Business

అమెరికాకు ఎగుమతులపై చైనా నిషేధం-BusinessNews-Dec 04 2024

అమెరికాకు ఎగుమతులపై చైనా నిషేధం-BusinessNews-Dec 04 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, రియల్టీ స్టాక్స్‌ కొనుగోళ్లతో మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 81,036.22 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా పడిపోయింది. తిరిగి కోలుకొని చివరకు లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 80,630.53 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. గరిష్ఠంగా 81,245.39 పాయింట్ల వరకు పెరిగింది. చివరకు 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 10.30 పాయింట్లు పెరిగి 24,467.45 వద్ద ముగిసింది. ట్రేండింగ్‌లో దాదాపు 2,307 షేర్లు పురోగమించగా, 1,507 షేర్లు పతనమయ్యాయి. మరో 95 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఆటో, ఎఫ్‌ఎంసీసీ ఒక్కొక్కటి 0.7శాతం క్షీణించగా.. ఐటీ, మీడియా ఒక్కొక్కటి 0.5 శాతం, రియాల్టీ, పీయూఎస్‌ బ్యాంక్ రంగాల షేర్లు 2శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది.

* దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లకు చెందిన ఆఫీస్‌ స్పేస్‌ 526 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నదని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ మంగళవారం తెలిపింది. ‘రీట్స్‌: రీషేపింగ్‌ ఇండియాస్‌ కమర్షియల్‌ స్పేస్‌’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ఈ స్టాక్‌ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లుగా ప్రకటించింది. హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లో మొత్తం 884.1 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ కార్యాలయ స్థలాలున్నాయని వెస్టియన్‌ డాటా చెప్తున్నది. ఇందులో రీట్స్‌కు చెందినదే 526.3 మిలియన్‌ చదరపు అడుగులని, దీని విలువ రూ.4.5 లక్షల కోట్లు అని స్పష్టం చేసింది. దీనిలో స్టాక్‌ మార్కెట్లలో నమోదైన రీట్స్‌ల్లో మూడింటికి చెందినదే 110.7 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉందని వివరించింది.

* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం.. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, వివిధ రకాల శీతల పానీయాలు, గ్యాంబ్లింగ్‌పై 35 శాతం పన్ను వేయాలని ప్రతిపాదించింది మరి. ప్రస్తుతం ఇవన్నీ 28 శాతంలోనే ఉన్నాయి. ఇక సెస్సుతో కలిపితే పన్ను పోటు 57 శాతానికి చేరుతుండటం గమనార్హం. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల సర్దుబాట్లపై తాజాగా సమావేశమైంది. ఈ క్రమంలోనే ఆరోగ్యానికి హానికరమైన, సమాజాన్ని పెడదోవ పట్టించేవాటిపై (సిన్‌ గూడ్స్‌) పన్నులను పెంచాలన్న నిర్ణయానికి సభ్యులు వచ్చారు.

* దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7 శాతం నుంచి 10 శాతం వృద్ధితో 16.4 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. అలాగే విమానయాన సంస్థల నష్టాలు కూడా రూ.2-3 వేల కోట్ల స్థాయిలో ఉంటాయని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో విమాన ప్రయాణికులు 5.3 శాతం ఎగబాకి 7.93 కోట్లకు చేరుకున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు 16.2 శాతం చొప్పున అధికమయ్యారు.

* హైదరాబాద్‌ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. శంషాబాద్‌ ఎయిర్‌కార్గోకు ‘టైం క్రిటికల్‌ లాజిస్టిక్స్‌ సొల్యుషన్‌ ప్రొవైడర్‌ ఆఫ్‌ ది ఈయర్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్‌ అవార్డు లభించింది. చెన్నైలో జరిగిన 5వ సౌత్‌ ఈస్ట్‌ ఎయిర్‌కార్గో కాంక్లెవ్‌ అండ్‌ అవార్డు-2024లో ఈ అవార్డును కంపెనీ ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ప్రదీప్‌ పణికర్‌ మాట్లాడుతూ.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్‌ పరిష్కరాలను అందించడంలో నిబద్ధతను పాటించడం వల్లనే ఈ అవార్డులు లభిస్తున్నాయన్నారు. ఈ అవార్డు రాకతో సంస్థపై అంతర్జాతీయ కస్టమర్లకు నమ్మకం పెరిగిందని, అలాగే మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు.

* చైనా(China)లోని కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ పరిశ్రమపై అమెరికా (USA) ఆంక్షలు విధించిన కొన్ని గంటల్లోనే బీజింగ్‌ తీవ్రంగా స్పందించింది. అరుదైన మూలకాలతో తయారుచేసే వస్తువును అమెరికాకు ఎగుమతి చేయకూడదని బ్యాన్‌ విధించింది. ముఖ్యంగా సైనిక, పౌర అవసరాలకు వినియోగించే గాలియం, జెర్మేనియం, యాంటీమోనీ, సూపర్‌ హార్డ్‌ పదార్థాలకు ఈ నిషేధం వర్తించనుంది. ఇక గ్రాఫైట్‌ ఎగుమతుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతను సాకుగా చూపి.. ఆర్థిక, వాణిజ్య, టెక్‌ అంశాలను ఆయుధాల వలే వాడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్న వేళ చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త ఆంక్షల జాబితాలో ఉన్నవాటిని ఎగుమతి చేసే సంస్థలు ఇక కచ్చితంగా వాటి అంతిమ వినియోగదారు పేరును ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో అమెరికా ఆయుధ తయారీ సంస్థల్లో చైనాపై ఆధారపడిన వాటిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల అన్వేషణలో చైనా చాలా ముందుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z