Business

భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడవచ్చు-BusinessNews-Jan 11 2025

భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడవచ్చు-BusinessNews-Jan 11 2025

* ఈఎంఐ (నెలవారీ వాయిదా సమాన చెల్లింపులు) ఆధారిత వ్యక్తిగత రుణాల్లో ఫిక్స్‌డ్‌ వడ్డీరేటు ప్రోడక్ట్‌ను కూడా కస్టమర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని శుక్రవారం బ్యాంకులకు, తమ పరిధిలోని ఇతర ఆర్థిక సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. రుణాల మంజూరు సమయంలో వర్తించే వార్షిక వడ్డీరేటు, వార్షిక పర్సంటేజ్‌ రేట్ల సమాచారం రుణగ్రహీతలకు తెలియపర్చాలని, రుణ ఒప్పందంలో పేర్కొనాలని కూడా స్పష్టం చేసింది. అప్పు తీసుకున్న తర్వాత ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటు కారణంగా ఈఎంఐ లేదా టెన్యూర్‌లో ఏదైనా పెరుగుదల ఉన్నా ఆ సమాచారాన్ని రుణగ్రహీతకు చెప్పాలన్నది. అసలు, వడ్డీ బకాయిలు, మిగిలిన ఈఎంఐల వివరాలనూ మూడు నెలలకోసారి అందజేయాలని ఆర్బీఐ రుణదాతలకు సూచించింది.

* దలాల్‌ స్ట్రీట్‌లో వచ్చే వారం కూడా ఐపీఓల సందడి నెలకొంది. మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు మెయిన్‌ బోర్డ్‌ నుంచి లక్ష్మి డెంటల్‌ లిమిటెడ్, ఎస్‌ఎంఈ విభాగం నుంచి కాబ్రా జ్యువెల్స్, ఈఎంఏ పార్ట్‌నర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మరో 8 కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

* ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58గా ఉండగా.. దాన్ని 60కు పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్పు భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని తెలుస్తోంది.

* ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ (Tim Cook) సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) వార్షిక వేతనాన్ని 18శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు 74.6 మిలియన్‌ డాలర్ల వేతనం ప్రకటించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు యాపిల్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో కుక్ జీతంతో సహా పలు ప్రతిపాదనల్ని వాటాదారుల ముందుంచనుంది. అక్కడ వాటాదారులకు ఓటింగ్‌ నిర్వహించి పెంపును అమలుచేయనున్నారు.

* 2025లో భారత్‌ ఆర్థికవ్యవస్థ కొంచెం బలహీనమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎండీ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా అనుసరించే వాణిజ్య విధానం ఆధారంగా కొంత అనిశ్చితి ఉంటుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఆర్థిక వృద్ధిపై మాట్లాడారు. స్థిరమైన ప్రపంచ వృద్ధి ఉన్నప్పటికీ భారత్‌ ఆర్థికవ్యవస్థ కొద్దిగా బలహీనపడే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు క్రిస్టాలినా జార్జివా అన్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్ని ఆమె వెల్లడించలేదు. ‘‘ఆర్థికవృద్ధిలో మేం ఊహించిన దానికంటే అమెరికా కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ (EU) ప్రస్తుతం ఉన్న స్థాయికే పరిమితం కావచ్చు. భారత్‌ కొంచెం బలహీనపడొచ్చు. బ్రెజిల్‌ కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనాలో ద్రవ్యోల్బణం ఒత్తిడి, దేశీయ డిమాండ్‌.. తదితర సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది’’ అని జార్జివా అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z