Business

తగ్గిన జొమాటో లాభం-BusinessNews-Jan 20 2025

తగ్గిన జొమాటో లాభం-BusinessNews-Jan 20 2025

* నల్ల సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి ఉత్తర్వులూ వెలువరించలేదని స్పష్టంచేసింది. ఆర్‌బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘కొత్త ఏడాదిలో కొత్త రూల్‌. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’’ అంటూ ఓ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ వార్తా సంస్థ ప్రచురించిన వార్తగా దీన్ని సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఇది సామాన్యుల్లో గందరగోళానికి దారితీసిన నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పందించింది. చెక్కులపై రాతకు సంబంధించి ఆర్‌బీఐ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని స్పష్టంచేసింది.

* గౌతమ్‌ అదానీ.. ఇప్పట్లో ఈ పేరు తెలియనివారుండరు. పోర్టులు, మైనింగ్‌, విమానాశ్రయాలు, గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ తదితర వ్యాపారాలు ఆయన సొంతం. ప్రపంచ కుబేరుల్లో 19వ స్థానంలో ఉన్న ఆయన సంపద గంటకు రూ.కోట్లలోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి 19 ఏళ్లకే ట్రేడింగ్‌ను ప్రారంభించడమే కాదు.. రూ.10వేలు కమీషన్‌గా కూడా అందుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అదానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన వ్యాపార ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు. ‘‘అప్పట్లో నాకు 16 ఏళ్లు. అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గుజరాత్‌ మెయిల్‌ ఎక్కి ముంబయి చేరుకున్నా. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. తొలుత వజ్రాల వ్యాపారం నిర్వహించే ఓ కంపెనీలో చేరా. అక్కడే ట్రేడింగ్‌ మెలకువలు నేర్చుకున్నా. మూడేళ్ల తర్వాత ముంబయిలోని జవేరీ బజార్‌లో 19 ఏళ్లకే సొంతంగా డైమండ్‌ ట్రేడింగ్‌ బ్రోకరేజీ వ్యాపారం మొదలుపెట్టా. అప్పట్లో జపాన్‌కు చెందిన బయ్యర్‌ తొలి ట్రేడ్‌ నిర్వహించాడు. దాని ద్వారా నాకు రూ.10వేలు కమీషన్‌ రూపంలో వచ్చాయి. అలా నా వ్యాపార ప్రయాణం మొదలైంది’’ అంటూ తొలినాళ్లను గౌతమ్‌ అదానీ గుర్తుచేసుకున్నారు.

* టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ సోమవారం తన సరికొత్త కింగ్‌ ఈవీ మ్యాక్స్‌ (TVS King EV MAX) విద్యుత్ త్రిచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ పర్యావరణ అనుకూల వాహనాన్ని కంపెనీ పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించింది. ఇది 51.2V లిథియం అయాన్‌ LFP బ్యాటరీతో వస్తోంది. సింగిల్‌ ఛార్జ్‌పై 179 కి.మీలు ప్రయాణిస్తుంది. కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 0-80%, 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ అవుతుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 60 కి.మీ. ఈ వాహనంలో రియల్‌ టైం డయాగ్నొస్టిక్స్‌, నావిగేషన్‌, అలర్ట్స్ కోసం టీవీఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌ సదుపాయం కూడా ఉంది. ఈ వాహనాలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.2,95,000 (ఎక్స్‌-షోరూం). ఇది దేశంలో మొట్టమొదటి బ్లూటూత్‌ గల విద్యుత్ త్రిచక్ర వాహనం అని కంపెనీ తెలిపింది. ఈ వాహనం విశాలమైన క్యాబిన్‌, సౌకర్యవంతమైన సీటింగ్‌ను కలిగి ఉంది.

* ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 57.2 శాతం క్షీణించడం గమనార్హం. గతేడాది రూ.138 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన జొమాటో.. గత త్రైమాసికంలో రూ.176 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 64 శాతం మేర పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3288 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ సారి రూ.5405 కోట్లకు పెరిగింది. ఖర్చులు సైతం రూ.3,383 కోట్ల నుంచి రూ.5,533 కోట్లకు ఎగబాకినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫలితాల నేపథ్యంలో రోజంతా లాభాల్లో పయనించిన జొమాటో షేరు.. ఫలితాల అనంతరం బీఎస్‌ఈలో 3 శాతం మేర క్షీణించి రూ.240 వద్ద ముగిసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు.. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్‌ సూచీలు రాణించాయి. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్ల మేర సెన్సెక్స్‌ లాభపడగా.. నిఫ్టీ 23,300 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్‌ ఉదయం 76,978.53 (క్రితం ముగింపు 76,619.33) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,584.84- 77,318.94 మధ్య కదలాడింది. చివరికి 454.11 పాయింట్ల లాభంతో 77,073.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 141.55 పాయింట్ల లాభంతో 23,344.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 86.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి. జొమాటో, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 80 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2760 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z