Business

ఇండిగో vs మహీంద్రా-BusinessNews-Dec 03 2024

ఇండిగో vs మహీంద్రా-BusinessNews-Dec 03 2024

* బ్యాంకు వినియోగదారు తన ఖాతాకు నలుగురు నామినీలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పలు కీలక ప్రతిపాదనలతో తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ చట్టాలు (సవరణ) బిల్లు-2024ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Niramala sitharaman) సభ ముందు ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకుల్లో డైరెక్టర్‌షిప్‌ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని సైతం పెంచేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ మొత్తం ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉంది. ఇప్పుడున్న పరిమితి దాదాపు ఆరు దశాబ్దాల కింద నిర్దేశించారు. దాన్ని రూ.2 కోట్లకు పెంచారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ఇకపై డిపాజిటర్లు నలుగురి నామినీలను ఒకేసారి లేదా ఒకటి తర్వాత ఒకటి ఎంచుకునే అవకాశం కల్పి్స్తున్నట్లు తెలిపారు. లాకర్‌ సదుపాయం ఎంచుకున్న వారు మాత్రం ఒకరు తర్వాత ఒకరుగా నామినీలను ఎంచుకోవచ్చని చెప్పారు.

* మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌సోల్‌ ఐటీఎస్‌ టెక్నాలజీస్‌ ఎస్‌ఎంఈ ఐపీఓను (Trafiksol SME IPO) రద్దు చేసింది. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయిన మదుపర్లకు పూర్తి సొమ్మును వాపసు చేయాలని ఆదేశించింది. ఆ కంపెనీపై వచ్చిన ఫిర్యాదులు నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. రిఫండ్‌ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఎస్‌ఈకి సూచించింది. నొయిడాకు చెందిన ట్రాఫిక్‌సోల్‌ ఐటీఎస్‌ సంస్థ.. ట్రాఫిక్‌, టోల్‌ ప్లాజాలకు ట్రాఫిక్‌ సిస్టమ్స్‌ కోసం సాఫ్ట్‌వేర్‌లను అందిస్తుంటుంది. ఈ సంస్థ రూ.45 కోట్లు సమీకరించేందుకు ఈ ఏడాది ఐపీఓకు వచ్చింది. సెప్టెంబర్‌ 10న సబ్‌స్క్రిప్షన్‌కు ప్రారంభం కాగా.. 12న ముగిసింది. ధరల శ్రేణిని రూ.66-70గా నిర్ణయిచింది. మొత్తం 345.65 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 17న లిస్టింగ్‌ కావాల్సి ఉండగా.. స్మాల్‌ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి సెబీకి ఫిర్యాదు అందింది.

* హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ భారత్‌లో ప్రముఖ IIT విశ్వవిద్యాలయాల(ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌)తో సంయుక్తంగా బ్యాటరీ, విద్యుదీకరణ సంబంధిత అంశాలలో పరిశోధనలను నిర్వహించడానికి భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకుగాను అయిదు సంవత్సరాల్లో(2025 నుంచి 2029 వరకు) సుమారు 7 మిలియన్‌ డాలర్ల(రూ.59 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. హ్యుందాయ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(CoE)కు సంబంధించిన ప్రాథమిక లక్ష్యం బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని సాధించడం. ముఖ్యంగా భారతీయ మార్కెట్‌కు సంబంధించిన బ్యాటరీ, విద్యుత్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్‌(EV) ఎకోసిస్టమ్‌కు సహకారం అందించాలని ఈ గ్రూప్‌ భావిస్తోంది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పంపిణీని విస్తరించేందుకు వివిధ విధానాలను ఇది పరిశీలిస్తుంది. ఐఐటీ దిల్లీలో ఉన్న భారత్‌లోని ఏకైక ఈవీ సంబంధిత పరిశోధనా సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైబాలజీ(CART) సహకారాన్ని కూడా తీసుకుంటుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వరుసగా మూడోరోజూ లాభాల్లో స్థిరపడ్డాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. జీడీపీ నెమ్మదించిన నేపథ్యంలో ఈసారి ఎంపీసీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గించకపోయినా సీఆర్‌ఆర్‌ తగ్గించొచ్చన్న అంచనాలతో ఇవాళ బ్యాంక్‌ స్టాక్స్‌ రాణించాయి. దీంతో నిఫ్టీ 24,450 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 80,529.20 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,248.08) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే భారీ లాభాల్లోకి వెళ్లింది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 80,949.10 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభంతో 24,457.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది.

* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo)… ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్‌పై కోర్టుకెక్కింది. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన కారు పేరులో ‘6ఈ’ వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహీంద్రా సంస్థ ట్రేడ్‌ మార్క్‌ ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో దావా వేసింది. అయితే, జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ ముందుకు మంగళవారం ఈ కేసు విచారణకు రాగా.. ఆయన విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో డిసెంబర్‌ 9న విచారణ జరిగే అవకాశం ఉంది. ఇండిగో సంస్థ ‘6ఈ’ బ్రాండింగ్‌ను వివిధ సేవలకు వినియోగించుకుంటోంది. ‘6ఈ’ పేరుతో విమాన సర్వీసులతో పాటు 6ఈ ఫ్లెక్స్‌, 6ఈ ప్రైమ్‌, 6ఈ లింక్‌ పేరిట వివిధ రకాల సేవలనూ అందిస్తోంది. అయితే, మహీంద్రా ఇటీవల విడుదల చేసిన బీఈ 6ఈ మోడల్‌ కారులో 6ఈని వినియోగించడంపై తాజాగా అభ్యంతరం లేవనెత్తింది. ఈ వ్యవహారంలో తమతో సంప్రదింపులు జరిపేందుకు మహీంద్రా ప్రయత్నించిందని ఇండిగో తరఫు సీనియర్‌ న్యాయవాది సందీప్‌ సేథి తెలిపారు. మరోవైపు బీఈ 6ఈతో పాటు ఎక్స్‌ఈవీ 9 కార్లను ఇటీవల మహీంద్రా ఆవిష్కరించింది. ఈ వాహనాలు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z