సుభాష్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం అత్తింటి వారు కొత్త ఆరోపణలు చేశారు. కట్నం తీసుకురావాలని సుభాష్ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని నిఖిత ఆరోపించింది. తన కోడలు, ఆమె తల్లి, సోదరుడు అరెస్టయినా, మనవడు ఎక్కడ ఉన్నాడో ఇప్పటి వరకు వివరాలు తెలియలేదని అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ మోదీ తెలిపారు. తన మనవడిని ఎక్కడ దాచారో ముందుగా పోలీసులు తెలుసుకుని, అతన్ని రక్షించాలని కోరారు. నిఖిత, నిశ, అనురాగ్‌లను అరెస్టు చేసిన మారతహళ్లి ఠాణా పోలీసులను ఆయన అభినందించారు. కేసులు లేకుండా చేసేందుకు తన కుమారుడిని లంచం అడిగిన న్యాయమూర్తిని కూడా పోలీసులు విచారణ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. బెంగళూరుకు తీసుకువచ్చిన నిఖిత, ఆమె కుటుంబ సభ్యులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల పాటు న్యాయనిర్బంధానికి పంపిస్తూ ఆదేశించారు. వారిని అదుపునకు తీసుకుని, అతుల్ కుమారుడి వివరాలను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ తెలిపారు.
భర్త తన చెప్పుచేతల్లో ఉండాలని వేధిస్తున్న ఆధునిక మహిళల సంఖ్య ఎక్కువ అవుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉన్నత న్యాయస్థానం ముందుకు వస్తున్న 498ఏ కేసుల్లోనూ ఎక్కువ శాతం తప్పుడు కేసులు ఉంటున్నాయని గుర్తించింది. తప్పుడు కేసులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ప్రతిసారీ పోలీసులకు సూచనలు చేస్తూనే వస్తోంది. చట్టంలో సవరణలు చేయాలని గత ఒకటిన్నర దశాబ్దంగా భార్యాబాధితుల సంఘం సభ్యులు పోరాటం చేస్తూనే వస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఆ చట్టానికి సవరణ చేయాలని చేస్తున్న డిమాండ్లన్నీ నీటిమీద రాతల్లా మారిపోతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z