ScienceAndTech

T-Fiber సేవలు ప్రారంభం-NewsRoundup-Dec 08 2024

T-Fiber సేవలు ప్రారంభం-NewsRoundup-Dec 08 2024

* మహారాష్ట్రలో (Maharashtra) మహాయుతి కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు దీరిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణస్వీకరణ కార్యక్రమంలో దొంగలు తమ చేతి వాటం చూపించారు. వేల సంఖ్యలో వచ్చిన ప్రజల నుంచి బంగారం, విలువైన వస్తువులు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో కలిపి దాదాపు 5 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు దొంగతనానికి పాల్పడ్డారు. 13 బంగారు గొలుసులను కాజేసినట్టు సమాచారం. మరికొందరి నుంచి రూ. 12 లక్షలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేశారు.

* తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

* భారత్‌ జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడం, వారికి కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ (ISI) కొత్త కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ మత్తులో లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తుల్లా నటిస్తూ భారత్‌లోకి చొరబడుతున్నట్లు సమాచారం

* సిరియా (Syria)లో తిరుగుబాటుదళాలు దేశ రాజధాని డమాస్కస్‌పై పట్టుబిగించాయి. దీంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad) దేశాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి.

* శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లు నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా జనవరి మాసంలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ – కొట్టాయం; కొట్టాయం – సికింద్రాబాద్‌; మౌలాలి – కొట్టాయం; కాచిగూడ – కొట్టాయం; మౌలాలి – కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు సర్వీసులందించనున్నాయి.

* బిహార్‌లో (Bihar) అనూహ్య సంఘటన చోటు చేసుకొంది. రెండు కోతుల (Monkeys) కొట్లాట కారణంగా ఏకంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌ నంబరు 4 సమీపంలో రెండు కోతులు అరటి పండు కోసం కొట్టుకున్నాయి. వాటిలో ఒక కోతి రబ్బరు లాంటి ఒక వస్తువును మరో దాని మీదికి విసిరింది. అది కాస్త వెళ్లి రైల్వే ఓవర్‌ హెడ్‌ వైర్‌కి తగిలింది. వెంటనే షాట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక తీగ తెగి ఓ రైలు బోగీపై పడింది. దీంతో రైలు నిలిచిపోయింది. చివరకు ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ వైర్‌కు మరమ్మతులు చేయడంతో రైలు బయలుదేరింది.

* సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్టు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ఈనెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

* తిరుగుబాటుదారుల విజృంభణతో సిరియా (Syria)లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ.. చివరకు డమాస్కస్‌పై పట్టుసాధించడంతో ఆ దేశం రెబల్స్‌ వశమైంది. ఈ పరిణామాల నడుమ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. గోలన్‌ హైట్స్‌లోని నిస్సైనికీకరణ జోన్‌ (బఫర్‌ జోన్‌)ను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బఫర్‌ జోన్‌ విషయంలో ఇరుదేశాల మధ్య దశాబ్దాల నాటి ఒప్పందం ప్రస్తుతం రద్దయ్యిందని, సిరియా దళాలు తమ స్థావరాలను వదులుకున్నాయని, దీంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

* కరాచీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిది ఛాంపియన్స్‌ ట్రోఫీ గురించి మాట్లాడాడు. ‘‘పాకిస్థాన్ క్రికెట్ బలంగా, స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలి. పీసీబీ బలమైన సూత్రప్రాయమైన నిర్ణయాలు తీసుకోవాలి. టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వచ్చి ఆడకపోతే మనం భారత్‌కు వెళ్లి ఎందుకు ఆడాలి? ఐసీసీ కూడా ఇప్పుడు ప్రతి సభ్య దేశం క్రికెట్ ఆడేలా బాధ్యత తీసుకోవాలో లేదా డబ్బు కావాలో నిర్ణయించుకోవాలి’ అని అఫ్రిది పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే భవిష్యత్‌లో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లను కూడా అదే మోడల్‌లో పాక్‌ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సమర్థించినట్లు సమాచారం. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో పీసీబీకి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారట.

* కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Pongulati Srinivas Reddy) అన్నారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచననూ స్వీకరిస్తామన్నారు. ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ‘‘ మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేశాం. పోర్టల్‌ నిర్వహణను ఈ నెల ఒకటో తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి మార్చాం. 2020 ఆర్‌వోఆర్‌ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్‌ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తాం. ధరణి కొత్త యాప్‌, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది’’ అని అన్నారు. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని, కానీ, రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని చెప్పారు.

* టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్‌ ద్వారా మొబైల్‌, కంప్యూటర్‌, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్‌ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్‌ వాసులతో ఆయన మాట్లాడారు. మీసేవ మొబైల్‌ యాప్‌ను శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చారు. రైతులకు రుణమాఫీ, బోనస్‌ కోసం మొబైల్‌ అప్లికేషన్‌ ప్రారంభించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.

* చంద్రబాబు సర్కార్‌ మోసాలు, డ్రామాలను ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ట్వీట్‌ చేశారు.

* ‘పుష్ప 2’ తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన ‘పుష్ప 2’.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

* లోకేష్‌ ఆధ్వర్యంలోనే వైఎస్‌ జగన్‌ ఫొటోలను మార్ఫింగ్‌‌ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సోషల్‌ మీడియాపై పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. టీడీపీ సోషల్‌ మీడియాలో నా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపోస్టులు పెట్టారని.. టీడీపీపై తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసుల ఇప్పటివరకు స్పందించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు కేసు రిజిస్టర్‌ చేయలేదని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్టుల చేయడంలో అంత్యరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన చేస్తామని అంబటి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z