Fashion

విషమంగా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం-NewsRoundup-Dec 15 2024

విషమంగా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం-NewsRoundup-Dec 15 2024

* జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై నటుడు మోహన్‌బాబు (Mohan Babu) మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు.

* యువత కళాశాలల్లోనే సాంకేతిక కోర్సులు నేర్చుకునేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఒక విజన్‌తో ‘ఏఐ స్కిల్లింగ్‌ ఏపీ’ని అమల్లోకి తెస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నంబూరులోని వీవీఐటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ ఆఫ్‌ గూగుల్‌ సర్టిఫికేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూగుల్‌ ‘ఏఐ స్కిల్లింగ్‌ ఏపీ’ పైలెట్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి కంపెనీలను అమరావతికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

* తన వివాహానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు (PV Sindhu) ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుకు, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ నెల 22న వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అత్యంత సన్నిహితుల సమక్షంలో కాబోయే ఈ దంపతులు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

* కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు 20 మంది కలిసి కత్తులు, కర్రలతో ప్రత్యర్థి కుటుంబంపై దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఎస్సీపేట చెరువు వద్ద కరాదాల పండు ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబీకులు ప్రయత్నించారు. ఇంటి స్థలం విషయంలో కరాదాల, బచ్చల కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తులతో దాడి చేసుకోవడంతో కరాదాల ప్రకాశ్‌రావు(50)అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రరావు(60), ఏసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర గాయాలైన బచ్చల చిన్నసుబ్బారావు, కరాదాల పండు, బాబీలు చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో కత్తులు, కర్రలు స్వాధీనం చేసుకున్న సామర్లకోట పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పరిశీలించారు.

* భారత మహిళల క్రికెట్‌ జట్టు మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (54; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తూ హాఫ్‌ సెంచరీ సాధించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (73; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌) కూడా మెరుపులు మెరిపించింది. ఉమా ఛెత్రి (24), రిచా ఘోష్‌ (20; 14 బంతుల్లో), హర్మన్‌ప్రీత్‌ కౌర్ (13*) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో కరిష్మా 2, డియాండ్రా డాటిన్ ఒక వికెట్ పడగొట్టారు.

* ‘ఉప్పెన’లో హీరోయిన్‌ తండ్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). దాంతో, ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు.. విజయ్‌కు మరో అవకాశం ఇచ్చారని కొన్ని నెలల కిత్రం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిస్తున్న #RC 16 (వర్కింగ్‌ టైటిల్‌)లో సేతుపతి కీ రోల్‌ చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. తాజాగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను రామ్‌ చరణ్‌ మూవీలో నటించట్లేదని స్పష్టం చేశారు విజయ్‌ సేతుపతి. ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదని తెలిపారు.

* మన కవులు, రచయితల గొప్పతనాన్ని తెలియజేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి గొప్ప కవులు, రచయితల స్వస్థలాలు, వారి జ్ఞాపకాలను కాపాడటం ద్వారా వారి సాహిత్య సేవలు తెలిపేలా స్మారక కేంద్రాల ఏర్పాటుతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను విజయవాడ బుక్ ఫెయిర్‌ కమిటీ ప్రతినిధులు కలిశారు. 35 ఏళ్ల నుంచి విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

* మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన పది రోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ వీరితో ప్రమాణం చేయించారు.

* నక్సలైట్లు ఆయుధాలు వీడి.. లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో జరిగిన ‘బస్తర్‌ ఒలింపిక్స్‌’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘లొంగిపోవాలనుకొనే నక్సలైట్లను మేం స్వాగతిస్తున్నాం. ఆయుధాలు వీడండి. లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరండి. మీ పునరావాసం బాధ్యత మాది’’ అని అన్నారు.

* తెలంగాణ శాసనసభలో పర్యాటక విధానంపై సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈనెల 9న మొదలైన సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సోమవారం నుంచి సమావేశాలు తిరిగి కొనసాగనున్నాయి. సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగించాలన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

* మంచు కుటుంబంలో వివాదం (Manchu Family Issues) ముగియలేదు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మనోజ్‌ (Manchu Manoj) తాజా స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం. శనివారం తన ఫ్యామిలీలో చోటుచేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు (Manchu Vishnu).. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.

* మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake) భారత్‌ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం దిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ స్వాగతం పలికారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయనకు సాదర స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

* ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ (73) అస్వస్థతకు గురయ్యారు. అమెరికాలో ఉన్న ఆయన శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు హుస్సేన్‌ సన్నిహితులు వెల్లడించారు. ‘‘గత వారం రోజులుగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్పించాం. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై మేమందరం తీవ్ర ఆందోళనతో ఉన్నాం’’ అని జాకీర్‌ హుస్సేన్‌ స్నేహితుడు, ఫ్లూటిస్ట్‌ రాకేశ్‌ చౌరాసియా పేర్కొన్నారు. జాకీర్‌కు రక్తపోటు సమస్య ఉన్నట్లు సమాచారం.

* విజన్‌-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని.. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘1998లో కూడా చంద్రబాబు విజన్‌-2020 పేరిట డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రచరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్‌ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీక‌ర‌ణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ..ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో విజన్‌ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్‌ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్‌-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్‌-2029 డాక్యుమెంట్‌ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది’’ అని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

* టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు బ్రిస్బేన్‌లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్‌ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్‌ పింక్‌బాల్‌ టెస్టులో ట్రవిస్‌ హెడ్‌కు సిరాజ్‌ సెండాఫ్‌ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు. ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్‌ను కించపరిచేలా ఆసీస్‌ ఫ్యాన్స్‌ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్‌స్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

* ప్రధాని మోదీ నిన్న(శనివారం) లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెహ్రూ పేరును ప్రధాని మోదీ వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉండేదన్న జైరాం.. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. 2014కు ముందు కాంగ్రెస్‌ పాలనలో భారత్‌ సాధించిన విజయాలను మోదీ గుర్తుచేసుకోవాలంటూ జైరాం హితవు పలికారు. కాగా, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ లోక్‌సభ సాక్షిగా నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్‌ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z