* బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు ఆకాశ్ దీప్ సబీర్. తన భార్య షెబాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ దంపతులపై విమర్శలు చేశారు. రూ.కోట్లలో డబ్బు సంపాదిస్తున్నా ఇంటివద్ద సరైన భద్రత ఏర్పాటుచేసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. నటీనటుల పారితోషికం గురించి మాట్లాడిన ఆకాశ్ దీప్ అల్లు అర్జున్ (Allu Arjun)కు ఉన్న స్టార్ ఇమేజ్ వల్లే ‘పుష్ప’ (Pushpa)ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారని.. అంతేకానీ రష్మిక (Rashmika) వల్ల కాదని అన్నారు. అందుకే ఆయనకు రూ.100 కోట్లు పారితోషికం అందగా ఆమె రూ.10 కోట్లు మాత్రమే ముట్టిందని వ్యాఖ్యానించారు. ఇందులోభాగంగా ఆయన కరీనా కపూర్‌పై విమర్శలు చేశారు. ‘‘రూ.21 కోట్లు పారితోషికం అందుతున్నా.. కరీనాకపూర్ మాత్రం తన ఇంటి బయట ఫుల్ టైమ్ వాచ్‌మెన్‌ను నియమించుకోలేకపోయారు. ఒకవేళ వాళ్లకు రూ.100 కోట్లు రెమ్యూ నరేషన్ ఇస్తే వాళ్లు సెక్యూరిటీ, డ్రైవర్‌ను పెట్టుకుంటారేమో’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
* ఆస్తి తగాదాల విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా సమీకృత కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం ఇరువురు వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్దిరోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్‌బాబు లేఖ పంపించారు.
* సినీ నిర్మాత, డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ‘కబాలి’ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కేపీ చౌదరి.. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరించారు. సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారం ఇచ్చారు.
* కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని.. చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్‌తో సమావేశమయ్యారు. కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పర్చూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
* తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ బాలీవుడ్ దంపతులు ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం గూగుల్‌కు నోటీసులు ఇచ్చింది. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికలు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఆమె రెండోసారి పిటిషన్ వేశారు.
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం విషయంలో తన పర్యటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ ఆరోపణలను ఖండించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికా పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’’ అంటూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన విదేశాంగ మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పేవి అవాస్తవమని కొట్టిపారేశారు.
* ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)ను నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూసూద్ (Sonusood) సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఫౌండేషన్ అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
* దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారానికి తెర పడింది. సాయంత్రం 5గంటలకు అన్ని రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం (Election Commission).. ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది.
* హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam).. విలన్ క్యారెక్టర్లోనూ తెరపై కనిపించనున్నట్టు చెప్పారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా మీమర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ మీమర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. విలన్ పాత్రలు పోషించడంపై బ్రహ్మానందం స్పష్టత ఇచ్చారు.
* తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎస్వీ వర్సిటీ సెనెట్ హాల్లో కాసేపట్లో ఈ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరించారు. ఎస్వీయూ ప్రధాన గేటు వద్ద పోలీసులు తనిఖీలు చేసి కార్పొరేటర్లను లోపలికి పంపుతున్నారు. పరిపాలనా భవనం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎస్వీ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు సెనెట్ హాల్‌కు చేరుకున్నారు. వారి బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z