* బీఆర్‌ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్టేషన్‌లో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు నేతలు పోలీసులు అడ్డుకున్నారు. అయితే, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అరెస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. కోర్టుకు పంపకుండా సమయాన్ని విచారణ పేరుతో వృథా చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేను కలువకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
* ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గచ్చిబౌలి స్టేషన్‌కు చేరుకొని బీఆర్‌ఎస్ నేతలను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని బంజారాహిల్స్ స్టేషన్‌కు వెళ్లారన్నారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్‌రెడ్డి కోరారన్నారు. సీఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదని ఆరోపించారు.
* బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలై నిమ్స్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయమై డీసీపీ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేశాం. టిక్కెట్స్ తనిఖీల కోసం ప్రేక్షకులను ఒక్కసారిగా అనుమతించారు. థియేటర్ లోపల తొక్కిసలాటతో ఊపిరాడక అవస్థలు పడ్డారు. థియేటర్‌లో రేవతి, ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. రేవతి చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారని చెప్పారు.
* ఆరు నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని.. రాష్ట్రంలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉందని.. వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయిన వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
* చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌తో సహా వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’’ అని విజయసాయి డిమాండ్ చేశారు. ‘‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?. కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
* కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్‌స్టేషన్ నుంచి కాదు.. గాంధీభవన్ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్ ఇస్తానన్నావ్ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు.పాక్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్‌దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్‌పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.
* వారం, పదిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్‌తో మహరాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలిసారి ఐదేళ్లు, రెండో సారి ఐదు రోజులు పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అనంతరం ఏక్‌నాథ్ షిండ్, ఆ తర్వాత అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేపట్టారు.
* భారత్- చైనా మధ్య దౌత్య సంబంధిత చర్చలు జరిగాయి. దిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీలో ఇరు దేశాలకు చెందిన అధికారులు సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి గస్తీ, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం అమలుపై సానుకూలంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దౌత్య చర్చల సందర్భంగా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి భేటీకి భారత్, చైనా సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది.
* సిరియాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హమాను తిరుగుబాటు దారులు హస్తగతం చేసుకున్నారు. ఈ విషయాన్ని సిరియా సైన్యం తాజాగా వెల్లడించింది. దీనిపై తాము నియంత్రణ కోల్పోయినట్లు సైన్యం తాజాగా వెల్లడించింది. ఈ నగర కేంద్రం వైపుగా తాము రానున్నట్లు తిరుగుబాటు దారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకొంది. అంతేకాకుండా, హమా జైలు నుంచి వందలాది మంది ఖైదీలను విడుదల చేశారు. కాగా.. 2011లో అధ్యక్షుడు బషర్ అల్‌అసద్‌కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమాన్ని అసద్ అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. సిరియాలో జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్‌ల అండతో అసద్.. సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించిన సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది. తాజాగా మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన భవనాలను తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z