాపబులిటీస్‌, కస్టమైజ్డ్‌ వాచ్‌లిస్ట్స్‌.. ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఆప్షన్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన కాల్స్‌, పుట్స్‌.. లాంటి మొత్తం డేటా ఉంటుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

* ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అమెరికా ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలో అక్రమంగా నివాసం ఉన్నారంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అవి నిజమని తేలితే.. మస్క్‌కు బహిష్కరణ ముప్పు ఉండొచ్చన్న వార్తలు వచ్చాయి. అవన్నీ తనను అణచివేసేందుకు రాజకీయంగా ప్రేరేపితమైన ప్రయత్నాలంటూ ఆయన స్పందించారు. 1990ల్లో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన ఉద్యోగ జీవిత ప్రారంభంలో అమెరికా (USA)లో అక్రమంగా నివాసం ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అవే నిజమైతే.. మస్క్‌ బహిష్కరణకు గురికావొచ్చు లేకపోతే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కావొచ్చంటూ న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్‌కు తన తల్లిద్వారా కెనడా పౌరసత్వం లభించింది. ఇప్పుడాయన అమెరికా పౌరుడిగా ఉన్నారు. ఇక ఈ వార్తలపై మస్క్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే.. నన్ను అణచివేసేందుకు చేయాల్సిందంతా చేస్తారు. నేను అదే విషయం చెప్తుంటే ఆ మాటలను ఇంకా చాలామంది నమ్మడం లేదు’’ అని పేర్కొన్నారు.

* మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లను వెచ్చించనుంది.

కారిడార్‌ 4 – నాగోలు TO శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (36.8కి.మీ)
కారిడార్‌ 5 – రాయదుర్గం TO కోకాపేట నియోపోలిస్‌ (11.6 కి.మీ)
కారిడార్‌ 6 – ఎంజీబీఎస్‌ TO చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
కారిడార్ 7 – మియాపూర్‌ TO పటాన్‌చెరు (13.4 కి.మీ)
కారిడార్ 8 – ఎల్బీనగర్‌ TO హయత్‌ నగర్‌ (7.1 కి.మీ)
మెట్రో రైలు రెండో దశ పార్ట్-బి
కారిడార్‌ 9 – శంషాబాద్ TO ఫ్యూచర్‌ సిటీ

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z