NRI-NRT

5వేల మంది లాయర్ల సేనతో ట్రంప్ సిద్ధం-NewsRoundup-Nov 05 2024

5వేల మంది లాయర్ల సేనతో ట్రంప్ సిద్ధం-NewsRoundup-Nov 05 2024

* అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. కమలా హారిస్‌ (Kamala Harris), డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్న ఎన్నికల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దేశ వ్యాప్తంగా నవంబర్‌ 5న పోలింగ్‌ మొదలవ్వగా.. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయాలు వేర్వేరుగా ఉన్నాయి. అమెరికాలో పలు కాలమానాల ప్రకారం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది.

* విధుల్లో అలసత్వం వహించినందుకే సీఎం చంద్రబాబు తనను మందలించారని.. ఇందులో అపార్థాలకు తావు లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వార్డు మెంబర్ కూడా కాని తనకు.. మంత్రి పదవి ఇచ్చి అత్యంత గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. అలసత్వాన్ని గుర్తు చేసి మందలించిన చంద్రబాబు.. తనకు తండ్రితో సమానమని చెప్పారు. ఇక నుంచి తాను బాధ్యతగా వ్యవహరిస్తానని వాసంశెట్టి స్పష్టం చేశారు.

* మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈక్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన దాదాపు 5 వేల మంది లాయర్లను నియమించుకున్నట్లు సమాచారం. ఈమేరకు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2020 అధ్యక్ష ఎన్నికలపై అప్పట్లో ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ట్రంప్‌ తరఫు లాయర్లు పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. నాటి పరిణామాల దృష్ట్యా తాజా ఎన్నికలకు ట్రంప్‌ కట్టుదిట్టంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం 5వేల మంది లాయర్లతో ఓ బృందాన్ని ఏర్పరుచుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడం, అవకతవకలపై ప్రతిస్పందనలను సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియను ఈ బృందం నిశితంగా పరిశీలించనుంది. ఒకవేళ ఎన్నికల ఫలితాలు ఆయనకు ప్రతికూలంగా వస్తే.. తక్షణమే వాటిని కోర్టులో సవాల్‌ చేసేందుకు వీరంతా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

* ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్న బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు కార్మికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

* దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే వారి వేతనాలు పెంచుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రూ.15వేల కనీస వేతనం ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధిచేకూరనుందని మంత్రి అన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10కోట్ల మేర అదనపు భారం పడనుందని చెప్పారు. కొంత మొత్తం సీజీఎఫ్‌ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుందని ఆనం వెల్లడించారు.

* ఝార్ఖండ్‌ ఎన్నికల వేళ ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎం కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశాయి. మొత్తం ఏడు గ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో జేఎంఎం అధ్యక్షుడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు.

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించి పోలవరం పనులు ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్‌ డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, డిజైన్లకు అనుమతి, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తయ్యే అంశంపై సమీక్షలో చర్చించారు.

* తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్‌ ముఖాముఖిగా మాట్లాడారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

* అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris)కు మూడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ (Joe Biden) వైపు డిక్స్‌విల్లే నాచ్‌ ఓటర్లు మొగ్గుచూపారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం.

* ప్రజల ఆస్తులు లాక్కొని.. తమ సొంత ఆస్తిలా భావించి జగన్‌ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు. వైకాపా నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్‌ భూములను పవన్‌ పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్‌, అటవీ, రెవెన్యూ అధికారులు ఉన్నారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్‌కు వివరించారు. భూములను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ సరస్వతీ పవర్‌ ప్లాంట్‌ కోసం గత ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సొంతంగా భూములు తీసుకున్నారు. 2009లో వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్లు లీజుకు తీసుకోగా.. జగన్‌ సీఎం అయిన తర్వాత లీజును మరో 50 ఏళ్లు పొడిగించుకున్నారు. కానీ, ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు’’

* అమెరికా ఎన్నికల్లో (US Election) తుది ప్రచారం ముగిసింది. న్యూహాంప్‌షైర్‌ వంటి రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే పోలింగ్‌ మొదలైంది. చాలా సంస్థలు తమ ఫైనల్‌ సర్వే నివేదికలను వెలువరించాయి. నిన్నటి వరకు ట్రంప్‌ (Donald Trump) ఆధిక్యంలో ఉన్న కొన్ని చోట్ల ఇప్పుడు కమలా హారిస్‌ (Kamala Harris) మళ్లీ పుంజుకొన్నట్లు (us election 2024 prediction) చెబుతున్నాయి. ప్రముఖ పోలింగ్‌ గురు నేట్‌ సిల్వర్‌కు చెందిన ‘ఫైవ్‌ థర్టీ ఎయిట్‌’ తన తుది సర్వేను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసినట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. దీనిలో నిన్నటి వరకు ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న చోట కమల పుంజుకొన్నట్లు వెల్లడించింది. ఇక స్వింగ్‌ స్టేట్స్‌లో పోటీ ఫలితాలను అంచనా (us elections prediction) వేయలేనంతగా ఉందని పేర్కొంది.

* రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ 1982 బిల్లు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. భూసేకరణ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నాయి. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయ‌ని.. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే భూసేకరణ చట్టం 1982ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

* మూడు పార్టీలు కూటమిగా కలిసి ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు ఉంటాయని.. కూర్చొని మాట్లాడుకుంటే అవి పరిష్కారమవుతాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన అనంతరం తొలిసారిగా ఆయన కాకినాడకు వచ్చారు. తెదేపా, జనసేన, భాజపా నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. ‘‘కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. సీఎం ఆదేశాల ప్రకారం మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఎన్నికల కోడ్‌ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు తమ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఎక్కువగా చర్చించారు. రూ.10లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడేశారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. తన అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం.

* ఆహారాన్ని కల్తీ చేసేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని.. కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. నగరంలోని వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ శివలీల, జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది స్ట్రీట్ ఫుడ్‌ వెండర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు.

* రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టగలిగారా? అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ వ్యాఖ్యలు, సరస్వతి పవర్‌ భూముల్లో పర్యటన పరిణామాలపై అంబటి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మేం మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ కూడా అదే చెప్తున్నారు. పాలన చేతకాక పవన్‌ ఇలా తప్పించుకుంటున్నారు. ఐదు నెలల తర్వాత పోలీసులు విఫలమయ్యారంటే మీకు పాలన చేతకాదని అర్థం. అసలు అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్‌ ఏం చేస్తున్నారు.పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్‌ ఏం చేశారు?. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్ట్‌ చేశారు. పైగా ప్రశ్నిస్తే.. డైవర్షన్‌ పాలిటిక్సా? అని పవన్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌ ముందే అనిత హోం మంత్రి, వెనకాల నారా లోకేష్‌ అన్ని ట్రాన్స్‌ఫర్లు చేస్తారు అని ఎద్దేవా చేశారాయన.అలాగే.. గతంలో ఇదే పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ‘‘ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని వైఎస్సార్‌సీపీ హయాంలో పవన్‌ అన్నారు. మరి మిస్సైన వాళ్లలో ఒక్కరి జాడ అయినా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందా?’’ అని అంబటి ప్రశ్నించారు.

* సినీ నటి కస్తూరు తమిళనాడులో ఒక వేదికపై తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే, తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదంటూ ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ, ఆమెపై ఎదురుదాడి ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఎట్టకేలకు తెలుగు ప్రజలకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది. ‘నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. ప్రాంతాలను విడికొట్టి ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం నా అదృష్టం. నేను నాయకర్ రాజులు, కట్టబొమ్ము నాయక (వీరపాండ్య కట్టబ్రహ్మన) , త్యాగరాజు కీర్తనల గురించి తెలుసుకుంటూ పెరిగాను. తెలుగులో నా సినీ కెరీర్‌ ఎంతో అద్భుతంగా సాగుతుంది. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు కీర్తి, ప్రేమ, కుటుంబాన్ని అందించారు. నేను మాట్లాడింది కొందరి వ్యక్తుల గురించి మాత్రమేనని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు.

* ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం​ వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమంటూనే, మాదిగ మహిళ అనితను అవమానించినట్లే కదా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని పవన్‌ను హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ. ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ‘ఇదే‌ విధంగా‌ పవన్ కళ్యాణ్‌ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలా వుంటుంది. పవన్ కళ్యాణ్ ‌కాపులకు పెద్దన్న‌ఏమో.. మాకు కాదు. జన‌సేనకు కేటాయించిన బిసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో‌ సీటు ఎందుకు ఇవ్వలేదు. జనసేన అందరి‌ పార్టీనా కాదా?, కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారు. రిజర్వేషన్ మూడు సీట్లు‌ మాలలకు ఇచ్చారు. పవన్‌ కల్యాన్‌ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా వుంటుంది. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల మేము మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం. లా‌ అండ్ ఆర్డర్ ఫెయిల్‌ అంటే సీఎం చంద్రబాబుని అన్నట్లు కాదా? అంటూ ధ్వజమెత్తారు మంద కృష్ణ మాదిగ.

* తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాడ్డాక ఏం మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలంటేనే బిల్డర్లు హడలిపోతున్నారని, ఇదేనా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అంటూ నిలదీశారు. తెలంగాణ రియల్టర్స్‌ ఫోరం సమావేశంకు మంగళవారం మధ్యాహ్నం హాజరైన కేటీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల కంటే తక్కువ లేదు.ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో అందరికి తెలుసు. మార్పు…మార్పు అని ఊదర కొట్టిండ్రు. మార్పు బాగుందా? నన్ను ఇటీవలే కల్సిన ఒక బిల్దర్ పరిస్థితులు బాగా లేవని అన్నారు, నాకు తెలిసిన ఒకే ఒక విద్య రియల్ ఎస్టేట్ అని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారు. 11 నెలల నుంచి చూస్తున్న ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కు అనుమతులు గాలిలొ దీపం.హైడ్రా బ్లాక్ మెయిల్ చేసేoదుకు ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ప్రాజెక్టు లు రద్దు…ఒక్క కొత్త ప్రాజెక్టు వద్దు అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి’ అంటూ విమర్శించారు కేటీఆర్‌. ‘గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కేసీఆర్‌. మేము మంచిగా చేసిన కరెంట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం నాశనం చేసింది. రైతులు మోస పోయినం అని అంటున్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు’ అని కేటీఆర్‌ ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z