* చాట్‌జీపీటీ సేవలను పొందడానికి +18002428478 నంబర్‌ను ఓపెన్ఏఐ గతేడాది డిసెంబర్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌ను కాంటాక్ట్‌లో సేవ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ బదులిస్తుంది. ఇంతకుముందు చాట్‌జీపీటీ వెబ్‌సైట్, యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ సదుపాయంతో వాట్సప్‌లోనే ఎంచక్కా వాడుకోవచ్చు. అయితే, రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. పరిమితి దగ్గర పడ్డాక నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది.
* తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ (NTR) కృతజ్ఞతలు తెలిపారు. తనను కలుసుకోవడానికి పాదయాత్రల్లాంటివి చేయొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. వారి ఆనందమే కాదు సంక్షేమం కూడా తనకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని.. త్వరలో వారి కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతి, అధికారులతో సమన్వయం, శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అభిమానులు ఓపికగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు. సంబంధిత స్టేట్‌మెంట్‌ను ఎన్టీఆర్ టీమ్ విడుదల చేసింది. కుప్పం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్‌లో పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే.
* సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది. సీఆర్‌డీఏ మినహా అన్ని చోట్లా అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్‌ప్లానర్లు కూడా దరఖాస్తు చేసేలా అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
* గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ (జనాభా 3.288 శాతం), గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ (జనాభా 62.74 శాతం), గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ (జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ వర్గీకరణ, కులగణన.. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశాలు. ఫిబ్రవరి 4, 2025.. నా రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
* ‘జాక్వెస్ కలిస్ అత్యుత్తమ క్రికెటర్. మిగతా వారందరి సంగతి నాకు తెలియదు. నా వరకు అతనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ క్రికెటర్. టెస్టుల్లో 13,000 పరుగులు, 45 సెంచరీలు, 300 వికెట్లు. మిగతా వారు తమ కెరీర్‌లో బ్యాటింగ్‌లో లేదా బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలను కలిగి ఉండవచ్చు. కలిస్ మాత్రం ఈ రెండింటిని కలిగి ఉన్నాడు. స్లిప్స్‌లో అతను అసాధారణ ఫీల్డర్. అతనికి తగినంత గుర్తింపు దక్కలేదు. ఎందుకంటే కలిస్ ఎక్కువగా మాట్లాడడు. అది అతని వ్యక్తిత్వం. అతడిని మీడియా ఎప్పుడూ హైలైట్ చేయలేదు’ అని పాంటింగ్ వివరించాడు.
* ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్యాకేజి సార్టు పవన్ కల్యాణ్, షర్మిలాగే తెలంగాణలో చిన్నోడు ఒకడొచ్చాడని అన్నారు. అతని పేరు తీన్మార్ మల్లన్న అని చెప్పారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్నపై అనేక రౌడీ షీటర్లు ఉన్నాయని తెలిపారు. వైసీపీ ఎంపీ అయిన ఆర్.కృష్ణయ్యతో రాజీనామా చేయించకముందే.. బీజేపీ ఆయన్ను తొత్తుగా వాడుకుంటుందని చెప్పానని కేఏ పాల్ తెలిపారు. అప్పుడు జగన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని అన్నారు. అప్పుడు జగన్‌ను ఆర్.కృష్ణయ్య ప్రశంసించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు పొందారని విమర్శించారు. అలాగే ఏపీలో ప్యాకేజి సార్టు పవన్ కల్యాణ్, షర్మిలాగే తెలంగాణలో తీన్మార్ మల్లన్న వచ్చాడని అన్నారు. నేను బీసీని అని పాట పాడుతూ.. ఆర్.కృష్ణయ్యతో కలిసి 80 కోట్లు ఖర్చు పెట్టి మరీ నిన్న మీటింగ్ పెట్టాడని అన్నారు. మన బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
* తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్రిక్త వాతావరణం తర్వాత జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. అయితే, టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్‌రాయల్, అమర్‌నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. ఎన్నిక తర్వాత మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద కనిపించారు. ఆ ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు కూడా భూమన కాళ్ల మీద పడి తప్పయ్యిందని ఒప్పుకున్నారు. తమను బెదిరించి కూటమి అభ్యర్థికి ఓటు వేయించుకున్నారని తెలిపారు. తాము ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని.. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని పేర్కొన్నారు.
* అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) నానాటికీ అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరో ముగ్గురు వారికి తోడవడంతో ఆ సంఖ్య 13కు చేరింది. మంత్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే సమావేశం నిర్వహించినంట్లు ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా, ఆపరేషన్ రోప్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి తన అసంతృప్తిని అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేదల ఇండ్లు కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైడ్రా, అధికారుల విషయంలో కూడా వెనక్కి తగ్గేదిలేదన్నారు. తాను కాంప్రమైజ్ కాలేదు.. కాబోనని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని వెల్లడించారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నాయని తెలిపారు. తన ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి. వారి ఫొటోలు ఉంటే తప్పేంటి. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వాళ్లది అంటూ చెప్పుకొచ్చారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన విషయాన్ని ప్రస్తావిచంగా.. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదు.. వచ్చాక స్పందిస్తానన్నారు.
* బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఏకంగా 4.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి ఔరా అనిపించింది. శ్రేష్ఠమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఇవి ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి కాసుల పంట పండించింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. సాధారణంగా ఇదే జాతికి చెందిన ఆవుల కంటే దీని బరువు రెట్టింపు కావడం గమనార్హం. ఈ నెల్లూరు జాతి మన దేశానికి చెందినదే. వీటినే ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉన్న వీటికి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతా ల్లో భారీ డిమాండ్ ఉంది. 1800లలో ఈ జాతి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. కండరాల నిర్మాణం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వీటిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
* వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం(ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వైఎస్ జగన్ సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z