Health

కేరళను వణికిస్తున్న మంకీపాక్స్ కేసులు-NewsRoundup-Dec 18 2024

కేరళను వణికిస్తున్న మంకీపాక్స్ కేసులు-NewsRoundup-Dec 18 2024

* ప్రాణాంతక మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత నిర్ధరణ కాగా.. తాజాగా కన్నూర్‌ జిల్లా వాసికి వైరస్‌ (Monkeypox) సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని ఎంపాక్స్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

* ఎయిర్‌ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ రూట్‌ నెట్‌వర్క్‌లోని విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు, అదనపు ప్రయోజనాలను బుధవారం ప్రారంభించింది. విద్యార్థులకు బేస్‌ ఛార్జీలపై 10% వరకు తగ్గింపు ఇవ్వడమే కాకుండా, అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతినిస్తుంది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ తగ్గింపుతోపాటు ఒకసారి ప్రయాణ తేదీని ఉచితంగా మార్పు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రత్యేక ఛార్జీలు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌ క్యాబిన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. భారత్‌లోని 49 నగరాలకు, విదేశాల్లో 42 గమ్యస్థానాలకు ఎయిర్‌ ఇండియా సర్వీసులను నిర్వహిస్తోంది. యూఎస్‌, కెనడా, యూకే, ఆస్ట్రేలియాతో సహా మరికొన్ని గమ్యస్థానాల్లో దేని మధ్యనైనా ప్రయాణించే విద్యార్థులు ఈ సౌకర్యాలు పొందొచ్చు.

* ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఫణికుమార్ మృతి చెందారు. కెనడాలో ఎంఎస్‌ చేస్తున్న ఫణికుమార్.. తన గదిలో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులకు రూమ్‌ మేట్స్‌ సమాచారం ఇచ్చారు. ఫణికుమార్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా సాయం చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ను కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఫణికుమార్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

* విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యాలయాలను బాగు చేయాలని భారాస అధినేత కేసీఆర్‌కు మొదట్లో ఉండేదని.. ఆ తరువాత ఆయన అంచనాలు మారిపోయాయన్నారు. విద్యాలయాలు, వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాల చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.

* కేంద్ర మోటార్ వాహనాల సవరణ చట్ట నిబంధనలను సరిగా అమలు చేయట్లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం(డిసెంబర్‌ 18) విచారణ జరిగింది. చట్ట నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిబంధనలు ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎక్కడికక్కడే వాహనాలను ఆపి జరిమానా విధించండి. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. 99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారు. జరిమానా కట్టకుంటే వాహనాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు. వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించింది. విపరీతమైన వేగం,హారన్లతో నరకం చూపిస్తున్నారు. హైబీమ్ తో ఎంతోమంది చనిపోతున్నారు. హైబీమ్ వాడినందుకు జరిమానా ఎందుకు కట్టరు. చట్ట నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే.ఇందుకు ఏం చేస్తున్నారో చెప్పండి. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి’ అని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు నిబంధనలు అమలు చేసి ఉంటే ఈ నాలుగు నెలల్లో మృతి చెందిన 677 మందిలో కొందరైనా బతికి ఉండే వాళ్లని హైకోర్టు వ్యాఖ్యానించింది.తదుపరి విచారణ జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

* వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్‌ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్‌ఎన్‌ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు జనరల్‌ డైరెక్టర్‌ అయిన అండ్రే కప్రిన్‌ ప్రకటించారు. చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్‌) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

* అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్‌ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.

* కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను నాంప‌ల్లి స్పెష‌ల్ కోర్టు మంజూరు చేసింది. న‌రేంద‌ర్ రెడ్డి స‌హా 24 మంది రైతుల‌కు బెయిల్ ల‌భించింది. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి రూ. 50 వేల పూచీక‌త్తుపై, మిగ‌తా వారికి రూ. 20 వేల పూచీక‌త్తుపై బెయిల్ ఇచ్చింది కోర్టు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z