Movies

అల్లు అర్జున్ హంగామా వలనే ఇదంతా జరిగింది-NewsRoundup-Dec 13 2024

అల్లు అర్జున్ హంగామా వలనే ఇదంతా జరిగింది-NewsRoundup-Dec 13 2024

* వైకాపా నేత గౌతమ్‌రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో గౌతమ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో పోలీసులు అయన నివాసంలో తనిఖీలు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆయన ఇప్పటికే పరారీలో ఉన్నారు. తమ భూమిని కబ్జా చేసి భవనాన్ని నిర్మించారని గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గతంలో గౌతమ్ రెడ్డి పై కేసు పెట్టారు. రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైకాపా నేత మరికొందరితో కలిసి తనపై కిరాయి హత్యకు ప్రణాళిక వేశారని ఆరోపిస్తూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఉమామహేశ్వరశాస్త్రి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవగా ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

* యూరోపియన్‌ దేశమైన స్విట్జర్లాండ్‌ భారత్‌కు ఇచ్చిన అనుకూల దేశ హోదాను (MFN) వెనక్కి తీసుకుంది. నెస్లే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ దేశం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. వచ్చే ఏడాది (2025) జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనివల్ల ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలపై అధిక పన్ను భారం పడనుంది. భారత్‌లోని స్విట్జర్లాండ్‌ కంపెనీలకూ ఇదే వర్తించనుంది. ద్వంద్వ పన్నులు నివారించేందుకు స్విస్‌ కాన్ఫడరేషన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా మధ్య 1994లో ఒప్పందం (DTAA) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (MFN) హోదాను ఇచ్చింది. అయితే, స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లేకు సంబంధించిన ఓ కేసు విషయంలో భారత సుప్రీంకోర్టు.. ఆదాయపు పన్ను చట్టంలో ద్వంద్వ పన్నుల అంశం ప్రస్తావన లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఎఫ్‌ఎన్‌ హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు స్విట్జర్లాండ్‌ తెలిపింది.

* అల్లు అర్జున్‌ (Allu Arjun) థియేటర్‌కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే.. ఇంత గొడవ అయ్యేది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన.. అల్లు అర్జున్‌ అరెస్టు ఘటనపై మాట్లాడారు.

* అరెస్టు సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం ఇచ్చాం. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశమిచ్చాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నాం. తానే స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నారు’’ అని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈరోజు ఉదయం అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి 2గంటల పాటు విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం.. నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా.. హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో.. దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వరా అని అల్లు అర్జున్‌ పోలీసులను ప్రశ్నించినట్టు మీడియాలో ప్రచారం జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.

* ఎర్రకోట (Red Fort)ను భారత ప్రభుత్వం తమకు అప్పగించాలని మొఘల్‌ (Mughal) వారసులు వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు (Delhi High Court) కొట్టివేసింది. ఎర్ర కోటను తమ పూర్వీకులు నిర్మించారని.. దానిని తమకు ఇచ్చేయాలని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-II (Bahadur Shah Zafar-II) ముని మనవడి భార్య సుల్తానా బేగం దిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్‌ వేశారు. గతంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తమ పూర్వీకుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎర్రకోటను తమకు అప్పగించాలని అందులో పేర్కొన్నారు. కాగా ఈ విషయమై రెండున్నరేళ్ల అనంతరం మళ్లీ కోర్టుకు వెళ్లారు.

* రాష్ట్రంలో ధాన్యం దారి మళ్లితే ఎంత మాత్రం ఉపేక్షించబోమని పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహాన్ హెచ్చరించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో అలాంటి సంఘటనలు ఉత్పన్నమైతే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతే గాకుండా పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యహరిస్తుందని స్పష్టం చేశారు.

* రఘురామకృష్ణ రాజుకు కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు తరలించారు. పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

* స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనక సీఎం చంద్రబాబు (Chandrababu) అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తెలిపారు. ప్రతిఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమేసి ప్రజావేదికలు కూల్చటం కాదని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని హితవు పలికారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ (Hydrabad).. నాడు విజన్ 2020 ఆలోచనల నుంచి పుట్టిందేనని పయ్యావుల గుర్తుచేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఏపీని మళ్లీ నంబర్‌వన్‌గా నిలబెట్టేందుకే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.

* తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కారు గెజిట్‌ ఇవ్వడం దారుణమని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని.. జీవో ఇస్తేనే అవి పెడతామా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలను భారాస (BRS) హయాంలో ఏర్పాటు చేశామన్నారు.

* చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత ఆటగాడు డి గుకేశ్‌పై (D Gukesh) సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డిగ్ లిరెన్‌పై గుకేశ్ అద్భుత విజయం సాధించడంపై స్టాలిన్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల ప్రైజ్‌మనీని అందిస్తున్నట్లు వెల్లడించారు.

* నర్సులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక దాబా వద్ద ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. మొబైల్‌ ఫోన్లు, పుస్తకాలు చూసి కాపీ కొట్టారు. (Nursing Students Exam) నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈ మోసాన్ని బయటపెట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సు చేస్తున్న కొందరు విద్యార్థులు గ్వాలియర్-మోరెనా హైవేలోని దాబా వద్ద ప్రాక్టికల్ పరీక్షలు రాశారు. మొబైల్‌ ఫోన్లు, పుస్తకాల ద్వారా కాపీ కొట్టి చీటింగ్‌కు పాల్పడ్డారు. కాగా, నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర సింగ్ గుర్జార్ కారులో మొరెనా నుంచి గ్వాలియర్‌కు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఈటరీ వద్ద నర్సింగ్‌ విద్యార్థులు పరీక్షలు రాయడాన్ని ఆయన గమనించారు. ఆ స్టూడెంట్స్ వద్దకు వెళ్లి దీని గురించి నిలదీశారు. మీ నర్సింగ్‌ కాలేజీలో సీట్లు లేవా? పరీక్షలు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనిని వీడియో తీశారు.

* రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ (Darshan) అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని అరెస్ట్‌ చేయగా.. వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్శన్‌కు భారీ ఉపశమనం లభించింది. కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్‌ బెయిల్ మంజూర్‌ చేసింది. ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర గౌడ సహా ఆరుగురికి బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబర్‌ 30న వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్‌కు హైకోర్టు ఆరు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రస్తుతం దర్శన్‌ బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే తాజాగా రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్టైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z