Politics

బొకే ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ-NewsRoundup-Nov 03 2024

బొకే ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ-NewsRoundup-Nov 03 2024

* నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా బొకేలు సమర్పించి వేమిరెడ్డి పేరును విస్మరించడంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి కిందకు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. స్టేజ్‌పై తనకు తగిన గౌరవం దక్కలేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వెంట కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్‌, అధికారులను మంత్రి ఆదేశించారు.

* బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌ (Srikanth Kidambi) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ స్టైలిస్ట్‌ శ్రావ్య వర్మను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల శ్రావ్య ఇచ్చిన బ్యాచిలరేట్‌ పార్టీలో నటి రష్మిక (Rashmika), వర్ష బొల్లమ్మ పాల్గొన్నారు. కాబోయే వధువుతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని శ్రావ్య ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ‘‘నా గర్ల్‌ గ్యాంగ్‌తో సింగిల్‌గా ఇదే నా లాస్ట్‌ వీకెండ్‌’’ అని పేర్కొన్నారు. దీనిపై రష్మిక స్పందించారు. ‘‘శ్రావ్య వర్మ మేడమ్‌ పెళ్లి చేసుకోనున్నారు. శ్రీకాంత్‌ కిదాంబి.. ఇకపై తను నీది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే’’ అని తెలిపారు. దీనికి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘మహారాణిలా చూసుకుంటా’’నని బదులిచ్చారు.

* ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రౌడీయిజం చేసేవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. దీపావళి పండుగ రోజు గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులోని శకుంతలనగర్‌లో దళిత కుటుంబంపై దాడికి సంబంధించి ఏ1గా ఉన్న వైకాపా నేత నరేంద్రరెడ్డి సహా మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు.

* జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబాకు చెందిన అగ్ర కమాండర్‌ ఉస్మాన్‌ను భద్రత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లలో శ్రీనగర్‌లో చోటుచేసుకున్న కీలక ఎన్‌కౌంటర్‌ ఇదే. ఈ ఆపరేషన్‌ విజయం వెనుక సైన్యం వ్యూహాత్మక ప్రణాళికే గాకుండా.. ఓ అసాధారణ సమస్యకు పరిష్కారం కూడా దాగి ఉంది. అదే.. వీధి శునకాలకు బిస్కెట్లు వేయడం.

* దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జమిలి’ ప్రతిపాదనను ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ (Vijay) వ్యతిరేకించారు. ఒకే దేశం – ఒకే ఎన్నికను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పార్టీ జిల్లా ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీకేని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా డీఎంకే, భాజపా పాలనపై మండిపడిన విజయ్‌.. తమిళనాడులో శాంతిభద్రతల అంశంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో కులగణన చేపట్టాలని కోరిన ఆయన.. పరందూర్‌ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్దేశిత గడువు నిర్దేశించుకొని క్రమంగా మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

* తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరులోని శిల్పారామంలో విషాదం చోటు చేసుకుంది. క్రాస్‌ వీల్‌లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మృతురాలిని తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* దీపావళి పండగ సందర్భంగా నగరంలో కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్‌ ప్రశ్నించారు. ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

* కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వారు.. కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు.. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు.

* కాంగ్రెస్‌ ప్రజా పాలనలో రాష్ట్రంలోని ఆడబిడ్డలు అరిగోసపడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్ల కోసం నల్లగొండ జిల్లాలో ఆందోళన చేపట్టారు. నల్లగొండ(Nalgonda) మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానిక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఆందోళనతో నల్లగొండ- కనగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

* లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్‌ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులను ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా వడ్లు తెచ్చినా కోనేటోళ్లు లేరని.. పట్టించుకునే నాథుడు లేడు అని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ ప్రభుత్వంలో వడ్లుకొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం వడ్లు దళారులు కొన్నారని.. రైతులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు గోసపడుతున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేని పరిస్థితి దుస్థితి నెలకొందని.. ఎన్నికలకు ముందు రేవంత్‌ రైతుల మద్దతు కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

* ఏపీ మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. రుషికొండపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టించిన భవనం చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రుషికొండపై ఉన్న భవనం వైఎస్‌ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి అని కామెంట్స్‌ చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు

* ముంబై వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో 25 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ అద్బుత విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భార‌త్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ఈ ఆఖ‌రి టెస్టులో కివీస్ స్పిన్న‌ర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 147 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ స్పిన్న‌ర్లు త‌మ మయాజాలంతో డిఫెండ్ చేసుకున్నారు. అజాజ్ ప‌టేల్‌, గ్లెన్ ఫిలిప్స్ దాటికి భార‌త్ కేవ‌లం 121 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అజాజ్ ప‌టేల్ 6 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఫిలిప్స్ 3 వికెట్ల‌తో టీమిండియాను దెబ్బ‌తీశారు. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్(64) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా అజాజ్ ప‌టేల్ నిల‌వ‌గా, ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును విల్ యంగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వ‌ర‌కు స్వ‌దేశంలో టీమిండియా ఏ జట్టు చేతిలో కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవ్వలేదు.

* వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొ న్నారు. ఇవాళ(ఆదివారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్ళిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి.తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ‘2027 చివరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపిస్తారు’ అని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z