Business

నగదుతో లోన్ చెల్లిస్తే 100శాతం పెనాల్టీ-BusinessNews-Jan 12 2025

నగదుతో లోన్ చెల్లిస్తే 100శాతం పెనాల్టీ-BusinessNews-Jan 12 2025

* ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్‌లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది. 2020 – 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ‘నిర్మలా సీతారామన్’ (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2023-24 బడ్జెట్‌లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్‌లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.

* దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్‌ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

* భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చరిత్రను సృష్టించేందుకు రెడీ అయ్యింది. స్పాడెక్స్‌ మిషన్‌లో భాగంగా తొలిసారిగా స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌ను నిర్వహించనున్నది. ఇందుకోసం నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను ఆదివారం మూడు మీటర్ల దగ్గరా తీసుకువచ్చింది. ఛేజర్‌, టార్గెట్‌ ఉపగ్రహాలు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాయని.. డాకింగ్‌ ప్రక్రియ కోసం రెండు ఉపగ్రహాలను దగ్గరగా తీసుకువచ్చినట్లు ఇస్రో పేర్కొంది. ఈ రెండు ఉపగ్రహాలు ఫొటోలు, వీడియోలను రికార్డ్‌ చేసి పంపాయి. రెండు శాటిలైట్స్‌ను మొదట 15 మీటర్లకు.. ఆ తర్వాత మూడు మీటర్లకు తీసుకువచ్చింది. డేటాను మరింత విశ్లేషించిన తర్వాత డాకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం డాకింగ్‌కు కేవలం 50 అడుగులు దూరంలో ఉన్నామని ఇస్రో పేర్కొంది. చిన్న అంతరిక్ష నౌకను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్‌ ప్రక్రియను ప్రదర్శించడం డాకింగ్‌ ఉద్దేశం. అయితే, జనవరి 7, 9 తేదీల్లో డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్ (స్పాడెక్స్) వాయిదాపడింది.

* గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లలో టాప్‌-10 సంస్థల్లో టాప్‌-5 సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.85 లక్షల కోట్లు కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టపోయింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బలహీన ధోరణులు నెలకొనడంతో బీఎస్‌ఈ-లిస్టెడ్‌ కంపెనీల్లోని టాప్‌-10 సంస్థలకు ఐదు సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,85,952.31 కోట్లు కోల్పోయింది. గతవారం బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 1844.2 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ-50 573.25 పాయింట్లు పుంజుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్స్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్‌ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కోల్పోయాయి. మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), భారతీ ఎయిర్‌ టెల్‌, ఇన్ఫోసిస్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌)తోపాటు తాజాగా టాప్‌-10లో చేరిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభాలతో ముగిశాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.70,479.23 కోట్లు నష్టపోయి రూ.12,67,440.61 కోట్లకు చేరుకున్నది. కోల్‌కతా కేంద్ద్రంగా పని చేస్తున్న ఐటీసీ సంస్థ ఎం- క్యాప్‌ రూ.46,481 కోట్లు కోల్పోయి రూ.5,56,583.44 కోట్లకు చేరుకున్నది. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ. 44,935.46 కోట్లు నష్టంతో రూ.6,63,233.14 కోట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు, రిలయన్స్‌ ఎం-క్యాప్‌ రూ.12,179.13 కోట్లు పతనంతో రూ.16,81,194.35 కో్ట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.11,877.49 కోట్లు పతనమై రూ.8,81,501.01 కోట్లకు పరిమితమైంది.

* దేశంలో ఇప్పటికీ డిజిటల్ లావాదేవీల (Digital transactions) కంటే నగదు లావాదేవీలే (Cash transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి ఆదాయపన్ను శాఖ (Income tax department) కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. కొన్ని రకాల నగదు లావాదేవీలపై ఏకంగా 100 శాతం వరకు పెనాల్టీ విధించనున్నట్లు తెలిపింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 269ST సహా మరికొన్ని సెక్షన్ల కింద పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే నోటీసులతో పాటు పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఇప్పుడు 2025-26 సంవత్సరానికి సంబంధించి జూలై 31లోగా ఆదాయపుపన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 100 శాతం వరకు పెనాల్టీ పడే అవకాశం ఉన్న నగదు లావాదేవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. లోన్‌లు, డిపాజిట్‌లు, అడ్వాన్స్‌లు ఇవ్వడం లాంటి వాటి కోసం రూ.20 వేల కంటే ఎక్కువ నగదును ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ఒకవేళ అలాచేస్తే సెక్షన్ 269SS కింద అంతే మొత్తం పెనాల్టీ పడుతుంది.

2. బ్యాంకు నుంచి ఒకే రోజు రూ.2 లక్షలకు మించి నగదును తీసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 269ST ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదును తీసుకుంటే అంతే మొత్తంలో జరిమానా పడే ఛాన్స్‌ ఉంది.

3. లోన్లు, డిపాజిట్ల కింద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేటప్పుడు రూ.20 వేల వరకే నగదు రూపంలో చెల్లించవచ్చు. అంతకు మించి చేస్తే సెక్షన్ 269T ప్రకారం 100 శాతం పెనాల్టీ పడుతుంది.

4. వ్యాపారానికి సంబంధించిన నగదు లావాదేవీలను రూ.10 వేలకు మించి చేయకూడదు. రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు చేస్తే సెక్షన్ 40A(3) ప్రకారం పెనాల్టీ పడే ఛాన్స్‌ ఉంది.

5. ఐటీ యాక్ట్​, సెక్షన్ 80G ప్రకారం రూ.2 వేలకు మించి నగదు రూపంలో విరాళాలను తీసుకోకూడదు. అలాచేస్తే ఐటీ రిటర్న్స్​ క్లెయిమ్ చేసుకోలేరు. పైగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z