* స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20 శాతం వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు చవిచూసిన సూచీలు.. మరోసారి తన నష్టాల పరంపరను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అదానీ గ్రూప్ ఛైర్మన్‌పై అమెరికాలో అభియోగాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.425 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,711.11 పాయింట్ల (క్రితం ముగింపు 77,578.38) వద్ద లాభాల్లో ప్రారంభమయ్యాయి. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,802.73 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 422 పాయింట్ల నష్టంతో 77,155.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 168.60 పాయింట్ల నష్టంతో 23,349.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు క్షీణించి జీవనకాల కనిష్ఠమైన 84.49కు చేరింది.
* తమపై వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ (Adani group) స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు, దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అదానీ గ్రూపు స్టాక్స్ భారీగా పడ్డాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
* అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీ( Gautam Adani)కి.. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్లలో దాదాపు రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జడ్జి జారీ చేశారు. ప్రాసిక్యూటర్లు ఆ వారెంట్‌ను .. విదేశీ న్యాయశాఖకు అందజేయనున్నారు.
* అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన ‘సీ3 ఎయిర్‌క్రాస్’ (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ‘లాటిన్ ఎన్‌సీఏపీ’ క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ ‘బ్రెజిల్ స్పెక్’ కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్‌సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది. అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్‌సీఏపీ ధ్రువీకరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z