WorldWonders

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు సవరించిన గూగుల్ మ్యాప్స్ – NewsRoundup – Jan 28 2025

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు సవరించిన గూగుల్ మ్యాప్స్ – NewsRoundup – Jan 28 2025

* తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సునీత.. స్వామివారిని కీర్తిస్తూ అద్భుతంగా పాట పాడి అలరించారు. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.

* ఇటీవల ‘గేమ్‌ ఛేంజర్‌’తో ప్రేక్షకులను పలకరించారు అగ్ర కథానాయకుడు రామ్ చరణ్‌. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. తాజాగా రామ్‌చరణ్‌ (Ram Charan) ఇదే బ్యానర్‌పై మరో సినిమా చేయనున్నట్లు జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. దీనిపై ఆయన టీమ్‌ స్పందించి ఆ వార్తలను ఖండించింది. ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ మరో సినిమా చేయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. దిల్‌రాజు బ్యానర్‌పై మరో సినిమా ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా రానుంది’’ అని టీమ్‌ పేర్కొంది. దీంతో ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్ పడింది.

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Maha Kumbh mela) ఘనంగా జరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఇంతమందికి సౌకర్యాలు కల్పించడమంటే మాటలా? అంతేకాదు ఇంతమందికి ఎలాంటి అంతరాయం లేకుండా టెలికాం సేవలు అందించడమూ కత్తిమీద సామే. అలాంటిది భక్తజనం పోటెత్తుతున్నా కాల్స్‌కు అంతరాయం లేకుండా, మెరుగైన ఇంటర్నెట్ సేవల్ని స్థానిక యంత్రాంగంతో కలిసి టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. మహా కుంభమేళాకు వచ్చే ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా నెట్‌వర్క్‌ సేవల్ని అందించాలనే లక్ష్యంతో దాదాపు అన్ని టెలికాం సంస్థలు ఈ ప్రాంతంలో తమ సేవల్ని పెంచుకున్నాయని ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్‌ (ICCC) నిర్వాహకులు తెలిపారు. ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా కలిసి కుంభమేళా జరిగే ప్రాంతంలో మూడు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్‌ కోసం, సంక్షోభ పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టేందుకు ఇవి సాయం చేస్తాయని తెలిపారు. అంతేకాదు టెలికాం ప్రొవైడర్లు 53 వరకు సహాయక కేంద్రాల్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

* బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan).. దక్షిణాది కథానాయకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ‘గ్లోబల్‌ విలేజ్‌’ కార్యక్రమానికి ఆయన హాజరై సందడి చేశారు. వేదికపై డ్యాన్స్‌ చేసి అతిథులను అలరించారు. అనంతరం మాట్లాడుతూ సౌతిండియా స్టార్స్‌ ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, యశ్‌, రజనీకాంత్‌, విజయ్‌ తదితరులు తన స్నేహితులని పేర్కొన్నారు. వేగంగా డ్యాన్స్‌ చేయడం ఆపేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. డ్యాన్స్‌ విషయంలో వారిని ఫాలో అవడం కష్టమంటూ నవ్వులు పూయించారు. ఆయా హీరోల పేర్లను షారుక్‌ ప్రస్తావిస్తుండగా.. అభిమానుల కేరింతలతో ప్రాంగణం హోరెత్తింది.

* అసెంబ్లీ ఎన్నికల వేళ దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి ఆతిశీకి (Atishi) ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా భాజపా దాఖలు చేసిన పరువునష్టం (Defamation Case) పిటిషన్‌ను నగరంలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఆమె మొత్తం పార్టీని ఉద్దేశించి మాట్లాడారని.. ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించలేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆమెకు ఈ కేసులో ఉపశమనం లభించింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశీ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీలో చేరకపోతే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆప్‌ నేతలను అరెస్టు చేస్తుందని కాషాయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశీకి వ్యతిరేకంగా భాజపా నేత ప్రవీణ్‌ శంకర్ కపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

* జూన్‌ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్‌ కమిటీలు, 1100 ట్రస్ట్‌ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని తెలిపారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్‌ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.

* వైట్‌హౌస్‌ (White House)లో టెస్లా అధినేత మస్క్‌ (Elon Musk)కు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఖండించారు. మస్క్‌ నేతృత్వంలో పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కు ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే అది వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో కాదని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోని పశ్చిమవైపు ఉన్న ఓవల్‌ ఆఫీస్‌లో మస్క్‌కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

* ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్గొండ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్‌ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారన్న ఆయన.. వరి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్‌ వన్‌ చేశారని చెప్పారు. నల్గొండ క్లాక్‌టవర్‌ కూడలిలో భారాస రైతు మహా ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సహా పలువురు ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొ్న్నారు. తొలుత నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్‌ నివాళులర్పించారు. అక్కడి నుంచి క్లాక్‌ టవర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

* ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై ఉన్న సీఐడీ కేసులను సీబీఐ(CBI)కి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్‌ అని జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

* అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పనరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలోఉంది. ట్రంప్‌ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దానిని భర్తీ చేసుకొనేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ‘‘అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళుతున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు.. మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను’’ అని రిపబ్లికన్‌ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

* గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో (Gulf of Mexico) పేరును గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా చూపించనుంది. ఈ నెల 25న గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మ్యాప్స్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఇది అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అది గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోగానే ఉంటుందని స్పష్టం చేసింది. అధికారికంగా అప్‌డేట్‌లు వచ్చినప్పుడు తాము కూడా మార్పులు చేస్తామని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z