* ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం చొప్పున పనితీరు ఆధారిత బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ బోనస్‌ను ఇచ్చేందుకు నిర్ణయించింది. నవంబర్ నెల వేతనంతో పాటు ఈ బోనస్‌ను చెల్లించనుంది. సంబంధిత త్రైమాసికంలో ఉద్యోగి పనితీరు, సహకారం ఆధారంగా ఈ బోనస్ చెల్లింపులు చేయనుంది.
* ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన వాహన శ్రేణిని మరింత విస్తరించింది. గిగ్, ఎస్1 జడ్ శ్రేణిలో కొత్త స్కూటర్లను లాంచ్ చేసింది. గిగ్ శ్రేణిలో ఓలా గిగ్ (Ola Gig), ఓలా గిగ్+ (Ola Gig+) స్కూటర్లను ప్రకటించింది. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఎస్1 జడ్ (Ola S1 Z) స్కూటర్ ధరను రూ.59,999గా, ఎస్1 జడ్+ (Ola S1 Z+) స్కూటర్ ధరను రూ.64,999గా నిర్ణయించింది. రూ.499 చెల్లించి నేటి నుంచే వీటిని బుక్ చేసుకోవచ్చని ఓలా తెలిపింది. గిగ్ శ్రేణి వాహనాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి, ఎస్1 జడ్ శ్రేణి వాహనాల డెలివరీ మే నుంచి ప్రారంభం కానున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల భయాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. తాను అధికారంలోకి రాగానే మెక్సికో, కెనడా, చైనా దిగుమతలపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ పేర్కొనడం ఇందుకు నేపథ్యం. దీనివల్ల ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టోయాయి. సెన్సెక్స్ ఉదయం 80,415.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,109.85) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 105.79 పాయింట్ల నష్టంతో 80,004.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.33గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2629 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ (Realme) సంస్థ దేశీయ మార్కెట్లోకి జీటీ7 ప్రో (Realme GT 7 Pro) పేరిట కొత్త గేమింగ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. క్వాల్కామ్ సంస్థ కొత్తగా లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఈ చిప్ సెట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ తమదేనని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ7 ప్రో 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌రేటుతో, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో ఆధారిత రియల్మీ యూఐ 6.0తో పనిచేస్తుంది. ఏఐ స్కెచ్, సమ్మరీ, స్పీక్, రైటర్, బెస్ట్ ఫేస్ వంటి ఏఐ ఫీచర్లతో వస్తోంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
* టెలికాం రంగానికి సంబంధించి కేంద్ర కేబినెట్ (Union cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీలు బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సిన నిబంధనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికాం కంపెనీలపై ఆర్థికంగా భారం తగ్గించినట్లయ్యింది. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కంపెనీకి భారీ ఊరట ఇచ్చినట్లయ్యింది. 2022కు ముందు నిర్వహించిన వేలంలో స్పెక్ట్రమ్ దక్కించుకున్న టెలికాం కంపెనీలు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్న నిబంధనను కేబినెట్ తొలగించింది. వొడాఫోన్ ఐడియా సంస్థ.. 2025 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ల మధ్య చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి సుమారు రూ.24,746.9 కోట్లు విలువైన బ్యాంకు గ్యారెంటీలను సమర్పించాల్సి ఉంది. సుమారు రూ.2.22 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిన ఆ కంపెనీకి ఇదో పెద్ద గుదిబండగా మారిన వేళ ఈ ఊరట లభించడం గమనార్హం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z