Editorials

విస్మయం + దిగ్భ్రాంతి = ట్రంప్ ఎంపికలు

విస్మయం + దిగ్భ్రాంతి = ట్రంప్ ఎంపికలు

అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్‌ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్‌ మస్క్‌ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్‌ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్‌ గెట్జ్‌ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది.

వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు… అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్‌ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్‌ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్‌ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్‌ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి.

ఇప్పుడు ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామిలతో ట్రంప్‌ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్‌ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్‌ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు… గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు.

అయితే ట్రంప్‌–మస్క్‌ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్‌లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్‌ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్‌ అభిప్రాయానికి మస్క్‌ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి.

మస్క్‌ విష యానికొస్తే ఆయన ట్విట్టర్‌ (ఎక్స్‌)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్‌కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్‌ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్‌ ఆరు లక్షల కార్లు విక్రయించారు.

పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్‌ కార్లకు బదులు విద్యుత్‌ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్‌ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్‌ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్‌ అనుకూలుడు.

ట్రంప్‌ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్‌గా మాట్‌ గెట్జ్‌ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్‌ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్‌ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్‌ను ట్రంప్‌ ఎంపిక చేశారు. ట్రంప్‌పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్‌కున్న ఏకైక అర్హత.

రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్‌లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్‌తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్‌ న్యూస్‌ ప్రెజెంటర్‌ హెగ్సెత్‌ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్‌ ప్రశ్నిస్తు న్నారు.

గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్‌వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేసిన తులసి గబార్డ్‌ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

ట్రంప్‌ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్‌’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్‌ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి.

ట్రంప్‌ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్‌తోసహా అందరూ ఉక్రెయిన్‌ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్‌తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్‌ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z