* ఫిన్లాండ్కు చెందిన టెలికాం గేర్ల సప్లయర్ సంస్థ నోకియాకు (Nokia) ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ (Airtel) నుంచి భారీ ఆర్డర్ అందింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో 4జీ, 5జీ ఉపకరణాలను అమర్చేందుకు గానూ కోట్లాది రూపాయల డీల్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు ఎయిర్టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ విలువకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ కాంట్రాక్ట్ కింద 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి బేస్ స్టేషన్ల ఏర్పాటు, బేస్‌బ్యాండ్ యూనిట్లు తదితర ఉపకరణాలు అమర్చనుంది.
* రాజస్థాన్‌లో పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.5000 కోట్ల ఒప్పందంపై దత్తా పవర్ ఇన్ఫ్రా ఎంఓయూ(MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందంతో..బికనేర్, జైసల్మేర్, బార్మర్, నాగౌర్, ప్రతాప్‌గఢ్, జోథ్‌పూర్ జిల్లాల్లో సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్ట్‌లను నిర్మించి రాజస్థాన్‌ను పునరుత్పాదక శక్తికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి దత్తా ఇన్ఫ్రా కృషి చేస్తుంది. దత్తా ఇన్ఫ్రా 1000 MW విద్యుత్‌ను KUSUM పథకం కింద స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(STU)కు అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతంలో 500 నుంచి 750 ఉద్యోగాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని భావిస్తున్నట్లు దత్తా ఇన్ఫ్రా తెలిపింది.
* టాటా మోటార్స్ యాజమాన్యంలోని లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ (Jaguar) కొత్త లోగోను ఆవిష్కరించింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న తరుణలో లోగోను సరికొత్తగా తీర్చిదిద్దింది. ‘కాపీ నథింగ్’ క్యాప్షన్‌లో లోగోకు సంబంధించిన చిన్న క్లిప్‌ను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. జాగ్వార్ విద్యుత్ వాహన విభాగంలో రాణించాలని చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2026 నాటికి మూడు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త లోగోను లాంచ్ చేసింది. జాగ్వల్ పాతలోగోకి కాస్త భిన్నంగా దీన్ని రూపొందించింది. కొత్తలోగోలో అప్పర్‌కేస్, లోయర్‌కేస్ పదాలతో కలిపి లోగో పేరు ‘JaGUar’ గా తీర్చిదిద్దారు.
* కర్ణాటకకు చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ నందిని (Nandini) దిల్లీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ నెల 21న కొన్ని ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. దేశ రాజధాని దిల్లీలో పాలు, పెరుగు వంటి ఉత్పత్తులను అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో పాటు బెంగళూరు మార్కెట్లో ఇడ్లీ, దోశ పిండిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎండీ ఎంకే జగదీశ్ తెలిపారు.
* వర్క్- లైఫ్ బ్యాలెన్స్ అంశంపై ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. పని- వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం చాలా ముఖ్యమైనదని కొందరు భావిస్తుంటే.. పనికే ఎక్కువ సమయం కేటాయించాలని వాదించేవారూ ఉన్నారు. తాజాగా ఈ అంశంపై విప్రో (Wipro) ఛైర్మన్ రిషద్ (Rishad Premji) ప్రేమ్‌జీ మాట్లాడారు. వర్క్- లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనదన్న ఆయన.. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పద అంశంగా మారిపోయిందన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. బ్యాంకింగ్, ఐటీ, వాహన షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా నష్టపోయిన సూచీలు ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 239.37 పాయింట్లు అందుకొని 77,578.38 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ ఏడు రోజుల పతనం నుంచి లాభాల్లోకి మళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి 64.70 పాయింట్లు అందుకొని 23,518.50 వద్ద స్థిరపడింది. గత ఏడు సెషన్లలో నిఫ్టీ 1,030 పాయింట్లు లేదా 4.3 శాతం పతనం కాగా, సెన్సెక్స్ 3,000 పాయింట్లు తగ్గి 77,300కి పడిపోయిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, అమెరికా బాండ్ ఈల్డ్ బలపడటం సూచీల పతనానికి ప్రధాన కారణాలు. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టాటా మోటర్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా..రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z