Business

ఎలాంటి తాకట్టు లేకుండా ₹2లక్షల వరకు రైతు రుణాలు-BusinessNews-Dec 14 2024

ఎలాంటి తాకట్టు లేకుండా ₹2లక్షల వరకు రైతు రుణాలు-BusinessNews-Dec 14 2024

* యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI), ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు రూ.223 లక్షల కోట్ల విలువ గల 15,547 కోట్ల లావాదేవీలను పూర్తిచేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ రోజు(శనివారం) వెల్లడించింది. భారత్‌కు సంబంధించిన డిజిటల్‌ చెల్లింపుల విప్లవం ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం యూపీఐ..యూఏఈ, సింగపూర్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, ఫ్రాన్స్‌, మారిషస్‌ వంటి కీలక మార్కెట్లలో పనిచేస్తోంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) ద్వారా 2016లో ప్రారంభమయిన యూపీఐ, ఒక మొబైల్‌ అప్లికేషన్‌తో బహుళ బ్యాంకు ఖాతాలను ఏకీకృతం చేయడం ద్వారా దేశానికి సంబంధించిన చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ సిస్టం ద్వారా ఇబ్బందులు లేకుండా నిధుల బదిలీ, వ్యాపారులకు చెల్లింపులు, పీర్‌-టు-పీర్‌ లావాదేవీలను అనుమతిస్తుంది.

* వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది. పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉంది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరుచేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు. అలాంటివారికి అండగా ఉండేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ సదుపాయం కల్పిస్తోంది.

* భారత్‌లో కార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India – SAVWIPL) త్వరలో భారత్ మార్కెట్లోకి ఎస్‌యూవీ కైలాక్ (Kylaq) తీసుకు రానున్నది. ఇందుకోసం మహారాష్ట్రలోని పుణెలోని చకాన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో కైలాక్ (Kylaq) కార్ల తయారీ ప్రారంభించింది. మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza), టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet), మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV300) కార్లకు కైలాక్ (Kylaq) గట్టి పోటీ ఇవ్వనున్నది.

* రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్‌ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్‌లోని మెడ్‌ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్‌ఆర్‌ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్‌ మేనేజ్‌మెంట్‌ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఈమె రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z