Food

బెంగుళూరులో కొత్త ట్రెండ్…ఉల్లిపాయ టిప్పు-NewsRoundup-Dec 26 2024

బెంగుళూరులో  కొత్త ట్రెండ్…ఉల్లిపాయ టిప్పు-NewsRoundup-Dec 26 2024

* హర్షల్‌ కుమార్‌ క్షీరసాగర్‌ (Harshal Kumar Kshirsagar,) అనే 23 ఏళ్ల యువకుడు ఛత్రపతి శంభాజినగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. నకిలీ ఈ మెయిల్‌ ఖాతాను తెరిచి.. సంస్థ బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బును కాజేశాడు. జులై 1 నుంచి డిసెంబరు 7 మధ్య కాలంలో సుమారు రూ. 21.6 కోట్ల నగదును మొత్తం 13 బ్యాంక్‌ అకౌంట్లకు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతాను హ్యాక్‌ చేసేందుకు హర్షల్‌ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాడు. బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేసిన ఈ మెయిల్‌ అడ్రస్‌ను పోలి ఉండేలా.. కేవలం ఒకేఒక్క అక్షరం తేడాతో కొత్త ఈ మెయిల్‌ను క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత మెయిల్‌ అడ్రస్‌లో చిన్న పొరపాటు ఉందని, అప్‌డేట్‌ చేయాలని కోరుతూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పాత లెటర్‌ హెడ్‌పై బ్యాంక్‌కు లేఖ రాశాడు. దీంతో అతడు కొత్తగా క్రియేట్‌ చేసిన ఈ మెయిల్‌ బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయింది. తనకు అవసరమైన ఓటీపీలు, లావాదేవీలకు సంబంధించిన ఇతర సమాచారం ఆ ఈ మెయిల్‌ ద్వారా తెలుసుకునేవాడు. ఆ తర్వాత స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌తో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను యాక్టివేట్‌ చేసి.. రూ.కోట్ల మొత్తాన్ని ఇతర అకౌంట్లకు బదిలీ చేశాడు. అలా మొత్తం 13 ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుతో హర్షల్ రూ.1.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్ల విలువ చేసే మరో ఎస్‌యూవీ, రూ. 32 లక్షలతో బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశాడు. తన ప్రేయసికి ఛత్రపతి శంభాజీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె కోసం వజ్రాలు పొదిగిన కళ్లజోడును కూడా ఆర్డర్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన సహోద్యోగి యశోద శెట్టితోపాటు ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

* ఈవీఎంల(EVMs) వ్యవహారంపై ఎన్సీపీ(ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా ఈవీఎంలను నిందించలేమన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. ఇందులో వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి పరాజయం పాలైన తమ పార్టీ అభ్యర్థి యోగేంద్ర పవార్‌ రీకౌంటింగ్‌ కోరడం సరికాదని సుప్రియ అభిప్రాయపడ్డారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించగా.. అతడు వెనక్కి తీసుకున్నాడని మీడియాకు వెల్లడించారు.

* తమిళనాడు (TamilNadu) రాజధాని చెన్నైలోని (Chennai) అన్నాయూనివర్సిటీలో (Anna University) ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పిపోయాయని, దీనికి అధికార డీఎంకే ప్రభుత్వమే (DMK Govt) కారణమని భాజపా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై భీష్మ ప్రతిజ్ఞ చేశారు. డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతినబూనారు. గురువారం కోయంబత్తూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘ డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను. చెప్పులు లేకుండానే నడుస్తా. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎప్పటిలాగే డబ్బులు ఎరగా చూపం. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి… మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని అన్నారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానన్నారు.

* నర్సీపట్నం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించేందుకు పనిచేసిన వైకాపా నేతలను భాజపాలో చేర్చుకోవడం సరైన నిర్ణయం కాదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. నర్సీపట్నం నేతలకు భాజపా కండువా కప్పి పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో పురంధేశ్వరికి వ్యతిరేకంగా పనిచేసిన నేతలను.. ఆమెకు తెలియకుండా పార్టీలోకి తాము ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కూటమిలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో పరస్పర గౌరవం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం మంచిదన్నారు.

* కండిషనల్‌ బెయిల్‌పై ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, భారాస నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టడంపై ఐజీ సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడారు. విచారణను ప్రభావితం చేసే విధంగా నరేందర్‌ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం సరైంది కాదన్నారు. అ విషయంలో బెయిల్‌ రద్దు చేయాలని కోర్టును కోరతామని ఐజీ చెప్పారు.

* అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని సికింద్రాబాద్‌, తిరుమలగిరి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, బాచుపల్లి, తార్నాక, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షానికి జనం తడిసి ముద్దయ్యారు. వర్షానికి తోడు చలి తీవ్రత కూడా పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

* ప్రతిపక్ష ఇండియా కూటమిలో (INDIA bloc) విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ (Congress)‌, ఆప్‌ (AAP) మధ్య వైరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్‌ ఆరోపణలతో ఈ వైరం మరింత ముదురుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హస్తం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బయటకు పంపించేందుకు ఆప్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కూటమి నుంచి కాంగ్రెస్‌ను బయటకు పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆప్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

* ట్రాఫిక్ చ‌లాన్ల‌పై రాయితీ వార్త‌ల‌ను ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చ‌లాన్ల‌పై ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్ర‌క‌టించార‌ని సోష‌ల్ మీడియా వ‌స్తున్న వార్త‌ల‌పై ట్రాఫిక్ అద‌న‌పు సీపీ విశ్వ‌ప్ర‌సాద్ స్పందించారు. పెండింగ్ ట్రాఫిక్ చ‌లాన్ల‌పై ఎలాంటి రాయితీ ప్ర‌క‌టించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్ద‌ని వాహ‌న‌దారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. echallan.tspolice.gov.in అనే వెబ్‌సైట్‌లోని స‌మాచారాన్ని మాత్ర‌మే న‌మ్మాల‌ని ఆయ‌న సూచించారు. పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో భారీ డిస్కౌంట్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల పాటు కొన‌సాగిన ఈ ఆఫ‌ర్ ద్వారా ప్ర‌భుత్వానికి భారీగానే ఆదాయం స‌మ‌కూరింది.

* నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.

* గ్రూప్-1 ప‌రీక్ష‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు నిర్ణ‌యంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. హైకోర్టు నిర్ణ‌యంతో నిరాశ చెందొద్ద‌ని గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. జీవో 29పై దాఖ‌లైన పిటిష‌న్‌ను కొట్టేయ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం అని చెప్పారు. జీవో 29కు వ్య‌తిరేకంగా గ్రూప్-1 అభ్య‌ర్థులు కొట్లాడ‌డం స‌మ‌ర్థ‌నీయ‌మ‌ని అన్నారు. సామాజిక న్యాయం కోసం ప్ర‌భుత్వాలు పాటుప‌డాలి.. అది ప్ర‌భుత్వం బాధ్య‌త అని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం సాధించడానికి అదొక్కటే ప్రధాన సాధనం అని చెప్పారు. హైకోర్టు నిర్ణ‌యంతో ఇది ఇక్క‌డే ఆగిపోతోంద‌ని నేను అనుకోను. గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు బీఆర్ఎస్ పార్టీ ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌న్నారు. మీ కోసం పోరాడుతూనే ఉంటామ‌ని ఏనుగుల రాకేశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

* తాజాగా జరిపిన సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనం తెలిపింది. కుటుంబ బాధ్యతలు జాబ్ కు సంబంధించిన సవాళ్ల మధ్య పురుషులు అధిక ఒత్తిడి ఎదుర్కొంటారని అందరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో మాత్రం మహిళలే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని ఎమోషనల్ వెల్నెస్ పేరుతో చేసిన ఒక సర్వేలో వెళ్లడైంది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో మహిళలు మగవారి కంటే ఎక్కువగా స్ట్రెస్ ని ఎదుర్కొంటారని ఆ సర్వే చేసిన నిపుణులు తెలిపారు. వ్యక్తిగతంగా జాబ్ పరంగా మహిళలు పురుషులు ఎలాంటి మెంటల్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి దాదాపు 5000 మందిని నిపుణులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీరు దాదాపు 72.2శాతం మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించారు. పురుషులలో 53 పాయింట్ 64శాతం ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారని రిపోర్ట్ లో తేలింది. అయితే ఈ ఒత్తిడికి కారణాలను విశ్లేషిస్తే ఉద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులను పోల్చినప్పుడు పురుషులు కేవలం ఉద్యోగపరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పనులు కుటుంబ బాధ్యతల విషయంలో తక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ, మహిళలు మాత్రం ఓవైపు ఇంటి పనులు కుటుంబ బాధ్యతల తో పాటు వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

* ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులు ఆర్డర్‌ చేస్తే.. తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌ (Delivery Boy)కి కొందరు టిప్‌గా ఎంతో కొంత ఇస్తుంటారు. కానీ, బెంగళూరు (Bengaluru)లోని ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఇంటి సరకులు తీసుకొచ్చిన వ్యక్తి.. టిప్‌ అడగకుండా.. ‘ సార్‌ ఒక్క ఉల్లిపాయ ఇస్తారా?’ (Onion) అని అడిగాడట. దీంతో ఆశ్చర్యపోవడం ఆ యజమాని వంతైంది. తనకు ఎదురైన అనుభవాన్ని అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌ అయ్యింది. బెంగళూరులో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటికి కావాల్సిన సరకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. వాటిని తీసుకొచ్చిన బాయ్‌..టిప్‌కి బదులు ఓ ఉల్లిపాయ అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన యజమాని.. ఉల్లిపాయ ఎందుకు? మంత్రతంత్రాలేమైనా చేస్తావా? అని అడిగాడు. అతడు అమాయకంగా ఓ నవ్వు నవ్వేసి.. అలా ఏం లేదు సార్‌ అని బదులిచ్చాడు. ఉల్లిపాయను అతడికి ఇచ్చేసిన యజమాని.. ఇదే విషయాన్ని ఆయన భార్యదగ్గర చెప్పాడట. అయితే, ఉల్లిధరలు అమాంతం పెరిగిపోతుండటంతో ఇలా ఒక్కో ఉల్లిపాయను కూడబెట్టి ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నాడేమో అని ఆమె బదులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అతడు రెడిట్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z