Sports

ఖోఖో మహిళల ప్రపంచ కప్పు విజేత భారత్-NewsRoundup-Jan 19 2025

ఖోఖో మహిళల ప్రపంచ కప్పు విజేత భారత్-NewsRoundup-Jan 19 2025

* సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు పయనమవుతున్నారు. దీంతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్‌ ప్లాజా మీదుగా రోజుకు దాదాపు 36 వేల వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈనెల 9 నుంచి ఇవాళ్టి వరకు ప్రతిరోజూ 70 నుంచి 80 వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. సోమవారం కూడా రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్‌ జైన్‌ అనే భక్తుడు భూరి విరాళం సమర్పించారు. రూ.6 కోట్ల మొత్తాన్ని తితిదే ట్రస్టులకు ఇచ్చారు. ఎస్‌వీబీసీ కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టు కోసం రూ. కోటి విలువైన డీడీలను రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. తితిదేకి చెందిన వివిధ ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చారు.

* తెదేపా సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. తెదేపాకు భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారన్నారు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు.

* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే లక్ష్యంగా మాదాపూర్‌లో గంజాయి, హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులకూ గంజాయి అలవాటు చేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.

* ‘శంభో శివ శంభో’తో తెలుగు వారికి చేరువైన నటి అభినయ (Abhinaya). ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా మలయాళ చిత్రం ‘పని’ (Pani). నటుడు జోజూ జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. ఇందులో హీరోయిన్‌పై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. జోజూ జార్జ్‌ మేకింగ్‌ను పలువురు తప్పుపట్టారు. దీనిపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినయ స్పందించారు. దివ్యాంగురాలైన ఆమె.. సైన్‌ లాంగ్వేజ్‌తో తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘తన సినిమాలో ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి? ఎలా తెరకెక్కించాలి? అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయం. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. ఏది ఏమైనా దర్శకుడి మాటే తుది నిర్ణయం. జోజూ గొప్ప నటుడు. ఎన్నో భాషల్లో, ఎంతోమంది పేరు పొందిన దర్శకులతో వర్క్‌ చేసిన అనుభవం ఆయన సొంతం’’ అని అభినయ తెలిపారు. మిగిలిన భాషలతో పోలిస్తే మలయాళంలో యాక్ట్‌ చేయడం కాస్త భిన్నమైన అనుభూతిని అందించిందని ఆమె చెప్పారు. చిత్రీకరణ సమయంలో జోజూ తనకు ఎంతో సాయం చేశారన్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్‌లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. కుంభమేళాలో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

* బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు (Shakib Al Hasan) కష్టకాలం నడుస్తోంది. దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి లీగుల్లో అతడు బౌలింగ్‌ చేయకుండా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అతడికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌ న్యాయస్థానం షకీబ్‌పై అరెస్టు వారెంట్‌ (arrest warrant) జారీ చేసింది. ఐఎఫ్‌ఐసీ బ్యాంకుకు సంబంధించి మూడు లక్షల డాలర్ల చెక్‌ బౌన్స్‌ కేసులో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని కోర్టు షకీబ్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో భాగంగా కోర్టు ఎదుట హాజరు కావాలని గతంలో అతడికి సమన్లు జారీ చేసింది. కానీ, షకీబ్‌ స్పందించలేదు. దీంతో ఆయనపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షకీబ్‌తో పాటు మరో వ్యక్తిపై కూడా అరెస్టు వారెంట్ జారీ అయింది.

* విపత్తుల వేళ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలను ఇతర దేశాల నేతలూ ప్రశంసించారని గుర్తుచేశారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌షా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం

* అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికా కాబోయే అధ్యక్షుడితో ముకేశ్‌-నీతా అంబానీలు సమావేశమైన ఫొటో ప్రస్తుతం బయటకు వచ్చింది. అయితే, తాజా భేటీలో అంబానీ-ట్రంప్‌ (Ambani Meets Trump) చర్చలకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

* సింగపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఆదివారం సింగపూర్‌ బిజినెస్ ఫెడరేషన్‌ ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరిపింది. ఇండియన్‌ ఓషియన్‌ గ్రూప్‌ సీఈవో ప్రదీప్‌, డీబీఎస్‌, బ్లాక్‌స్టోన్‌, మైన్‌ హార్డ్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ సమావేశమయ్యారు.

* ఖోఖో ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 78-40తో నేపాల్‌ను చిత్తు చేసింది. ఖోఖో ప్రపంచ కప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తుది పోరు టర్న్‌1లో భారత్‌ దూకుడుగా ఆడి 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. తర్వాత నేపాల్‌ పుంజుకోవడంతో 35-24తో రెండో టర్న్‌ ముగిసింది. మూడో టర్న్‌లో భారత్ మళ్లీ దూకుడు పెంచి వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 49కి పెంచుకుంది. చివరి టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు సాధించడంతో 38 పాయింట్లతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది.

* బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Ali Khan) ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ విమర్శించాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఎన్సీపీ (NCP) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఆరోపణలను ఖండించారు. సైఫ్‌పై దాడికి దిగిన వ్యక్తికి అదొక సెలబ్రిటీ నివాసమనే విషయం తెలియదని అన్నారు. ‘‘ముంబయిలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి సైఫ్‌పై దాడి ఘటనలో నిందితుడికి అది ఒక ప్రముఖ నటుడి నివాసం అనే విషయం తెలియదు. తొలుత అతడు బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చి కోల్‌కతాలో ఉన్నాడు. అనంతరం కుటుంబంతో సహా ముంబయికి మకాం మార్చాడు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్‌ నివాసంలోకి ప్రవేశించాడు. అంతే తప్ప నిందితుడికి అసలు విషయం తెలియదు’’ అని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు.

* పవిత్ర తన జీవితంలోకి వచ్చాక.. టైటానిక్‌ ఒడ్డుకు చేరిందంటూ సీనియర్‌ నటుడు నరేశ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనకు ఎదురైన ప్రశ్నపై నరేశ్‌ స్పందించారు. తనను అర్థం చేసుకునే తోడు దొరకడం వరం లాంటిది అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z