* గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో తరలించే 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌బ్ల్యూడీఏ) 74వ పాలకమండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ నుంచి నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజనీర్లు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచే ప్రాజెక్టును చేపట్టడంతో పాటు అధిక భూభాగాన్ని కోల్పోతున్నందున ఎక్కువ వాటా ఇవ్వాలని పేర్కొంది.
* విడుదలకు ముందు ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ‘పుష్ప 2’ (Pushpa 2) మరో రేర్ ఫీట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.100కోట్లకుపైగా కలెక్షన్స్ (Pushpa 2 Advance Booking Collections) రాబట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా గురువారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో ‘పుష్ప’రాజ్ సందడి ప్రారంభం కానుంది.
* బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు అక్కడి ప్రభుత్వం సమన్లు జారీచేసింది. దీంతో అక్కడి విదేశాంగ కార్యాలయానికి వెళ్లిన వర్మ.. ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. త్రిపుర రాజధాని అగర్తలలో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించిన నేపథ్యంలో సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
* బ్యాంకు వినియోగదారు తన ఖాతాకు నలుగురు నామినీలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పలు కీలక ప్రతిపాదనలతో తీసుకొచ్చిన బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు-2024ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Niramala sitharaman) సభ ముందు ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.
* మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో (Maharashtra) కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో.. ఆ పీఠంపై భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) కూర్చోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ శిందే (Eknath Shinde) నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. డిసెంబరు 5న మహారాష్ట్రలో మహాయుతి నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు తీరనుంది.
* రాజధాని అమరావతిలో తొలిదశలో రూ.11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది. రూ.2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని, రూ.1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని రూ.3,525 కోట్లతో పూర్తిచేస్తారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని రూ.3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందున్న టెండర్లు రద్దుచేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.984.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఆలస్యంతో సీఆర్డీయే నష్టపోయే రూ.270.71 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం జరిగింది. 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వాటిలో చాలా పనుల్ని ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి రానున్న నిధులతో చేపట్టనున్నారు.
* అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడం ఆయా దేశాలను కలవరపాటుకు గురిచేసింది. దీంతో వెంటనే అమెరికాకు పయనమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau).. ట్రంప్‌తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేని పక్షంలో సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ ఆయనను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలు అంటించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
* ‘‘క్రికెట్లో రాణిస్తున్న సమయంలో నాకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. మా అమ్మ తరఫు బంధువుల ఒత్తిడి మేరకు కొన్ని పెళ్లిచూపులకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది అబ్బాయిలతో మాట్లాడారు. పరిచయాలు అయిపోగానే వారు పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడేవారు. ఎంతమంది పిల్లలు కావాలి? అని అడిగేవారు. నేనెప్పుడూ క్రికెట్ గురించే ఆలోచించేదాన్ని. ఇలాంటి ప్రశ్నలు ఊహించలేదు. ఎవరితోనూ దీని గురించి చర్చించకపోవడంతో ఆ సందర్భంగా ఒకింత ఇబ్బందికి గురిచేసింది. అప్పటికి నేను భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఉన్నా. అలాంటి నన్ను పెళ్లిచూపులకు వచ్చిన ఓ వ్యక్తి వివాహం తర్వాత క్రికెట్ మానేసి పిల్లలను మాత్రమే చూసుకోవాలని చెప్పాడు. పెళ్లి తర్వాత అత్తగారికి సేవలు చేస్తావా? ఆడుతావా? ఈ రెండింటిలో ఏది నీకు ముఖ్యం అని అడిగినవాళ్లూ ఉన్నారు’’ అని మిథాలీ (Mithali Raj) వివరించింది.
* హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడారు.
* వైకాపా (YSRCP) సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి (Varra Ravinder Reddy) కేసులో ఆ పార్టీకి చెందిన నలుగురిని పులివెందుల పోలీసులు విచారించారు. కడప వైకాపా కోకన్వీనర్ సునీతారెడ్డితో పాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు చెందిన ఆ పార్టీ కార్యకర్తలను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారించి పలు అంశాలపై ఆరా తీశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు వీరిని విచారణకు పిలిచారు.
* సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతను స్వదేశానికి రప్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. జిల్లాలోని పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కంచిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందిన 16 మంది యువకులు అక్కడ చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు.
* జియో సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. పారిశ్రామిక రంగాలతో పాటు ప్రభుత్వాలకు ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన జియో స్మార్ట్ ఇండియా రెండో సదస్సులో ఆయన మాట్లాడారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని తెలిపారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు ఇబ్బందిపడినా.. నగరంలో చెరువుల సంరక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నాలాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయన్నారు. జియో స్పేషియల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు.
* శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. యాత్రికుల రైళ్ల కోచ్‌ల లోపల పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు రైల్వే (Indian railways) అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు రైళ్లలో చేయవద్దని ప్రయాణికులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరి మార్గమధ్యలో పలు స్టేషన్లలో ఆగుతాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సహకారం కోరుతుంది. రైళ్లలో, రైలు ప్రాంగణాలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేస్తుంది. మండే స్వభావంగల పదార్థాలతో ప్రయాణం చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
* ‘ఆయుర్వేద చాక్లెట్లు. తింటే సకల రోగాలు పోతాయి.. రోగ నిరోధక శక్తిలా పని చేస్తాయి’ అని కవర్‌పై రాసి మరీ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఒకసారి తిన్న వారంతా మరోసారి అవే కావాలంటూ వెళ్లి కొంటున్నారు. వీటిని ఒకసారి తింటే ఆ చాక్లెట్ల కోసం మనసంతా లాగేస్తుండటంతో.. పదే పదే అవే కావాలంటూ వాటికి బానిసలవుతున్నారు. వీటి వ్యవహారం ఏమిటని ఆరా తీస్తే అవి ఆయుర్వేదం మందుతో చేసినవి కావని.. గంజాయి చాక్లెట్లని తేలింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.రవీందర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది సోమవారం జరిపిన దాడుల్లో 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఈఎస్ మణికంఠ వివరాలు వెల్లడించారు.
* ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్‌సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు.
* వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటం ఎలా చేయాలనే అంశంపైనా రేపటి సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లిలో రేపు జరగబోయే భేటీలో.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చించననున్నారు. అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో..రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపైన చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. అలాగే ఒక ప్రణాళికను రూపొందించి.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
* ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z