* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.300 పెరిగి రూ.79 వేల మార్కును దాటేసి రూ.79,150 వద్ద స్థిర పడింది. బుధవారం 78,850 వద్ద ముగిసింది. రిటైలర్లు, జ్యువెల్లరీ ఆభరణాల తయారీ దారుల నుంచి గిరాకీ పెరగడంతో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. మరోవైపు కిలో వెండి ధర మూడో రోజు పెరిగింది. గురువారం కిలో వెండి ధర రూ.1,300 వృద్ధితో రూ.93,800 పలికింది. బుధవారం కిలో వెండి రూ.92,500 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం ధర రూ.160 తగ్గిపోయి రూ.76,932 వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూ.76,700-77,400 మధ్య తచ్చాడింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.188 తగ్గి రూ.93,105 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 7.20 డాలర్లు వృద్ధి చెంది, 2,669 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 0.27 శాతం తగ్గి 31.93 డాలర్లకు చేరుకున్నది.
* ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, టాబ్లెట్స్ తదితర డివైజ్‌లతో కూడిన కమ్యూనిటీ సేల్ ప్రకటించింది. ఈ నెల ఆరో తేదీన మొదలై 17వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ కమ్యూనిటీ సేల్‌లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. సాధారణ డిస్కౌంట్లతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రాయితీలు ఉన్నాయి. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మీద 12 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఆఫర్లు వర్తిస్తాయి. వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మైంత్రా వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్‌లతోపాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసిన వారికి ఆఫర్లు లభిస్తాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. గురువారం వరుసగా ఐదో సెషన్‌లో సూచీలు లాభాల్లో ముగిశాయి. త్వరలో ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. వడ్డీ రేట్లపై కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లలో ఉత్సాహం నింపినట్లయ్యింది. దానికి తోడు ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు విదేశీ మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,182.74 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,467.37 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 82,317.74 పాయింట్ల మార్క్‌ని తాకింది. చివరకు 809.53 పాయింట్లు పెరిగి.. 81,765.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240.95 పాయింట్లు పెరిగి 24,708.40 స్థిరపడింది. దాదాపు 2,050 షేర్లు పెరగ్గా.. 1758 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2శాతం పెరగ్గా.. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.
* దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి చారిత్రక కని ష్ఠ స్థాయికా జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు కోల్పోయి 84.75 వద్దకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం వల్లనే కరెన్సీలు పతనం చెందాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 84.66 వద్ద ప్రారంభమైన రుఫీ-డాలర్ రేటు 64.65-84.76 స్థాయిలో కదలాడింది.
* యూపీఐ లైట్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి రిజర్వుబ్యాంక్ శుభవార్తను అందించింది. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కి సవరించింది. ఎలాంటి పిన్ నంబర్ లేకుండానే ఆఫ్‌లైన్‌లో మొబైల్ ద్వారా లావాదేవీలు జరిపేందుకుగాను ఆర్బీఐ గతంలోనే లైట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల కోసం యూపీఐ లైట్ వ్యాలెట్‌ను నగదు ఉంచాల్సి ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z