* బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దుండగుడి దాడి ఘటనతో ముంబయి నగరం మరోసారి ఉలిక్కిపడింది. గతంలో ప్రముఖులపై మాఫియా గ్యాంగ్‌లు దాడులకు పాల్పడిన ఘటనలను గుర్తుచేసింది. అయితే, సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ పేర్కొన్నారు. దీనిలో క్రిమినల్ గ్యాంగ్‌ల (Underworld) ప్రమేయాన్ని తోసిపుచ్చారు.
* తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందన్నారు. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ టీమ్‌ను కంపెనీల్లో వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డి.. ఆరుగురితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంది. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నది. వీరు కబ్జాలతో పాటు, భూ దందాలను చేస్తున్నారు. వీరి వసూళ్లను, బ్లాక్‌మెయిల్‌ని, భూ దందాలను పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
* విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ (Visaka Steel) పరిరక్షణకు కేంద్రం రూ. 11,440 కోట్లతో ప్యాకేజీని ప్రకటించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కేంద్రానికి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్యాకేజీ (Central Package) చరితాత్మక నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అధికారికంగా ప్రకటనను విడుదల చేయడం పట్ల కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాటకు ప్యాకేజీ దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
* దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల హామీలకు సంబంధించిన ‘సంకల్ప్ పత్రాన్ని’ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని తెలిపారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ స్కీమ్‌ను ఆమోదిస్తామని చెప్పారు. అలాగే గర్భిణీలకు రూ.21,000 అందుతుందని అన్నారు.
* అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) దంపతులు విడాకులు తీసుకోనున్నారని వస్తున్న వార్తలపై మిషెల్ (Michelle Obama) టీమ్ స్పందించింది. వారి వైవాహిక జీవితంపై నిరాధార వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారని తెలిపింది. అయితే ట్రంప్ వ్యవహార శైలి, గతంలో ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసే విమర్శలు.. మిషెల్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అందువల్లే ఆ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉంటున్నారని టీమ్ వెల్లడించింది. ట్రంప్ వ్యాఖ్యలను మిషెల్ తీవ్రంగా పరిగణించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయనను తాను ఎప్పటికీ క్షమించనని తెలిపినట్లు పేర్కొన్నాయి.
* ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా (Ukraine-Russia) తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు (Indian nationals) కనిపించకుండా పోయినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు 12 మంది మృతిచెందినట్లు తెలిపారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో తరఫున 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉంది. అందులో 96 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారు. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారు. మరికొందరు రష్యా దళాలతో పనిచేయడం లేదు. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారు. వారిలో 16 మంది ఆచూకీ లేదు. రష్యా వారిని మిస్సింగ్ కేటగిరీలో చేర్చింది. అలాగే ఇప్పటివరకు యుద్ధంలో పోరాడుతూ 12 మంది మరణించారు’’ అని జైస్వాల్ వెల్లడించారు. మిగిలిన వారిని త్వరగా స్వదేశానికి రప్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు’’
* గ్రూప్-2 ప్రాథమిక కీ 18న (శనివారం) విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ(TGPSC) ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
* సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
* భారత్‌లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)పై ప్రస్తుత స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ గత వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. తనను టోర్నీ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంలో ఆనంద్‌తో పాటు ఫిడే అధికారులు ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. వాటిపై తాజాగా ఫిడే అధ్యక్షుడు ఆర్కడే డ్వోర్కోవిచ్ ఘాటుగా స్పందించాడు. ఆనంద్ వంటి సీనియర్‌లతో పాటు ఫిడే అధికారులపై ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఇక్కడెవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదని హితవు పలికాడు.
* విశాఖ ఉక్కు పరిరక్షణకు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రిని కలిసినప్పుడల్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశమే ప్రధాన ఎజెండాగా చర్చించారని గుర్తు చేశారు. ప్యాకేజీ రావడానికి కృషి చేసిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కుమారస్వామి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు.
* సుప్రీంకోర్టులో ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా,జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు శుక్రవారం(జనవరి 17) విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరపున కేసు వాదించాల్సిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ఎవరూ ఊహించని ఒక విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.బెయిల్ పిటిషన్‌పై ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, తమకు తెలియకుండానే ఈడీ దానిని ఫైల్ చేసిందని ధర్మాసనానికి తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ మీకు తెలియకుండా అఫిడవిట్ ఎలా ఫైల్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ను తాము క్రాస్‌చెక్ చేసుకోలేదని, ఇది ముమ్మాటికి ఈడీ తప్పేనని ఎస్‌వీరాజు బదులిచ్చారు.కేసు మంగళవారినికి వాయిదా వేస్తే ఈడీ తరపున కోర్టుకు ఆ సంస్థ ఉన్నతాధికారిని పిలిపిస్తానని చెప్పారు. దీనికి ఒప్పుకోని బెంచ్ మళ్లీ కాసేపటి తర్వాత కేసు వింటామని చెప్పింది. తిరిగి విచారణ ప్రారంభించిన తర్వాత జస్టిస్ ఓకా మాట్లాడుతూ ఇది కచ్చితంగా మీ అడ్వకేట్ ఆన్ రికార్డ్(ఏఓఆర్) తప్పేనని, దీనికి ఈడీని ఎందుకు తప్పుపడుతున్నారని ఏఎస్‌జీ రాజును ప్రశ్నించింది.అఫిడవిట్‌ను చూసుకోకుండా ఫైల్ చేసి, దానిలో తప్పులున్నాయని ఎలా చెప్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని తన క్లైంట్‌ను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఈడీ ఇలాంటి ఎత్తులు వేస్తోందని వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z